
కూటమిలో ‘మేయర్’ గుబులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమిలో మేయర్ ఎంపిక గుబులు మొదలైంది. ఈ నెల 28న ఎన్నిక ఉండటంతో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చించారు. మేయర్ ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రకటించడంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. పలువురు కార్పొరేటర్లను కొనుగోలు చేసి స్థాయీ సంఘాన్ని దక్కించుకున్న కూటమి మేయర్ ఎన్నికపై దృష్టి పెట్టింది. మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేయడంతో వారు ఈ పదవికి తమ పార్టీ తరఫున కోవెలమూడి రవీంద్ర (నాని)ను బరిలోకి దింపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోనే మెజారిటీ కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆయన ఖర్చు పెట్టాడు. పార్టీ కోసం పని చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం రవీంద్రను అభ్యర్థిగా నిర్ణయించింది. దీన్ని ఎవరూ వ్యతిరేకించవద్దంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. శనివారం నుంచి కార్పొరేటర్లతో క్యాంపు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
తేలని డెప్యూటీ మేయర్ అభ్యర్థి
ప్రస్తుతం కూటమికి మద్దతుగా 29 మంది ఉన్నారు. డెప్యూటీ మేయర్ అంశం రెండు పార్టీల్లో కొంత విభేదాలకు దారితీస్తోంది. డెప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మల రమణను మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రతో పాటు మరికొందరు తెలుగుదేశం నాయకులు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని జనసేనలో మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి జనసేనలో ఉన్న వారికే అవకాశం కల్పించాలని పట్టుపడుతున్నారు. దీంతో మేయర్ ఎన్నిక అయిన తర్వాత డెప్యూటీ మేయర్ డైమండ్‌బాబుపై అవిశ్వాసం పెట్టిన తర్వాత అభ్యర్థి విషయం ఆలోచిద్దామని, తొందరపడవద్దని పెద్దలు సూచించినట్లు సమాచారం.
పోటీ చేస్తున్నట్టు ప్రకటించినవైఎస్సార్ సీపీ డెప్యూటీ మేయర్ కావాలంటూ జనసేన పట్టు 28న మేయర్ ఎంపికకునోటిఫికేషన్ ఒక హోటల్‌లో కూటమి నేతల సమావేశం
రవీంద్ర వ్యాఖ్యలపై కేడర్ మండిపాటు
శుక్రవారం జరిగిన సమావేశంలో తెలుగుదేశం మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలని ఒత్తిడి ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ మండిపడుతోంది. శుక్రవారం సాయంత్రం వన్‌టౌన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఈ విషయమై రవీంద్రను నిలదీసినట్లు సమాచారం. మొదటి నుంచి కష్టపడిన వారిని పక్కన పెట్టి అవసరం కోసం పార్టీలోకి తెచ్చిన వారికి సీట్లు ఎలా ఇమ్మని అడుగుతారంటూ నిలదీశారు. దీంతో కంగుతిన్న రవీంద్ర వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి బయటపడినట్లు తెలిసింది.