రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్‌ పార్క్‌ | Edlapadu Spices Park: Many Benefits to Farmers, Food Processing Units | Sakshi
Sakshi News home page

రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్‌ పార్క్‌   

Published Wed, Jun 29 2022 6:50 PM | Last Updated on Wed, Jun 29 2022 7:06 PM

Edlapadu Spices Park: Many Benefits to Farmers, Food Processing‌ Units - Sakshi

స్పైసెస్‌ పార్కు ఏరియల్‌ వ్యూ

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక యడ్లపాడు స్పైసెస్‌ పార్కు ప్రస్తుతం రైతులకు మేలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే.. రూ.వంద కోట్ల భారీ కలల ప్రాజెక్టు సాకారమవుతుంది. రైతులు, వ్యాపారులు ఆర్థిక పురోగతి సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా ఎగుమతులు ఊపందుకుంటాయి.   

యడ్లపాడు: మిరప, పసుపు తదితర పంట ఉత్పత్తులను ముడి రూపంలో ఎగుమతి చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో సుంగంధ ద్రవ్యాల ఆదాయంలో మన వాటాను పెంచుకోవాలంటే మేలు రక వంగడాల ఉత్పత్తితోపాటు పంట దిగుబడులను గ్రేడింగ్‌ చేసి పొడులు, ఇతరత్రా రూపాల్లో వివిధ సైజుల్లో ప్యాకింగ్‌ చేస్తే ఎగుమతులు పుంజుకుంటాయి. అందుకే ప్రభుత్వం ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లా యడ్లపాడులో దేశంలోనే అతిపెద్ద సుంగంధ ద్రవ్యాల(స్పైసెస్‌) పార్కును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, స్పైసెస్‌ బోర్డు ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలో 124.79 ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పార్కును నిర్మించడం విశేషం.   

వైఎస్సార్‌ చలువే  
దేశంలో 6 చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2007లో కేంద్రప్రభుత్వం భావించింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏపీకి స్పైసెస్‌ పార్కు కేటాయించాలని కేంద్రాన్ని పట్టుబట్టారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 60 శాతం ఏపీలోనే.. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుందని, అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి కేంద్రం ఆమోదాన్ని పొందారు. వెనువెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2015లో పార్కు నిర్మాణం పూర్తయింది.   


పార్కు వల్ల ప్రయోజనాలు  

► రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందేందుకు ఎగుమతిదారులతో ప్రత్యక్ష మార్కెట్‌ అనుసంధానాన్ని ఏర్పరుచుకోవాలి. దీనికి ఈ పార్కు ఎంతో దోహదపడుతుంది.  
► క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్‌ కోసం సాధారణ అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.  
► నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిర్ధారణకు దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి ధర లభిస్తుంది.   


ఇంకా ఏమేం వస్తాయి?  

► పార్కులో ఇంకా గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్‌ స్టెరిలైజేషన్, స్టీమ్, చిల్లీపౌడర్, చిల్లీపేస్ట్, క్లోనింగ్‌ ఎక్స్‌పోర్టుకు కావాల్సిన ప్యాకింగ్‌ సిస్టం 
వంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.  
► మిర్చి నుంచి రంగు, ఘాటు వేరు చేసే యూనిట్లు, ఓలియేరేజిన్‌ వంటివి తయారు చేసేవి, మసాల తయారీ, వివిధ మిర్చి ఉత్పత్తుల యూనిట్లు త్వరలోనే రానున్నాయి.   
► ఈ రంగంలో ఇప్పటికే పేరున్న బహుళ జాతి కంపెనీలూ ఇక్కడ సొంత యూనిట్లు ప్రారంభించనున్నాయి.   
► చిల్లీ డ్రైయర్స్, లేబొరేటరీస్, వేబ్రిడ్జిలు, బ్యాకింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.    
► మిర్చి, పసుపు అనుబంధన సంస్థలు, కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.


స్పైసెస్‌ పార్కు అభివృద్ధికి కృషి  

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి వల్లే స్పైసెస్‌  పార్కు ఏర్పాటైంది. దీని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ పార్కు వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పార్కుకు వెళ్లే ప్రధాన మార్గం విస్తరణకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.   
– విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

శీతల గిడ్డంగులతో ఉపయోగం  
శీతల గిడ్డంగుల వల్ల రైతులకు మేలు కలుగుతోంది. గతంలో పంట ఉత్పత్తులను గుంటూరుకు తీసుకువెళ్లేవారం. ఇప్పుడు స్పైసెస్‌ పార్కులో గిడ్డంగులు ఉండడంతో దూరంతోపాటు రవాణా భారం తగ్గింది.  
– బండారు వెంకటసాంబశివరావు, మిర్చిరైతు, వంకాయలపాడు గ్రామం

మిర్చి రైతులకు బంగారు భవిత   
గతంలో పంటను భద్రపరిచే అవకాశం లేక మిర్చి పంటను కల్లాల్లోనే తెగనమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం స్పైసెస్‌పార్కులో రెండు కోల్డ్‌స్టోరేజీలు రావడంతో సరైన ధర వచ్చేవరకు భద్రపరుచు కుంటున్నాం. ప్రాసెసింగ్‌ యూనిట్లూ రావడంతో మేమే గ్రేడింగ్‌ చేసుకుంటున్నాం. పార్కు వల్ల మా భవిత బంగారంలా ఉంటుంది.   
– కర్రా పెదరాజారావు, మిర్చిరైతు జాలాది గ్రామం 

రైతుకు భరోసా  
స్పైసెస్‌ పార్కులో సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. పార్కు ఏర్పాటైనప్పటి నుంచి మా ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది.  మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. పార్కు రైతుకు భరోసాగా ఉంది.   
– కొసన సాంబశివరావు, రైతు చెంఘీజ్‌ఖాన్‌పేట 


క్యూ కట్టిన కంపెనీలు

ప్రస్తుతం పార్కులో స్పైసెస్‌ బోర్డు సొంతంగా కారంపొడి తయారు యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన పైలెట్‌ స్మి  తిరుచూరు నుంచి రూ.2 కోట్లతో ‘చిల్లీప్రాసెసింగ్‌ యూనిట్‌ మిషన్‌’ను తెప్పించి లీజుకు ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటు కోసం కంపెనీలకు కేటాయించేందుకు బోర్డు 93.42 ఎకరాల విస్తీర్ణాన్ని 58 ప్లాట్లుగా విభజించింది. వీటికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు బోర్డు కేటాయించింది. వీరిలో ఐదుగురు యూనిట్లను  స్థాపించి నిర్వహిస్తున్నారు. డాలి, రామి ఆగ్రో, ఎస్‌ఎంఈ అగ్రిటెక్, స్వమి స్పైస్‌మిల్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, డీకే ఎంటర్‌ప్రైజెస్‌ వంటి మరో ఏడు కంపెనీలు యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టాయి. ఇప్పటికే ఉన్న యూనిట్లలో క్వాలిటీ స్పైసెస్, స్పైస్‌ఎగ్జిన్, నంద్యాల సత్యనారాయణ, ఆగ్రోట్రేడ్, ఐటీసీ, జాబ్స్‌ ఇంటర్నేషనల్‌ యూనిట్లు ప్రధానమైనవి.  


సరుకు నిల్వకు గిడ్డంగులు  

2018లో పార్కులో రూ.53.2 కోట్లతో 4 గోదాములను నిర్మించారు. 12 ఎకరాల్లో ఏర్పాటైన వీటి సామర్థ్యం 23 వేల మెట్రిక్‌ టన్నులు. వీటిలో 13వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఐదంతస్తుల రెండు శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి విద్యుత్‌ అవసరాల కోసం 200కేవీఏ సామర్థ్యంగల రెండు సోలార్‌ యూనిట్లనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనపు నిల్వల కోసం ప్రత్యేక యూనిట్‌ నిర్మించారు.


పంట ఉత్పత్తుల రక్షణ కోసం కావాల్సిన యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. మిర్చి, పసుపు మాత్రమే కాకుండా అపరాలు, బియ్యం, నూనెవస్తువులు, వేరుశనగ, నువ్వులు, కందులు, పెసలు వంటి వాటినీ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. శీతల గిడ్డంగులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. సాధారణ గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తోంది. రాయితీపై సేవలందిస్తోంది. (క్లిక్‌: పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement