బండి కాదు..మొండి ఇది..! | Indian Automobile Sector Slowdown Sees 15,000 Job Losses | Sakshi
Sakshi News home page

బండి కాదు..మొండి ఇది..!

Published Fri, Aug 16 2019 5:07 AM | Last Updated on Fri, Aug 16 2019 8:25 AM

Indian Automobile Sector Slowdown Sees 15,000 Job Losses - Sakshi

సాక్షి, బిజినెస్‌ విభాగం: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్‌ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూలై మధ్యలో దేశీ ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి 13.18% తగ్గిపోయింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టొయోటా, హోండా వంటి దిగ్గజాలన్నీ భారీగా ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి.

హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా మాత్రమే ఉత్పత్తిని కాస్త పెంచుకున్నాయి. ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది అదే వ్యవధిలో సుమారు 10% పడిపోయి 78,45,675గా నమోదైంది. ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి 13,97,404 యూనిట్ల నుంచి 13% క్షీణతతో 12,13,281 యూనిట్లకు పడిపోయింది.

ఈ పరిణామాలతో ఏప్రిల్‌ నుంచి చూస్తే ఇప్పటిదాకా ఆటోమొబైల్‌ రంగంలో (వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, డీలర్లు మొదలైన వర్గాలు) ఇప్పటిదాకా 3.5 లక్షల ఉద్యోగాల్లో కోత పడినట్లు అంచనా. తమ పరిధిలో 15,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, వందలకొద్దీ డీలర్‌షిప్‌లు మూతబడటంతో వేలమంది ఉపాధి కోల్పోయారని సియామ్‌ స్వయంగా వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.  ఈ నేపథ్యంలో.. ఇకపై తాత్కాలిక ఉద్యోగులు, సేల్స్‌.. మార్కెటింగ్‌ విభాగంలో సర్వీసులు అందించే వారు, పరిశోధన అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగాల్లో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాలు మరింతగా ఉండనున్నాయని మానవ వనరుల (హెచ్‌ఆర్‌) సంస్థలు అంచనా వేస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఇదే ధోరణి..
అంతర్జాతీయంగా కూడా ఆటోమొబైల్‌ రంగంలో మందగమన ధోరణులే నెలకొన్నాయని, దీనికి భారత్‌ మినహాయింపేమీ కాదని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ సీఈవో ఆదిత్య నారాయణ్‌ మిశ్రా తెలిపారు. దీంతో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడానికి తమ పరిధిలో తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించుకోవడం, తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేయడం వంటివి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు.

మందగమనం ఇలాగే కొనసాగితే రోజువారీ కార్యకలాపాలకు అంతగా ముఖ్యం కాకపోయినా అధిక వేతనాలు అందుకునే వారిని తొలగించడంపై కూడా కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తయారీ విభాగంపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ముఖ్యంగా తాత్కాలిక సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విభాగంలో మధ్య స్థాయి నుంచి సీనియర్‌ స్థాయి ఉద్యోగాల్లో కూడా కోత పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి‘ అని మిశ్రా చెప్పారు. పర్మనెంటు ఉద్యోగులను తొలగించడం అన్నది ఆఖర్న మాత్రమే జరగొచ్చని.. అయితే మందగమన ప్రభావాలు మరింత తీవ్రమైతే ఆయా ఉద్యోగుల బోనస్‌లు, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిల్లో కోత పడొచ్చని తెలిపారు.

మరోవైపు, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగాల్లోని సర్వీస్‌ సిబ్బందిపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సంస్థ బిజినెస్‌ హెడ్‌ మునీరా లోలివాలా అభిప్రాయపడ్డారు. ‘వచ్చే కొద్ది నెలల్లో మందగమనానికి అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నాం. అయితే సేల్స్, ఆర్‌అండ్‌డీ విభాగాల్లోని ఉద్యోగాల్లో కొంత మేర కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదలైన వారి స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. పడిపోతున్న వాహన విక్రయాల కారణంగా పరికరాల తయారీ పరిశ్రమపైనా ప్రభావం తప్పదు‘ అని ఆమె చెప్పారు.  

మరో 10 లక్షలకు పైగా కొలువులకు గండం..
దేశీ ఆటోమొబైల్‌ రంగంలో దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు తదితర అంశాలపై కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటిస్తుండటం వల్ల విధానాల్లో స్పష్టత లోపించడంతో ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక రుణాల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వాహనాలకు డిమాండ్‌ పడిపోవడం ఆటోమొబైల్‌ రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటోమొబైల్‌ రంగంలో ఏకంగా 10 లక్షల దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందంటూ ఆటోమోటివ్‌ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) గత నెలలోనే హెచ్చరించింది.

ప్రభుత్వ మద్దతు కావాలి..
ఆటోరంగంలో పెను మా ర్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని మైఖేల్‌ పేజ్‌ ఇండియా రీజనల్‌ డైరెక్టర్‌ మోహిత్‌ భారతి వ్యాఖ్యానించారు. ‘ఇదే ధోరణి మరికొంత కాలం సాగిందంటే ఆటో పరికరాల సంస్థలు, అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గానీ తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగానికి పరిస్థితులు ఆశావహంగానైతే కనిపించడం లేదు‘ అని మోహిత్‌ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని తగ్గించాలని, రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయడం ద్వారా పరిశ్రమ కోలుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించాంటూ ఆటో రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

కారు.. బైక్‌ రివర్స్‌ గేర్‌..!


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement