కాంట్రాక్టు వైద్య సిబ్బంది వేతనాలకు బ్రేక్
ఎన్‌హెచ్‌ఎంలో నిధులు
లేకపోవడమే కారణం
రాష్ట్ర వాటా నిధులు విడుదల
చేయని ప్రభుత్వం
ఇబ్బందుల్లో 8 వేల మంది సిబ్బంది
హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని 8 వేల మందికిపైగా కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు బ్రేక్ పడింది. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద పని చేసే వీరికి కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన వద్దే ఉంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడగా, తాజాగా వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎన్‌హెచ్‌ఎం చేరుకుంది. దీంతో ఉద్యోగులు గొల్లుమంటున్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద 24 గంటలూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2 వేల మంది స్టాఫ్ నర్సులున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో 4,500 మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. 300 మంది వరకు డాక్టర్లు పని చేస్తున్నారు. వీరితోపాటు ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరి వేతనాలకు నెలకు సుమారు రూ.10 కోట్లు అవసరం. కానీ ఈ నెల వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు.
కేంద్ర నిధులూ రాష్ట్ర ప్రభుత్వం వద్దే..
రాష్ట్రంలో చేపట్టే ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాలకు గతేడాది రూ. 143.28 కోట్లను కేంద్రం ఒక విడతగా కేటాయించింది. వాటితోపాటు ఇప్పటివరకు రాష్ట్రవాటాతో కలిపి తెలంగాణ ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎంకు రూ.458 కోట్ల బకాయి పడింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రెండు దఫాలుగా రాష్ట్రానికి కేంద్రం విడుదల చేయాల్సిన రూ.300 కోట్లకు బ్రేక్ పడే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఎం అధికారులు అంటున్నారు. దీంతో కనీసం వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఈ విషయంపై నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. నిధులు విడుదల చేయాలని సీఎంను కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో జనని సురక్ష యోజన(జేఎస్‌వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్‌ఎస్‌కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఆగిపోయింది.