మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రయివేట్, పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజాల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకున్న వేతనాలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురీ గతేడాది రూ. 18.9 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే మరోపక్క ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల వేతనాన్ని పొందారు. ఈ వివరాలను ఓవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మరోపక్క ఎస్‌బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం..
38 శాతం ప్లస్
గతేడాది ఆదిత్య పురీ రూ. 18.9 కోట్ల జీతాన్ని అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాది(2018-19) అందుకున్న రూ. 13.7 కోట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇది 38 శాతం అధికం. వీటిలో రూ. 2.1 కోట్లమేర బోనస్‌లు తదితరాలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా పొందుతూ వచ్చిన స్టాక్ ఆప్షన్‌లను విక్రయించడం ద్వారా గతేడాది రూ. 161 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.బారుచా 2020లో రూ. 8.6 కోట్ల వేతనాన్ని పొందారు. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఇది 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి. వేతనంలో రూ. 80 లక్షల పెర్క్‌లు కలసి ఉన్నట్లు తెలుస్తోంది. బారుచా సైతం కొన్నేళ్లుగా అందుకున్న స్టాక్ ఆప్షన్‌లను వినియోగించుకోవడం ద్వారా రూ. 31.6 కోట్లు సముపార్జించినట్లు తెలుస్తోంది. వెరసి గతేడాదిలో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వేతన రూపంలో బ్యాంక్ రూ. 27.5 కోట్లు చెల్లించింది. కాగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ రూ. 64 లక్షలు అందుకున్నారు. సిటింగ్ ఫీజు కింద లభించిన రూ. 29 లక్షలు దీనిలో కలసి ఉంది.
ఎస్‌బీఐ ఇలా
పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. బేసిక్ శాలరీ రూ. 27 లక్షలతోపాటు.. డీఏగా రూ. 4.2 లక్షలు జమ అయినట్లు బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ గుప్తా రూ. 41.3 లక్షలు సంపాదించారు. దీనిలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద పొందిన రూ. 11 లక్షలు కలసి ఉన్నాయి. మరో ఇద్దరు ఎస్‌బీఐ ఎండీలలో దినేష్ కుమార్ ఖారా రూ. 29.4 లక్షలు, ఆర్జిత్ బసు రూ. 28.5 లక్షలు చొప్పున జీతాలు అందుకున్నారు. అయితే పలు కారణాలరీత్యా ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల వేతనాలను పోల్చతగదని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్ రంగంలోనేకాకుండా పలు ఇతర పరిశ్రమలలోనూ సాధారణంగా కనిపిస్తుందని తెలియజేశారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఆర్‌బీఐసహా ప్రభుత్వ రంగంలోని సంస్థలలో జీతాలు అంతర్జాతీయ ప్రమాణాలకంటే తక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment