Production shutdown
-
రాణి వెడలె.. బై బై బోయింగ్ 747
విమానయాన చరిత్రలో మహరాణిగా వెలుగొందిన బోయింగ్ 747 విమానం కథ కంచికి చేరింది. 50 ఏళ్లకు పైగా అద్భుతమైన సేవలతో అలరించిన ఈ విమానాల తయారీని బోయింగ్ నిలిపేసింది. చిట్టచివరి విమానం డెలివరీ కూడా తాజాగా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పై చిలుకు బోయింగ్ 747లు సేవలందిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా మూలకు పడ్డ అనంతరం ఈ ముచ్చటైన మోడల్ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి జారుకుంటుంది... 1968, సెప్టెంబర్ 30 అమెరికాలోని వాషింగ్టన్ ఎవెరెట్టెలో కంపెనీ ప్లాంట్ బోయింగ్ 747 మొట్టమొదటి విమానం రాచఠీవితో నిల్చొని ఉంది. భారీ రెక్కలతో ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూడానికి వేలాది మంది అక్కడికి తరలివచ్చారు. అంత పెద్ద విమానాన్ని అప్పటివరకు చూసి ఎరుగని జనం దానినో అద్భుతంలా చూడసాగారు. భవనం లాంటి విమానం అసలు గాల్లో ఎలా ఎగరగలదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణ రూపురేఖల్ని మార్చేసింది. అందుకే బోయింగ్ 747ని క్వీన్ ఆఫ్ స్కైస్ అని పిలుస్తారు. 2023, ఫిబ్రవరి 1 55 సంవత్సరాల తర్వాత.. సరిగ్గా అదే స్థలం ఆకాశానికి రాణిలాంటి బోయింగ్ 747కి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. చిట్టచివరి విమానాన్ని గురువారం అట్లాస్ ఎయిర్‌లైన్స్ సంస్థకు అందజేశారు. ప్రయాణికుల విమానంగా మొదలైన దాని ప్రస్థానం కార్గో విమానంగా ముగిసింది. వీటి తయారీ నిలిపివేస్తున్నట్టు 2020లోనే కంపెనీ ప్రకటించింది. వేలాది మంది ఉద్యోగులతో పాటు ఔత్సాహికులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి తరలి వచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన విమానాన్ని మళ్లీ చూడలేమని బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు. విమానమే ఒక ఇంద్రభవనం విమాన ప్రయాణాల చరిత్రలో బోయింగ్‌కి ముందు, బోయింగ్ తర్వాత అని స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. గంటల తరబడి కూర్చొని దేశ విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణాలు బోయింగ్ రాకతో అత్యంత సౌకర్యవంతంగా మారాయి. సువిశాలంగా ఉండే బోయింగ్ 747 ఎదుట ఇతర విమానాలు ఒక మరుగుజ్జుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్ విమానం ప్రపంచాన్ని కుదించింది. కళ్లు చెదిరే సదుపాయాలతో వీవీఐపీ ప్రయాణికులు మోజు పడేలా 747 విమానాలు రూపుదిద్దుకున్నాయి. బార్లు, డైనింగ్ హాళ్లు, మూవీ స్క్రీన్లు, లగ్జరీ ఇంటీరియర్లు, లాంజ్‌లు, లివింగ్ రూమ్‌లు ఒకటేమిటి ఇదసలువిమానమా, గాల్లో ఎగిరే ఇంద్రభవనమా అని అందరూ అవాక్కయ్యారు. తయారీ నిలిపివేత ఎందుకు? అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. బోయింగ్ విమానానికయ్యే ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ. 2007లో ఏ380 ఎయిర్ బస్ వచ్చిన దాకా బోయింగ్ 747 ప్రభ వెలిగిపోతూనే ఉంది. చమురు రేట్లు ఆకాశాన్నంటుతూ ఉండడంతో బోయింగ్ 747 కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్ సంస్థలు కరువయ్యాయి. యూరప్‌కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్‌బస్ తక్కువ చమురు ఖర్చుతో విమానాలు రూపొందించడంతో బోయింగ్ డిమాండ్ పడిపోయింది. ఏ ఎయిర్‌లైన్స్ కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో 2020లో బోయింగ్ 747 విమానాల తయారీ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రత్యామ్నాయం ఏంటి ? జంబో జెట్లతో చమురు ధరాభారం ఎక్కువగానే ఉన్నా అత్యంత పెద్ద విమానాన్ని రూపొందించడానికి బోయింగ్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇంజిన్లు ఉండే 776ఎక్స్ అని పిలిచే ఈ సరికొత్త జంబో జెట్ 2020లోనే మార్కెట్లోకి రావాల్సి ఉండేది. కానీ కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు పడడంతో విమానాల తయారీ ఆలస్యమవుతోంది. 2025 నాటికి ఈ సరికొత్త విమానాలు తేవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొట్ట మొదటి విమానం ఇలా..! బోయింగ్ 747 కంటే ముందు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన 707 బోయింగ్ విమానం చాలా ఇరుగ్గా ఉండేది. సీట్ల మధ్య రాకపోకలు సాగించడానికి ఒక్కటే మార్గం ఉండేది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకత నెలకొంది. బోయింగ్ 747 రెండు అంతస్తులుతో, నడిచి వెళ్లడానికి రెండు మార్గాలతో అత్యంత సువిశాలంగా ఉండేది. బోయింగ్ 707 విమానం 200 మంది కంటే తక్కువ మంది ప్రయాణికులతో ఏకబిగిన 3 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే, 400 మంది ప్రయాణికుల్ని మోసుకువెళుతూ బోయింగ్ 747 ఏకబిగిన 5వేల నాటికన్ మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ► మొట్టమొదటి విమానాన్ని పాన్ యామ్ సంస్థ జనవరి 15, 1970లో కొనుగోలు చేసింది. తొలిసారి నిర్మించిన 747 విమానం 225 అడుగుల పొడవు ఉంది. దాని తోకభాగం ఆరు అంతస్తుల భవనం ఎంత పొడవు ఉంటుందో అంత ఉండేది. ► జంబో జెట్‌కి చమురు ఖర్చు ఎక్కువ కావడంతో డిజైన్ రూపొందించినప్పుడే కార్గో అవసరాలకు మార్చుకునే విధంగా రూపొందించారు. 3,400 బ్యాగేజ్‌లను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. అదే ఈ విమానాలను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చింది. ► 1990లో తొలిసారిగా బోయింగ్ 747–200 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంగా మార్చారు. ► ఇప్పటివరకు 1,574 విమానాలను తయారు చేశారు. ఇప్పటికీ 500 విమానాలు వాడుకలో ఉన్నాయి. ► ప్రయాణికుల, రవాణాతో పాటు అవసరమైనప్పుడు అంతరిక్షం నుంచి రాకపోకలకి అనుగుణంగా ఈ విమానాన్ని ఆధునీకరించారు. ► ఎయిర్ ఇండియా కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి విస్తృతంగా వినియోగించింది. 1971లో తొలి విమానాన్ని కొనుగోలు చేసింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాంట్లు మూసేయండి – ఉత్పత్తి ఆపేయండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా వాహనాలు, విడిభాగాల తయారీ సంస్థలు కొంత కాలం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసే అంశాలను పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్యలు సూచించాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్), ఆటో కాంపోనెంట్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ).. కంపెనీలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. సిబ్బంది వైరస్ బారిన పడకుండా చూసేందుకు కొంతైనా తోడ్పడగలవని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. బాధ్యతాయుతంగా జాతి నిర్మాణంలో భాగం కావాలన్న సియామ్ నినాదానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్లాంట్ల మూసివేత బాటలో మరిన్ని సంస్థలు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్, టయోటా కిర్లోస్కర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మార్చి 23 నుంచే (సోమవారం) చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించగా, టయోటా కిర్లోస్కర్ .. కర్ణాటకలోని బిడది ప్లాంటులో తయారీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. టీవీఎస్ మోటార్ తమ ప్లాంట్లన్నింటిలోనూ మార్చి 23 నుంచి రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు బజాజ్ ఆటో కూడా తమ ఫ్యాక్టరీల్లో తయారీ కార్యకలాపాలు ఆపేసినట్లు సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్రలోని చకన్‌తో పాటు మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో కూడా ఉత్పత్తి నిలిపివేసినట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సర్వీసుల కోసం స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల విదేశీ ప్రయాణాలను, సమావేశాలను రద్దు చేశామని.. పలువురికి వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేస్తున్నామని శర్మ చెప్పారు. కాంట్రాక్టు ప్రాతిపదికన తమకు వాహనాలు తయారు చేసి అందించే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ) ఉత్పత్తి నిలిపివేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కార్ల తయారీ సంస్థలు కియా మోటార్స్, బీఎండబ్ల్యూ, రెనో కూడా ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ప్లాంటు, కంపెనీ కార్యాలయం కార్యకలాపాలు కొన్నాళ్లు ఆపివేస్తున్నట్లు కియా మోటార్స్ వెల్లడించింది. సిబ్బంది, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వారందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మార్చి నెలాఖరు దాకా తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) తెలిపింది. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ ప్లాంట్లలో మార్చి 23 నుంచి 31 దాకా, తమిళనాడు ప్లాంటులో మార్చి 24 నుంచి 31 దాకా తయారీ కార్యకలాపాలు ఉండవని వివరించింది. మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫియట్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్, సుజుకీ మోటార్‌సైకిల్ వంటి సంస్థలు తయారీని నిలిపివేస్తున్నట్లు ఆదివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై
సియోల్: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ ఇటీవల జూన్‌లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బీజింగ్‌లోని స్మార్ట్‌ఫోన్స్ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శాంసంగ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు చైనాలో తయారీ నిలిపివేస్తున్న శాంసంగ్.. ఇటు భారత్, వియత్నాం దేశాల్లో తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. దీంతో ఈ దేశాల మార్కెట్లు శాంసంగ్‌కు మరింత కీలకంగా మారుతున్నాయి. 1 శాతానికి పడిపోయిన వాటా.. చైనాలో దేశీ కంపెనీలైన హువావే టెక్నాలజీస్, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు.. దేశీ స్మార్ట్ఫోన్లను, కాస్త ఖరీదైనవి కోరుకునే వారు యాపిల్ లేదా హువావే వంటి సంస్థల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2013లో చైనాలో దాదాపు 15 శాతంగా నమోదైన శాంసంగ్ మార్కెట్ వాటా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనాలో తయారీ నిలిపివేసినప్పటికీ.. మొబైల్స్ అమ్మకాలు య«థాప్రకారం కొనసాగుతాయని శాంసంగ్ పేర్కొంది. ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు, పరికరాలను అంతర్జాతీయంగా ఇతర సైట్లకు తరలిస్తున్నట్లు వివరించింది. కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 2017 నాటి గణాంకాల ప్రకారం.. చైనాలో శాంసంగ్ ఉద్యోగులు సుమారు 6,000 మంది ఉండగా, 6.3 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్ 39.4 కోట్ల హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేసింది. -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్.. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
బండి కాదు..మొండి ఇది..!
సాక్షి, బిజినెస్ విభాగం: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్యలో దేశీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13.18% తగ్గిపోయింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టొయోటా, హోండా వంటి దిగ్గజాలన్నీ భారీగా ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రమే ఉత్పత్తిని కాస్త పెంచుకున్నాయి. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది అదే వ్యవధిలో సుమారు 10% పడిపోయి 78,45,675గా నమోదైంది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13,97,404 యూనిట్ల నుంచి 13% క్షీణతతో 12,13,281 యూనిట్లకు పడిపోయింది. ఈ పరిణామాలతో ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటిదాకా ఆటోమొబైల్ రంగంలో (వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, డీలర్లు మొదలైన వర్గాలు) ఇప్పటిదాకా 3.5 లక్షల ఉద్యోగాల్లో కోత పడినట్లు అంచనా. తమ పరిధిలో 15,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, వందలకొద్దీ డీలర్‌షిప్‌లు మూతబడటంతో వేలమంది ఉపాధి కోల్పోయారని సియామ్ స్వయంగా వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇకపై తాత్కాలిక ఉద్యోగులు, సేల్స్.. మార్కెటింగ్ విభాగంలో సర్వీసులు అందించే వారు, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాల్లో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాలు మరింతగా ఉండనున్నాయని మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇదే ధోరణి.. అంతర్జాతీయంగా కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమన ధోరణులే నెలకొన్నాయని, దీనికి భారత్ మినహాయింపేమీ కాదని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. దీంతో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడానికి తమ పరిధిలో తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించుకోవడం, తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేయడం వంటివి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు. మందగమనం ఇలాగే కొనసాగితే రోజువారీ కార్యకలాపాలకు అంతగా ముఖ్యం కాకపోయినా అధిక వేతనాలు అందుకునే వారిని తొలగించడంపై కూడా కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తయారీ విభాగంపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ముఖ్యంగా తాత్కాలిక సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విభాగంలో మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కూడా కోత పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి‘ అని మిశ్రా చెప్పారు. పర్మనెంటు ఉద్యోగులను తొలగించడం అన్నది ఆఖర్న మాత్రమే జరగొచ్చని.. అయితే మందగమన ప్రభావాలు మరింత తీవ్రమైతే ఆయా ఉద్యోగుల బోనస్‌లు, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిల్లో కోత పడొచ్చని తెలిపారు. మరోవైపు, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని సర్వీస్ సిబ్బందిపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ బిజినెస్ హెడ్ మునీరా లోలివాలా అభిప్రాయపడ్డారు. ‘వచ్చే కొద్ది నెలల్లో మందగమనానికి అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నాం. అయితే సేల్స్, ఆర్అండ్డీ విభాగాల్లోని ఉద్యోగాల్లో కొంత మేర కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదలైన వారి స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. పడిపోతున్న వాహన విక్రయాల కారణంగా పరికరాల తయారీ పరిశ్రమపైనా ప్రభావం తప్పదు‘ అని ఆమె చెప్పారు. మరో 10 లక్షలకు పైగా కొలువులకు గండం.. దేశీ ఆటోమొబైల్ రంగంలో దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు తదితర అంశాలపై కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటిస్తుండటం వల్ల విధానాల్లో స్పష్టత లోపించడంతో ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక రుణాల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వాహనాలకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందంటూ ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) గత నెలలోనే హెచ్చరించింది. ప్రభుత్వ మద్దతు కావాలి.. ఆటోరంగంలో పెను మా ర్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ మోహిత్ భారతి వ్యాఖ్యానించారు. ‘ఇదే ధోరణి మరికొంత కాలం సాగిందంటే ఆటో పరికరాల సంస్థలు, అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గానీ తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగానికి పరిస్థితులు ఆశావహంగానైతే కనిపించడం లేదు‘ అని మోహిత్ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయడం ద్వారా పరిశ్రమ కోలుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించాంటూ ఆటో రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కారు.. బైక్ రివర్స్ గేర్..! -
వాహన ఉత్పత్తికి కోతలు..
న్యూఢిల్లీ: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తిని సవరించుకుంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో 8 నుంచి 14 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. టాటా మోటార్స్ సైతం తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సవరించనున్నట్టు ధ్రువీకరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) పలు ప్లాంట్లలో 8–14 రోజుల వరకు ఎటువంటి ఉత్పత్తి ఉండదంటూ స్టాక్ ఎక్సేంజ్‌లకు ఎంఅండ్ఎం సమాచారం ఇచ్చింది. ‘‘గతంలో పేర్కొన్నట్టుగానే.... వెలుపలి వాతావరణం ఇప్పటికీ సవాళ్లతో కూడుకుని ఉంది. డిమాండ్ తగ్గిపోతోంది. డిమాండ్‌కు అనుగుణంగా మా ఉత్పత్తిని మార్చుకోవడంతోపాటు, పనివేళల షిఫ్ట్‌లు, కాంట్రాక్టు సిబ్బందిని సర్దుబాటు చేసుకున్నాం’’అని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా వాహనాల అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఎంఅండ్ఎం దేశీయ వాహన అమ్మకాలు 8 శాతం క్షీణించి, 1,61,604 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులతో కలిపి చూసినా కానీ అమ్మకాలు 8 శాతం తగ్గాయి. కస్టమర్ల నుంచి డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఈ నెల అంతటా ఉత్పత్తిని నిలిపివేస్టున్నట్టు ఆటో విడిభాగాల తయారీ సంస్థ జామ్నా ఆటో గురువారమే ప్రకటించింది. వరుసగా ఆరో నెల జూలైలోనూ తాము ఉత్పత్తికి కోత విధించినట్టు మారుతీ సుజుకీ ఈ వారమే ప్రకటించింది. ఆటో విడిభాగాల దిగ్గజం బాష్ సైతం తాత్కాలికంగా తన రెండు ప్లాంట్లలో 13 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. జీఎస్టీని తగ్గించాలి: సియామ్ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను భారాన్ని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ఆటో ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం పన్ను రేటును 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) కోరింది. అమల్లో ఉన్న రేటుకు 1–22 శాతం వరకు అదనపు సెస్ వర్తిస్తుండగా.. ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఆటో పరిశ్రమను ఈ పన్నుల భారం మరింత కుంగదీస్తుందని వివరించింది. పన్ను తగ్గింపు డిమాండ్‌కు సమాఖ్యలోని అన్ని తయారీ సంస్థలతో పాటు ద్విచక్ర వాహనాల ప్రధాన తయారీ సంస్థ(ఓఈఎం)ల మద్దతు కూడకట్టుకుని ఏకగ్రీవ డిమాండ్ ఉన్నట్లు సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలియజేశారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర విభాగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు స్పష్టంచేశారు. -
జ్ఞాపకం: భారతీయుల కారు... విశేషాలు బోలెడు!
మీకు ఆంబీ తెలుసా... అదేంటని అడక్కండి. ఆంబీ అంటే అంబాసిడర్ కారు. ఇది దాని ముద్దుపేరు. ఇటీవలే ఈ కారు ఉత్పత్తి బంద్ చేస్తూ... ఆ కారు ఉత్పత్తి దారు హిందూస్తాన్ మోటార్స్ నిర్ణయం తీసుకుంది. ఆ వార్తను ప్రజలు ఒక మనిషి మరణంలా, ఎమోషనల్‌గా చూడటమే ఆ కారు గొప్పతనం. ఈ సందర్భంగా దాని విశేషాలు... చిన్నప్పుడు ఎవరైనా పిల్లలను కారు బొమ్మ గీయమని అడిగితే వారు గీసే బొమ్మ కారు ఏంటో తెలుసా? అంబాసిడర్‌దే. ముందు ఇంజిను, వెనుక డిక్కీ, మధ్యలో బాడీ. పిల్లలు చాలా సులువుగా నేర్చుకునే మొదటి బొమ్మ... బహుశా ఇదే కావచ్చు. మీ ఇంట్లో శాంత్రో, స్విప్టు వంటి హ్యాచ్ బ్యాక్ కార్లున్నా, వాటిలో మీ పిల్లలు తిరుగుతున్నా వారు గీసే కారు బొమ్మ మాత్రం అంబాసిడర్‌దే. అంతగా భారతీయులతో ఆ కారు పెనవేసుకుపోయింది. అంతెందుకు ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు ఎన్నో కార్ల ఉత్పత్తిని ఆపేశాయి. కానీ అవేవీ బిజినెస్ పేజీని దాటి రాలేదు. అవేవీ ఫీచర్ స్టోరీ కాలేదు. ఎందుకంటే అవన్నీ కేవలం కార్లు అంతే. కానీ ‘ఆంబీ’ కేవలం కారు కాదు, ఓ ఫీలింగ్, ఓ చిహ్నం. అంబాసిడర్ చివరి కారును కోల్‌కతా శివారులోని ఉత్తర్పుర ప్లాంటులో తయారుచేశారు. ఈ కారు మోడల్‌ను 1956లో బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ నగరంలో ఉన్న మోరీస్ మోటార్ రూపకల్పన చేసింది. ఈ కారుకు బ్రిటన్‌లో కొన్ని మూలాలున్నా ఇది ఇండియా కారు. ఇండియన్ కంపెనీ తయారుచేసిన కారు. 1958 నుంచి సీకె బిర్లా గ్రూపునకు చెందిన హిందూస్తాన్ మోటార్స్ ఇండియాలో అధికారికంగా అమ్మకాలు మొదలుపెట్టింది. ఈ కారు ప్రపంచంలోనే అత్యధిక కాలం వినియోగంలో ఉన్నవాటిలో ఒకటి. అంతకుముందున్న హిందూస్తాన్ ల్యాండ్ మాస్టర్ స్థానాన్ని ఈ కారు ఆక్రమించింది. అనంతరం అనూహ్యంగా ప్రజాభిమానం చూరగొని పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయింది. అప్పటి కార్లలో ఎక్కువ లెగ్‌రూమ్, సీటింగ్ స్పేస్, డిక్కీ ఉండి ఇండియా రోడ్లకు అనుగుణంగా ఉన్న మరో కారు లేదు. దీంతో విదేశీ కార్లున్నా గ్రామాలకు కూడా ప్రయాణించగలిగిన ఆంబీలను నేతలు ఎన్నుకునేవారు. పైగా సదుపాయాలున్న ఇండియన్ కారు కావడంతో దానివైపే మొగ్గుచూపేవారు. కారు మంచి బందోబస్తుగా ఉండేది. దీంతో ఎలాంటి ఇండియన్ రోడ్లయినా ఇది తట్టుకునేది. 2011లో కాలుష్య ప్రమాణాల ప్రకారం లేనందున 2011లో దీనిని 11 భారతీయ నగరాలు నిషేధించాయి. దీంతో కొత్త ప్రమాణాలతో కొత్త మోడల్స్ కొన్ని విడుదలయ్యాయి. అలా అంబాసిడర్ చివరి మోడల్ ‘అంబాసిడర్ ఎన్కోర్’ 2013లో విడులైంది. మూడు నాలుగేళ్ల నుంచి భారీ నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 2014 మే 25న ఈ కారు బంద్ అయ్యింది. కొన్ని విశేషాలు: 2003 వరకు భారత ప్రధాన మంత్రి కాన్వాయ్ కార్లు ఇవే. ఆ ఏడాది తర్వాత జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ పీఎం కాన్వాయ్ అయ్యింది. మారుతి 800 అతి తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో ఆంబీ ఆర్థిక పతనం మొదలైంది. ఇది బీబీసీ టాప్ గేర్ షోలో ‘వరల్డ్ బెస్ట్ ట్యాక్సీ’గా కూడా అభినందనలు అందుకుంది. నటుడు శరత్‌కుమార్‌కు ఈ కారంటే మహా ఇష్టమట. ఆ కారు కనిపిస్తే ఒకసారి నడపాలనుకుంటారట. ఇది అతిఎక్కువ కాలం ‘ఫ్యామిలీ కార్’గా మన్ననలు పొందింది. పెద్ద బంగళా ఉందంటే... అంబాసిడర్ ఉండాల్సిందే. {పతి భారతీయుడికి తెలిసిన కారు ఇదొక్కటే. విడుదలైన ప్రతి రంగులోనూ బాగా కనిపించిన ఏకైక కారు ఇదేనట. అంబాసిడర్ కారు తోలడం అంటే ప్రపంచంలో ఇక ఏ కారైనా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు. ఆంబీ, వీఐపీ కార్, ఫ్యామిలీ కార్, ట్యాక్సీ కార్... ఇవన్నీ దాని ముద్దు పేర్లు. ‘ఎర్ర బుగ్గ’ ఈ కారుకు సెట్ అయినట్టు మరే కారుకు సెట్ కాదట!