వెంటాడిన కరోనా! | Coronavirus Break Market Growth Sensex Down 1375 points | Sakshi
Sakshi News home page

వెంటాడిన కరోనా!

Published Tue, Mar 31 2020 4:35 AM | Last Updated on Tue, Mar 31 2020 5:01 AM

Coronavirus Break Market Growth Sensex Down 1375 points - Sakshi

కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు కూడా పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా కేసులు వెయ్యికి పైగా మించడం, మరణాలు 31కు చేరడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ప్రపంచం మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) పేర్కొనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,375 పాయింట్లు పతనమై 28,440 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 379 పాయింట్లు నష్టపోయి 8,281 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, వాహన, లోహ, రియల్టీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫిచ్‌ సొల్యూషన్స్, ఇండియా రేటింగ్స్‌  సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ అంచనాలను తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం, ముడి చమురు ధరలు 18 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి.  

రోజంతా నష్టాలే...: ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్‌ కూడా నష్టాల్లోనే మొదలైంది. సెన్సెక్స్‌ 580 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. గంట తర్వాత నష్టాలు తగ్గినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత మళ్లీ పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,525 పాయింట్లు, నిఫ్టీ 416 పాయింట్ల మేర నష్టపోయాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి.  

రూ. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోవడంతో రూ.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.3 లక్షల కోట్ల మేర తగ్గి రూ.109.74 లక్షల కోట్లకు చేరింది.  

ఫైనాన్స్‌ షేర్లు ఢమాల్‌...
కరోనా వైరస్‌ కల్లోలంతో బ్యాంక్, ఆర్థిక సంస్థల రుణ వృద్ధి గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయన్న ఆందోళనతో బ్యాంక్, ఆర్థిక సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీల నష్టంలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నష్టాల వాటాయే దాదాపు 75%. బజాజ్‌ ఫైనాన్స్‌ 12 శాతం నష్టంతో రూ.2,242 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

ఆల్‌టైమ్‌ హైకు అబాట్‌ ఇండియా
అమెరికాకు చెందిన అబాట్‌ ల్యాబొరేటరీస్‌ అందుబాటులోకి తెచ్చిన 5 నిమిషాల కరోనా నిర్ధారణ పరీక్షకు ఆమోదం లభించింది. దీంతో  అబాట్‌ ఇండియా 19% లాభంతో రూ.16,869ను వద్ద ఆల్‌టైమ్‌ హైను తాకింది. చివరకు 9% లాభంతో రూ.15,400 వద్ద ముగిసింది.

మరిన్ని విశేషాలు....
► సెన్సెక్స్‌  30 షేర్లలో 6 షేర్లు–టెక్‌ మహీంద్రా, నెస్లే, యాక్సిస్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ యూని లివర్, టైటాన్, ఇండస్‌ఇండ్‌  షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 24 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  
► దాదాపు 400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్‌ మోటార్స్, టీమ్‌లీజ్‌ సర్వీసెస్, లక్ష్మీ మిల్స్, శ్రీరామ్‌ సిటీ యూనియన్, హావెల్స్‌ ఇండియా,సన్‌ టీవీ, ఫ్యూచర్‌ రిటైల్, టీవీఎస్‌ మోటార్, వేదాంత, ఐఓసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► 300కు పైగా షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్‌ రిటైల్, ఇండియాబుల్స్‌ వెంచర్స్, ఐడీఎఫ్‌సీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.


నష్టాలకు కారణాలు...
ఆగని కరోనా కల్లోలం....
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా, కరోనా కేసులు 1,100కు, మరణాలు 31కు పెరిగాయి.    ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 7 లక్షలకు పైగా, మరణాలు 34,000కు పైగా చేరాయి. దేశీయంగా, అంతర్జాతీయంంగా కేసులు మరింత  పెరుగుతాయనే ఆందోళన నెలకొన్నది.

ఐఎమ్‌ఎఫ్‌ మాంద్యం హెచ్చరిక
కరోనా వైరస్‌ కల్లోలంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) వెల్లడించింది. 2009 నాటి అర్థిక మాంద్యం కంటే ప్రస్తుత మాంద్యం మరింత అధ్వానంగా ఉంటుందని ఐఎమ్‌ఎఫ్‌ హెచ్చరించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  

జీడీపీ అంచనాల తగ్గింపు....
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 4.6%గానే ఉంటుందని ఫిచ్‌ పేర్కొంది. ఇండియా రేటింగ్స్‌ 5.5% నుంచి 3.6%కి తగ్గించింది.  

ప్రపంచ మార్కెట్లు పతనం.
ప్రపంచ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల్లో లాక్‌డౌన్‌ మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో గత శుక్రవారం అమెరికా స్టాక్‌ సూచీలు 3–4 శాతం మేర నష్టపోగా, సోమవారం ఆసియా మార్కెట్లు 2 శాతం మేర పతనమయ్యాయి. యూరప్‌ మార్కెట్లు 3 శాతం మేర నష్టాలతో ఆరంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆరు నెలల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు.  

18 ఏళ్ల కనిష్టానికి చమురు ధరల పతనం  
పలు దేశాల్లో లాక్‌డౌన్‌తో చమురు వినియోగం బాగా పడిపోయింది. దీంతో బ్యారెల్‌ ముడి చమురు ధర సోమవారం ఇంట్రాడేలో 9 శాతానికి పైగా పతనమై 18 ఏళ్ల కనిష్టానికి (20 డాలర్ల దిగువకు) చేరాయి. జనవరి గరిష్ట స్థాయి నుంచి చూస్తే, చమురు ధరలు 68 శాతం మేర తగ్గాయి.   

రూపాయి 70పైసలు డౌన్‌....
డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 70 పైసలు క్షీణించింది. రోజంతా 75.10–75.63 రేంజ్‌లో ట్రేడైన రూపాయి చివరకు 70 పైసల నష్టంతో 75.59 వద్ద ముగిసింది.

ప్యాకేజీల ప్రభావం పరిమితమే
ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాల ప్యాకేజీల ప్రభావం అంచనాలకనుగుణంగా పరిమితంగానే ఉంది.   కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండగలదోనన్న భయాందోళనలు చెలరేగుతున్నాయి. ప్రపంచం మాంద్యంలోకి జారిపోయిందని ఇప్పటికే ఐఎమ్‌ఎఫ్‌ ప్రకటించింది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.   
– వినోద్‌ నాయర్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌   

కరోనా వైరస్‌కు సంబంధించి సానుకూల వార్తలు రానంత వరకూ మార్కెట్‌ కోలుకోవడం కష్టమే. నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పడిపోవడం నెగిటివ్‌ సిగ్నల్‌. 8,200 పాయింట్ల కిందకు క్షీణిస్తే, అది మరింత పతనానికి సూచిక. 8,000 పాయింట్లు, లేదా 7,800 పాయింట్లకు కూడా నిఫ్టీ పడిపోవచ్చు.  
–శ్రీకాంత్‌ చౌహాన్, కోటక్‌ సెక్యూరిటీస్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement