సత్తాచాటిన ‘సామాన్యుడు’
Published Sat, Dec 28 2013 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీవాసులు లక్షలాదిగా తరలివచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతోపాటు స్వగ్రామం సివానీ నుంచి పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘భారత్ మాతాకీ జై’ ‘వందేమాతరం’ నినాదాలతో రామ్‌లీలా మైదాన్ హోరెత్తింది. అవినీతి అంతానికి ఢిల్లీవాసులంతా తనకు సహకరించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తొలిరోజే సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీగా బీజేపీ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తుందని, కేజ్రీవాల్ ఎంత త్వరగా తన హామీలను పరిష్కరిస్తారో గమనిస్తుంటామని బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ:సామాన్యుడి పట్టాభిషేకానికి సకలజనులు తరలివచ్చారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వస్తుందంటే తమకు ఎంతో మేలు జరగబోతుందన్న కొండంత ఆశతో పరుగుపరుగున వచ్చిన సామాన్యులతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా శనివారం ఉదయం నుంచే వేలాదిగా వరుసకట్టిన జనసందోహం ఉదయం 11 గంటల వరకు రామ్‌లీలా మైదానాన్ని ముంచెత్తింది. ఆప్ ప్రభుత్వం కొలువు దీరుతున్న సందర్భాన్ని కళ్లారా చూసేందుకు పోటీపడ్డారు. దీంతో ఎటు చూసినా ఆమ్‌ఆద్మీ పార్టీ టోపీలే కనిపించాయి. ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా
అరవింద్ కేజ్రీవాల్‌తో శనివారం 12 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రతి పనిలోనూ వినూత్నంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆప్ నాయకులు ప్రభుత్వ ఏర్పాటులోనూ వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టారు. సామాన్యులే ప్రముఖులంటూ ఢిల్లీవాసులంతా రామ్‌లీలా మైదానానికి తరలిరావాలని కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల వారు స్పందించారు. పార్టీ గుర్తు అయిన చీపుర్లు చేతిలో పట్టుకుని, ఆప్ టోపీలు ధరించిన వారితో రామ్‌లీలా పరిసరాలు నిండిపోయాయి. కొందరు చీపుర్లనే పూలబొకేలుగా తయారు చేసి తెచ్చారు. మరికొందరు వాటిని వివిధ రంగులతో అలంకరించి తీసుకొచ్చారు. కేజ్రీవాల్ ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలతో హోరెత్తించారు. మధ్యమధ్యలో చేతులు ఊపుతూ కేజ్రీవాల్ ప్రసంగానికి మద్దతు తెలిపారు.
హోరెత్తిన నినాదాలు:
‘భారత్‌మాతాకీ జై’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘వందేమాతరం’ నినాదాలతో రామ్‌లీలా మైదానం పరిసరాలు హోరెత్తాయి. కేజ్రీవాల్ ప్రసంగం కొనసాగినంతసేపూ యువత పెద్దపెట్టున కేరిం తలు కొట్టింది. రామ్‌లీలా మైదాన్ పరిసరాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలు కనిపించాయి. మైదానం అంతటా తెల్లటి టోపీలు, జాతీయ జెండాలతో ప్రత్యేక కళ కనిపించింది. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కేజ్రీవాల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవినీతిపరుల భరతం పట్టేందుకు, సమస్యల పరిష్కారానికి అంతా సహకరించాలని ఆయన కోరారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ సచివాలయానికి చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బస్సీ-కేజ్రీవాల్ సమావేశం
ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ, కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. సమావేశ వివరాలను వెల్లడించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. అయితే బస్సీ విలేకరులతో మాట్లాడుతూ... ‘భవిష్యత్తు లక్ష్యాలు మా సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇద్దరి లక్ష్యం ఒక్కటే అనిపించింద’న్నారు. కాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ సీఎం కేజ్రీవాల్‌కు ఏ విషయం గురించైనా రిపోర్డు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండడంతో ఆయన కేంద్రానికే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ బస్సీ, కేజ్రీవాల్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భద్రతను మళ్లీ నిరాకరించిన కేజ్రీవాల్
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన వ్యక్తిగత భద్రతను మరోసారి నిరాకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకురాగా ఆయన నిరాకరించారని ప్రత్యేక కమిషనర్ జేకే శర్మ తెలిపారు. ‘పోలీసులను వెనక్కు వెళ్లమని కేజ్రీవాల్ చెప్పారు. తనకు భద్రత అవసరం లేదన్నారు. ఆయన నిరాకరించినప్పుడు మేమేం చేసేది?’ అని శర్మ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
నిజాయతీపరులైన అధికారులూ.. భయంవద్దు!
నిజాయతీపరులైన అధికారులు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశమైన కేజ్రీవాల్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వారిని పరిచయం చేసుకునేందుకు మాత్రమే కలిశానని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో అధికారులను ఇబ్బందిపెట్టే పరిస్థితి ఉండదని, నిజాయతీపరులైన అధికారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘నిజాయతీతో పనిచేయండి..! భయపడాల్సిన అవసరమేమీ లేద’ని వారితో చెప్పానన్నారు.
Advertisement
Advertisement