అవినీతి అంతుచూస్తాం
Published Sat, Jan 25 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
సాక్షి, న్యూఢిల్లీ:తమ ప్రభుత్వం ఢిల్లీని దేశంలో మొట్టమొదటి అవినీతిరహిత రాష్ట్రంగా మారుస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని ప్రసంగిస్తూ పైవిషయం చెప్పారు. గడచిన 25 రోజుల్లో అవినీతి 20 నుంచి 30 శాతం తగ్గిందని చెప్పారు. ‘నేను ఛత్రసాల్ స్టేడియానికి వచ్చే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కారు అగింది. వెంటనే ఆటోడ్రైవర్లు వాహనం చుట్టూ గుమిగూడారు. పోలీసులు తమ వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం లేదని వివరించారు. పోలీసులు డబ్బు గుంజకపోవడం వల్ల టీ ధరలు తగ్గించినట్లు చాయ్‌వాలాలు చెబుతున్నారు. పోలీసుల్లోనూ నిజాయితీపరులున్నారు. మద్యం మాఫియాతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అధికారి కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తాం. నిజాయితీరులైన అధికారులను ప్రోత్సహిస్తాం’ అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రే స్వయంగా ధర్నా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. సెక్షన్ 144 కింద నిషేదాజ్ఞలు విధించడం రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్నారు. కొందరు అన్నట్లుగా తాను రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదని, ముఖ్యమంత్రి ధర్నా చేయకూడాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన చెప్పారు. తాను ధర్నా చేసే చోట సెక్షన్ 144 విధించినవాళ్లే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే తాను మరోమారు ధర్నా చేయడానికీ వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. ‘సచివాలయం నుంచి చేయగలిగినదంతా చేస్తాను. అక్కడ చేయడానికి వీలుకాని పని జరిపించుకోవడానికి వీధుల్లోకి వెళ్తాను’ అని ఆయన తెలిపారు. తాము సూచించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కేజ్రీవాల్, ఆయన సహచరులు ఇటీవల రైల్‌భవన్ వద్ద 34 గంటలపాటు ధర్నా చేయడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే.
లోక్‌పాల్ బిల్లు సిద్ధం...
అవినీతి అంతానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు దాదాపుగా తయారయిందని, ఫిబ్రవరిలో రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే విధానసభ ప్రత్యేక సమావేశంలో దానిని ఆమోదిస్తామని చెప్పారు. ఢిల్లీలో మహిళల భద్రత కోసం మహిళా సురక్షా దళ్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించామని చెప్పారు. ఇందులో రిటైర్డ్ సైనిక ఉద్యోగులు, పోలీసులు, హోంగార్డులు సభ్యులుగా ఉంటారని సీఎం తెలిపారు. అత్యాచారాలకు పాల్పడినవారిని ఆరు నెలల్లోపే జైలుకు పంపేందుకు అవసరమైన విధానాన్ని ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు.
వ్యవస్థ మారాలి..
ప్రభుత్వ పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వ్యవస్థలో అందరూ చట్టం దృష్టిలో సమానులు కావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతోపాటు ‘హమ్ హోంగే కామ్యాబ్’ పాట పాడి ప్రసంగం ముగించారు. ఇదిలా ఉంటే పరేడ్ కమాండర్ గౌరవ వందనం సమర్పించేంతవరకు ఆగకుండానే కేజ్రీవాల్ వేగంగా వేదిక దిగి వెళ్లడంతో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినట్లయింది.
కఠిన నిబంధనలతో జన్‌లోక్ బిల్లు
లోకాయుక్త వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న ‘ఢిల్లీ లోకాయుక్త బిల్లు 2014’ ఫిబ్రవరిలో విధానసభ ముందుకురానుంది. ఈ బిల్లు ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లును పోలిఉన్నా, దానికన్నా కఠినంగా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి కూడా లోకాయుక్తకు జవాబుదారీ అవుతారు. దీని ముసాయిదాను ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపారని అధికారవర్గాలు తెలిపాయి.కొత్త బిల్లు ప్రకారం.. పది మంది లోకాయుక్తలకు ఒక చైర్మన్ ఉంటారు. సగం మంది సభ్యులు న్యాయవ్యవస్థకు చెందిన వారుంటారు.
మిగతా సగం మంది వివిధ రంగాల నిపుణులు ఉండవచ్చు. రిటైర్డు న్యాయమూర్తులు, అధికారులతో కూడిన కమిటీ లోకాయుక్త సభ్యులపేర్లను ప్రతిపాదిస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ పేర్లను ఖరారు చేస్తుందని అంటున్నారు. అవినీతి అధికారులను డిస్మిస్ చేయడం, డిమోట్ చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. నేరస్తులుగా తేలినవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చని చెబుతున్నారు. ఇది కేసుల విచారణను ఆరునెలల్లో ముగిస్తుంది. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు.
Advertisement
Advertisement