సియోల్: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ ఇటీవల జూన్‌లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బీజింగ్‌లోని స్మార్ట్‌ఫోన్స్ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శాంసంగ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు చైనాలో తయారీ నిలిపివేస్తున్న శాంసంగ్.. ఇటు భారత్, వియత్నాం దేశాల్లో తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. దీంతో ఈ దేశాల మార్కెట్లు శాంసంగ్‌కు మరింత కీలకంగా మారుతున్నాయి.
1 శాతానికి పడిపోయిన వాటా..
చైనాలో దేశీ కంపెనీలైన హువావే టెక్నాలజీస్, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు.. దేశీ స్మార్ట్‌ఫోన్లను, కాస్త ఖరీదైనవి కోరుకునే వారు యాపిల్ లేదా హువావే వంటి సంస్థల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2013లో చైనాలో దాదాపు 15 శాతంగా నమోదైన శాంసంగ్ మార్కెట్ వాటా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనాలో తయారీ నిలిపివేసినప్పటికీ.. మొబైల్స్ అమ్మకాలు య«థాప్రకారం కొనసాగుతాయని శాంసంగ్ పేర్కొంది. ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు, పరికరాలను అంతర్జాతీయంగా ఇతర సైట్లకు తరలిస్తున్నట్లు వివరించింది. కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 2017 నాటి గణాంకాల ప్రకారం.. చైనాలో శాంసంగ్ ఉద్యోగులు సుమారు 6,000 మంది ఉండగా, 6.3 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్ 39.4 కోట్ల హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేసింది.
చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై
Published Thu, Oct 3 2019 5:01 AM | Last Updated on Thu, Oct 3 2019 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment