salaries Break
-
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు.. ఉద్యోగుల ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉద్యోగుల జీతాల విషయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఈనెల 15వ తేదీ వచ్చినా కార్మికులకు ఇంకా జీతాలు అందలేదు. ఇక, గత రెండు నెలలుగా వారికి కేవలం సగం కన్నా తక్కువ జీతాలే ఇస్తున్నారు.విశాఖ ఉక్కు కార్మికులకు జీతాలు ఇంకా అందలేదు. డిసెంబర్ నెలకు సంబంధించిన 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ నెలలో 50 శాతం, సెప్టెంబర్ నెల జీతం 35 శాతం మాత్రమే యాజమాన్యం చెల్లించింది. ఇప్పటికే పెండింగ్ జీతాలపై యాజమాన్యం ఊసే ఎత్తకపోవడం గమనార్హం.ఈ సందర్బంగా ఉక్కు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఉక్కు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ధోరణికి వ్యతిరేకంగా.. జీతాల విషయమై ఈనెల 18న కుటుంబాలతో సహా ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు కార్మికులు తెలిపారు. ఇక, కార్మికుల ప్రకటనపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ తమకు మద్దతుగా నిలవాలని వ్యాఖ్యలు చేశారు. -
నిస్సాన్‌లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
ఆదిత్యకు రూ.19 కోట్లు- రజనీష్‌కు రూ.0.3 కోట్లు
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రయివేట్, పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజాల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకున్న వేతనాలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురీ గతేడాది రూ. 18.9 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే మరోపక్క ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల వేతనాన్ని పొందారు. ఈ వివరాలను ఓవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మరోపక్క ఎస్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం.. 38 శాతం ప్లస్ గతేడాది ఆదిత్య పురీ రూ. 18.9 కోట్ల జీతాన్ని అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాది(2018-19) అందుకున్న రూ. 13.7 కోట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇది 38 శాతం అధికం. వీటిలో రూ. 2.1 కోట్లమేర బోనస్‌లు తదితరాలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా పొందుతూ వచ్చిన స్టాక్ ఆప్షన్లను విక్రయించడం ద్వారా గతేడాది రూ. 161 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.బారుచా 2020లో రూ. 8.6 కోట్ల వేతనాన్ని పొందారు. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఇది 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి. వేతనంలో రూ. 80 లక్షల పెర్క్‌లు కలసి ఉన్నట్లు తెలుస్తోంది. బారుచా సైతం కొన్నేళ్లుగా అందుకున్న స్టాక్ ఆప్షన్లను వినియోగించుకోవడం ద్వారా రూ. 31.6 కోట్లు సముపార్జించినట్లు తెలుస్తోంది. వెరసి గతేడాదిలో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వేతన రూపంలో బ్యాంక్ రూ. 27.5 కోట్లు చెల్లించింది. కాగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ రూ. 64 లక్షలు అందుకున్నారు. సిటింగ్ ఫీజు కింద లభించిన రూ. 29 లక్షలు దీనిలో కలసి ఉంది. ఎస్బీఐ ఇలా పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. బేసిక్ శాలరీ రూ. 27 లక్షలతోపాటు.. డీఏగా రూ. 4.2 లక్షలు జమ అయినట్లు బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ గుప్తా రూ. 41.3 లక్షలు సంపాదించారు. దీనిలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద పొందిన రూ. 11 లక్షలు కలసి ఉన్నాయి. మరో ఇద్దరు ఎస్బీఐ ఎండీలలో దినేష్ కుమార్ ఖారా రూ. 29.4 లక్షలు, ఆర్జిత్ బసు రూ. 28.5 లక్షలు చొప్పున జీతాలు అందుకున్నారు. అయితే పలు కారణాలరీత్యా ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల వేతనాలను పోల్చతగదని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్ రంగంలోనేకాకుండా పలు ఇతర పరిశ్రమలలోనూ సాధారణంగా కనిపిస్తుందని తెలియజేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఆర్బీఐసహా ప్రభుత్వ రంగంలోని సంస్థలలో జీతాలు అంతర్జాతీయ ప్రమాణాలకంటే తక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు -
బతుకులు తెల్లారెదెన్నడు!
చెన్నారావుపేట: ఎన్నో సంవత్సరాల నిరీక్షణ.. తక్కు వేతనం అని చూడకుండా నిరంతరం శ్రమ చేసేవారే జీపీ కార్మికులు.. కాని వారి బతుకులు దుర్భరంగా మారాయి. చాలీ చాలని వేతనాలతో సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో మంచి వేతనం పెరుగుతందనే కోటి ఆశలతో ఎదురుచూపులుచూస్తుంది. తెలంగాణ వచ్చాకనైనా మా బతుకులు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం, రాత్రి అనకుండా గ్రామాలలోని డ్రెయినేజీ, వీధులు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు, వీధి లైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు ఎన్నో మౌళిక వసతుల రూపలకల్పనలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కాని గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏళ్లుగా చాలిచాలని వేతనాలతో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో 265 పాత గ్రామ పంచాయతీలు ఉండగా 136 నూతన జీపీలు ఏర్పాటు కావడంతో 401కి చేరాయి. గ్రామ పంచాయితీలు.. పాత జీపీల ప్రకారంగా ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. అందులో 3 Salaries), 12 పుల్టైం వర్కర్లు(9 బిల్ కలెక్టర్లు, 03 పంప్ ఆపరేటర్,) , 58 మంది పార్ట్ టైం(16 బిల్ కలెక్టర్లు, 15 మంది పంప్ ఆపరేటర్లు, 12 స్వీపర్లు, 3 అటెండర్లు ఇతరులు 12 మంది) ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా( తాత్కాలిక ఉద్యోగులుగా బిల్ కలెక్టర్లు 99, అటెండర్లు 23, ఎలక్ట్రీసిటీ 107, పంప్ ఆపరేటర్లు 246 మంది, శానిటేషన్ స్వీపర్లు 257, ఇతరులు 96, మొత్తం 828 మంది తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నారు. చాలీచాలని వేతనం వీరికి నెలకు వేతనం రూ. 1000 నుంచి సుమారుగా రూ. 5 వేల వరకు ఇస్తున్నారు. ఇవి సక్రమంగా నెలనెలకు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎప్, ఈఎస్ఐ, ప్రభుత్వం నుంచి విడుదలైన జీవోలు, మెమోలను పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు గతంలో పంపించారని, అమలు చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2012 డిసెంబర్ 20 న జరిగిన చలో కమిషనరేట్ కార్యక్రమం చేపట్టగా దిగొచ్చిన ప్రభుత్వం వేలాది కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని యూనియన్ ప్రతినిధులతో అడిషనల్ కమిషనర్ ఒప్పుకున్నారని తెలిపారు. 2013 మే, జూన్‌లో కూడా 33 రోజులు చేసిన సమ్మెకు కూడా ప్రభుత్వం అమలు చేస్తానని హామి ఇచ్చినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐదుసంత్సరాల సర్వీస్ పూర్తయిన పంచాయతీ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం జీవో నంబర్ 3 ను అమలు చేయాలని కోరుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి 1995లో పాత మగ్దుంపుర గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషన్ వర్కర్‌గా విధుల్లో చేరాను. అప్పుడు రూ.70 వేతనం అందించారు. 15 సంవత్సరాలకు రూ. 1500 వేతనం అందిస్తున్నారు. ఇవి నెలనెలకు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీలో విద్యుత్ దీపాలు, బావి మోటర్, ఇంటి పన్నులుతో పాటు పలు రకాల పనులు చేస్తాం. పభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గర్తించి వేతనాలు పెంచాలి. నాంపెల్లి కుమార్, ఎలక్ట్రీషియన్,పాత మగ్దుంపురం కనీస వేతనం రూ. 20 వేలు అందించాలి ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులను ఆదుకుంటుంది. వారి తో పాటు గ్రామ పంచాయతీలలో చాలీ చాలనీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ. 20 వేల వేతనం ప్రభుత్వం ద్వారా అందించి ఆదుకోవాలి. జీపీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి. కూచన ప్రకాశ్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు -
కాంట్రాక్టు వైద్య సిబ్బంది వేతనాలకు బ్రేక్
ఎన్హెచ్ఎంలో నిధులు లేకపోవడమే కారణం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఇబ్బందుల్లో 8 వేల మంది సిబ్బంది హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని 8 వేల మందికిపైగా కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు బ్రేక్ పడింది. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద పని చేసే వీరికి కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన వద్దే ఉంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడగా, తాజాగా వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎన్హెచ్ఎం చేరుకుంది. దీంతో ఉద్యోగులు గొల్లుమంటున్నారు. ఎన్హెచ్ఎం కింద 24 గంటలూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2 వేల మంది స్టాఫ్ నర్సులున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో 4,500 మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. 300 మంది వరకు డాక్టర్లు పని చేస్తున్నారు. వీరితోపాటు ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరి వేతనాలకు నెలకు సుమారు రూ.10 కోట్లు అవసరం. కానీ ఈ నెల వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కేంద్ర నిధులూ రాష్ట్ర ప్రభుత్వం వద్దే.. రాష్ట్రంలో చేపట్టే ఎన్హెచ్ఎం కార్యక్రమాలకు గతేడాది రూ. 143.28 కోట్లను కేంద్రం ఒక విడతగా కేటాయించింది. వాటితోపాటు ఇప్పటివరకు రాష్ట్రవాటాతో కలిపి తెలంగాణ ప్రభుత్వం ఎన్హెచ్ఎంకు రూ.458 కోట్ల బకాయి పడింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రెండు దఫాలుగా రాష్ట్రానికి కేంద్రం విడుదల చేయాల్సిన రూ.300 కోట్లకు బ్రేక్ పడే అవకాశం ఉందని ఎన్హెచ్ఎం అధికారులు అంటున్నారు. దీంతో కనీసం వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఈ విషయంపై నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. నిధులు విడుదల చేయాలని సీఎంను కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో జనని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఆగిపోయింది.