సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం.
ఆర్థిక మాంద్యం దెబ్బ
ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది.
రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు.
ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’
ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది.
‘కాళేశ్వరం’ జాతికి అంకితం..
రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి.
52 రోజుల పాటు..
అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
సచివాలయం లేని రాష్ట్రం
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్‌కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment