బీజింగ్: చైనాలో వాహన విక్రయాలకు కరోనా వైరస్ సెగ తగులుతోంది. జనవరిలో ఆటో అమ్మకాలు .. గతేడాది జనవరితో పోలిస్తే ఏకంగా 20.2 % పడిపోయాయి. 16 లక్షలకు పరిమితమైనట్లు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య సీఏఏఎం ప్రకటించింది. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో చైనా సతమతమవుతుండగా.. తాజాగా మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి.
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు నూతన సంవత్సర సెలవులను మరింతగా పొడిగించడం.. ఫలితంగా ఫ్యాక్టరీలు, డీలర్‌షిప్‌లు మూతబడటం మొదలైన పరిణామాలు ఆటోమొబైల్ పరిశ్రమను మరింతగా కుదేలు చేస్తున్నాయి. సాధారణంగా జనవరిలో సెలవుల సీజన్ తర్వాత ఫిబ్రవరిలో అమ్మకాలు భారీగా నమోదవుతాయి. అయితే, ప్రస్తుతం ఫిబ్రవరి సగం గడిచిపోయినా.. కంపెనీలు ఇంకా తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్వల్పకాలికంగా వాహనాల ఉత్పత్తి, అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడుతోందని, పరికరాల సరఫరా వ్యవస్థకు సమస్యలు తప్పవని సీఏఏఎం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment