తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునః పరిశీలన కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ఆర్థో, ఈఎన్‌టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.
మలేరియాను తరిమికొట్టాలి
గుంటూరు వెస్ట్: సమాజం నుంచి మలేరియాను తరిమికొట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మలేరియా అంతం– మనతోనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఏ.శ్రావణ్ బాబు, డాక్టర్ సీహెచ్. రత్న మన్‌మోహన్, డాక్టర్ రత్న, సుబ్బరాయణం పాల్గొన్నారు.
● స్వర్ణాంధ్ర–2047కు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలోనూ విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అధికారులు, నియోజకవర్గ విజన్ ప్లాన్ యాక్షన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధి రేటు 15 శాతం సాధించే లక్ష్యంతో నియోజకవర్గాల్లోనూ శాసన సభ్యులను సమన్వయం చేసుకుంటూ అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన ఎం.శశితేజ కుటుంబం రూ. 1,01,116 విరా ళాన్ని అందజేసింది. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
నేడు వేట నిషేధ కాల భృతి పంపిణీ
బాపట్ల: మత్స్యకారులకు వేట నిషేధకాల భృతి పంపిణీని శనివారం నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత్స్యకారుల వేట నిషేధ కాల భృతి 12,671మందికి రూ.25.34లక్షలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో 7,304 మందికి, బాపట్లలో 1441 మందికి, చీరాలలో 2,836 మందికి, పర్చూరులో 1090 మందికి రూ.20 వేల వంతున పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
గుండ్లకమ్మ వాగులో పడి బాలిక మృతి
నూజెండ్ల: ప్రమాదవశాత్తు గుండ్లకమ్మ వాగులో జారి పడి బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవారం పాత ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చీకటి విజయరాజు, కృపావరం దంపతుల సంతానం కీర్తి (10)నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావటంతో సమీపంలోని గుండ్లకమ్మ నది వద్దకు ఆడుకుంటూ వెళ్లింది. వాగులో జారిపడి కాళ్లు పూడికలో కూరుకుపోవడంతో మృతి చెంది ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం అందించారు.
పాకిస్థాన్ పౌరులు ఉంటే వెళ్లిపోవాలి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పాకిస్థాన్ వీసాలతో జిల్లాలో ఉండే ఆ దేశపౌరులు ఈనెల 27వ తేదీ కల్లా దేశం విడిచిపోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశం విడిచివెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారికి ఆతిథ్యం కల్పించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముగిసిన సదరం క్యాంప్