సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎండు మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. మార్కెటింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో దళారుల ప్రమేయం తగ్గి, వాస్తవ ధరలు రైతులకు అందుతున్నాయి. చీడపీడల కారణంగా ఏడాది పంట దిగుబడులు తగ్గినా.. ధరలు పెరుగుతుండటం రైతన్నలకు ఊరటనిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 341 మిర్చి రకం ధర ఏకంగా క్వింటాల్ రూ.26 వేలకు చేరింది. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఎండు మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడుతున్నారు.
మూడు నెలల్లో రూ.4,500 పెరుగుదల
మిర్చి పైరుకు గత ఏడాది తెగుళ్లు సోకడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఇదే సందర్భంలో ఎగుమతులు పెరిగాయి. బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఎగుమతి కావడం, దేశీయంగా డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతోపాటు నాణ్యమైన సరుకు లభ్యత తక్కువ ఉండటం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే తేజ, బాడిగ రకాల మిర్చికి గతంలో అధిక ధర ఉండేది. అందుకు భిన్నంగా ప్రస్తుతం 341 రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఈ రకం మిర్చి ధర కనీవినీ ఎరుగని రీతిలో ఎగబాకుతోంది. మార్చి నెలలో 341 మిర్చి క్వింటాల్ రూ.21,500 ధర పలికి రికార్డు సృష్టించింది. ఈ ధర క్రమంగా పెరుగుతూ.. ప్రస్తుతం రూ.26 వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర రకాలదీ అదే దారి
గుంటూరు, నడికుడి, ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో నాణ్యత గల అన్ని రకాల మిర్చి ధరలు పెరుగుతున్నాయి. క్వింటాల్‌కు సగటున రూ.20 వేలకు పైగా పలుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని సైతం కొనేందుకు వ్యాపారులు ఎగబడటంతో సందడి నెలకొంది.
ఈ రకానికి డిమాండ్ ఎందుకంటే..
గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 341 రకం మిర్చిని సాగు చేస్తారు. చిక్కటి ఎర్ర రంగు కలిగి ఉండే ఈ రకాన్ని కారం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశీయంగా పచ్చళ్ల తయారీతోపాటు, గృహావసరాలకు వాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఉత్తర భారతదేశంలో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. కొత్త పంట నవంబర్ వరకు వచ్చే అవకాశం లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్: ఒక్క రూపాయికే పక్కా ఇల్లు)
ఆశాజనకంగా ధరలు
నేను 2020లో రెండెకరాల్లో మిర్చి పంట వేశాను. కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కోల్డ్ స్టోరేజీలో ఉంచాను. ప్రస్తుతం మిర్చి ధర ఆశాజనకంగా ఉంది. అందువల్ల విక్రయిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరిగాయి. ఎంతో సంతోషంగాఉంది.
– వి.శ్రీనివాసరావు, మిర్చి రైతు, సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు మండలం
Comments
Please login to add a commentAdd a comment