ముందు డిజిటల్ హైదరాబాద్
ఆ తర్వాత డిజిటల్ తెలంగాణ: ‘మెట్రోపొలిస్’ సదస్సులో మంత్రి కేటీఆర్
తెలంగాణ కోసం మావద్ద భారీ ప్రణాళికలున్నాయి
గ్లోబల్ కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్
‘సర్వే’ వివరాలను అవసరమైన మేర ఎన్జీవోలు, సంస్థలతో పంచుకుంటామని వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ల అభివృద్ధికి సంబంధించి తమ వద్ద భారీ ప్రణాళికలు ఉన్నాయని... ముందుగా డిజిటల్ హైదరాబాద్‌ను సాధించి, ఆ తర్వాత రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మారుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ప్రణాళికలు రూపొంది స్తున్నామని, దాదాపు 40 శాతం ప్రజలు నగరంలోనే ఉన్నందున మెరుగైన జీవనాన్ని అందించేలా చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. డిజిటల్ హైదరాబాద్‌లో భాగంగా శాస్త్ర సాంకేతిక అంశాలను జోడించి.. 360 డిగ్రీల్లో పట్టణ భౌగోళిక స్థితి, పర్యావరణ పటాన్ని ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆవిష్కరించనున్నామని ఆయన తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందిన వివరాలతో మెరుగైన రెవెన్యూ పరిపాలనను, ఆస్తిపన్ను వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ‘మెట్రోపొలిస్’ సదస్సులో భాగంగా బుధవారం ‘రీ డిఫైనింగ్ అర్బన్ ఎజెండా-బిగ్‌డేట్, బిగ్ చాలెంజెస్, బిగ్ ఐడియాస్’ అంశంపై ఏర్పాటు చేసిన ప్లీనరీలో మంత్రి కె.తారక రామారావు ప్రసంగించారు.
పట్టణ ప్రజలకు అత్యవసర, ఇతర సేవలను మెరుగ్గా అందించేందుకు, పట్టణ పేదలను ఆదుకునే విధంగా పారదర్శకత, కచ్చితత్వంతో ప్రభుత్వం తరఫున చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరమని, రాబోయే 20 ఏళ్లలో పట్టణ జీవనం మరింత కుదుపులకు గురవుతుందని, దానిని తట్టుకునే విధంగా విధానాలను రూపొందిస్తామని చెప్పారు. సామాజిక సర్వే ద్వారా అందిన వివరాలకు సాంకేతిక తను జోడించి... ఉద్యోగులు, ప్రజల సహకారంతో కొనసాగే విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు. బార్సిలోనా, తదితర నగరాల అనుభవాలను అధ్యయనం చేసి గ్లోబల్ కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ విభిన్నం..!
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటె తెలంగాణ భిన్నమైనదని, ఇక్కడ 39 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అద్భుతమైన సమాచారం వచ్చిం దని, ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేందుకు దానిని ఉపయోగిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి ఒక్కో వ్యవస్థ ఒక్కో విధంగా విశ్లేషిస్తుందని... అందువల్ల ఏ నగరానికి అనుగుణంగా ఆ నగరం ప్రణాళికలు రూపొందించుకోవాలని వివరించారు. స్మార్ట్ సిటీ కోసం హైదరాబాద్ తన సొంత ఫార్ములాను సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. రాబో యే రోజుల్లో 70 శాతం ప్రజలు పట్టణాల్లో జీవించనున్నారని, అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా రక్షణ, పచ్చదనంతో కూడిన జీవనాన్ని అందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్లీనరీకి ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ గ్లోబల్ ఫెలో డా.టిమ్ క్యాంప్‌బెల్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. వరల్డ్ బ్యాంక్ ఇన్‌స్టి ట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ వికాస్ కనుంగో, బార్సిలోనా మేయర్ జేవియర్ ట్రాయస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషనర్ అహ్మద్‌బాబు ప్రసంగించారు.
ఆస్తులు, క్రెడిట్‌కార్డుల వివరాలు గోప్యంగా ఉంచుతాం
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన వివరాల్లోని ఆస్తులు, క్రెడిట్‌కార్డులు తదితర సమాచారాన్ని ఎవరికీ ఇవ్వబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతరత్రా సమాచారాన్ని మాత్రం మెరుగైన సేవల కల్పనకు, అవసరమైన మేర ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలిసి పంచుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మెట్రో రైలు మార్గాన్ని రాబోయే 15 ఏళ్లలో 200 కిలోమీటర్లకు పెంచుతామని చెప్పారు. రక్షణతో కూడిన, మురికివాడలు లేని, ఫుట్‌పాత్‌లపై ఎవరూ నిద్రించే పరిస్థితి లేని ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. సౌర విద్యుత్‌తో పాటు చెత్త (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) ద్వారా విద్యుత్ ఉత్పాదనను చేపడతామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వేలోని అంశాలు, ఎన్జీవోలతో వాటిని పంచుకోవడం, హైదరాబాద్‌లో మెరుగైన సదుపాయాల కల్పన అంశాలపై ప్లీనరీలో నయీం అనే యువకుడు, పద్మజ అనే గృహిణి తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు.