
9,000 మందికి ఉద్వాసన
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్‌ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్‌ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం.
అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్‌ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్‌లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్‌లకు తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment