‘ఆమ్ ఆద్మీ’కే అండ
Published Thu, Nov 21 2013 12:49 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) సామాన్యుడి గోడును తమ మేనిఫెస్టోలో ప్రతిబిం బించేలా రూపొందించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమ్ ఆద్మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని ప్రకటించింది. నగరంలో ఏఏపీ నాయకుడు యోగేంద్ర యాదవ్ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే జనవరి 29న జన్‌లోక్ బిల్లును ఆమోదిస్తామని, విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామని, అధికారాన్ని వికేంద్రీకరిస్తూ ప్రతి నియోజకవర్గానికి మొహల్లా సభలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
విద్యావైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని, ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం విధిస్తామని, స్వచ్చమైన నీటిని ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని, వృద్ధులు, మహిళలకు భద్రత కల్పిస్తామన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి ప్రయత్నిస్తామని, 1984 సిక్కు అల్లర్ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, ముస్లింలపై బూటకపు కేసులు లేకుండా చూస్తామని, షెడ్యూల్ కులాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని వాగ్దానాలు చేశారు. తాము ఢిల్లీ ముఖ్యమంత్రినే కాదని, ఇక్కడున్న అవినీతి వ్యవస్థను కూడా మారుస్తామని ఆయన తెలిపారు. మొహల్లాసభలు ఏర్పాటుచేయడం ద్వారా తమ పార్టీ విప్లవాత్మక ప్రయోగం చేయనుందని యోగేంద్ర చెప్పారు.
‘ఆప్’ మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు: అధికారంలోకి వచ్చిన 15 రోజులలో జన్‌లోక్ బిల్లుకు చట్టరూపం కల్పిస్తాం. దీని కిందకు ప్రభుత్వోద్యోగులందరూ వస్తారు. అవినీతి కేసుల దర్యాప్తునకు నిర్ణీత కాలపరిమితిని విధించి పరిష్కరిస్తాం. మంత్రులు, శాసనసభ్యులు, కార్యదర్శులపై అవినీతి కేసులను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా విచారిస్తాం. లోక్‌పాల్‌కు ఆర్థిక, పాలన, దర్యాప్తు పరమైన స్వేచ్ఛ ఉంటుంది. అవినీతి ప్రభుత్వోద్యోగులపై దర్యాప్తు ప్రారంభించి ప్రాసిక్యూట్ చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. అవినీతిపరులని తేలిన అధికారులను ఉద్యోగం నుంచి తొలగించి జైలుకు పంపించడంతో పాటు వారి ఆస్తిని స్వాధీనం చేసుకునేలా నిర్ణయాలు ఉంటాయి.
మొహల్లా సభలు: గాంధీజీ చెప్పిన స్వరాజ్ తరహాలో ప్రజలకు అధికారాన్ని బదిలీ చేస్తూ ప్రతి మొహల్లాకు ఒక సభ ఏర్పాటుచేస్తారు. తమ ప్రదేశంలో చేపట్టే రోడ్లు, కాలిబాటల నిర్మాణం, మరమ్మతు పనుల నిర్ణయాలను ఈ సభలు తీసుకుంటాయి. మొహల్లా సభ సంతృప్తి చెందిన మీదటే అభివృద్ధి పనులకు బిల్లులను చెల్లిస్తారు. స్థానిక పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య సేవాకేంద్రాల పనితీరును ఈ సభలే పర్యవేక్షిస్తాయి. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా: ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తాం. ఎన్‌డీఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు మినహా డీడీఏ, ఢిల్లీ పోలీసులు, ఎమ్సీడీలను రాష్ట్రప్రభుత్వం పరిధిలోనే ఉంచాలని డిమాండ్ చేసింది.
విద్యుత్ బిల్లులు: అధికారంలోకి వచ్చిన వెంట నే విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తాం. అన్ని డిస్కంల ఆడిట్‌కు ఆదేశిస్తాం. ఆడిట్‌కు అంగీకరించని కంపెనీల లెసైన్స్ రద్దుచేస్తాం. డిస్కంల ఆడిట్‌ను ఆర్‌టీఐ కిందకు తెచ్చి వాటి ఖాతాలు మరింత పారదర్శకంగా మారుస్తాం. సౌర విద్యుత్తు వాడకాన్ని ప్రోత్సహిస్తాం. ప్రతి ఇంటికి నీటి సరఫరా: నగరంలోని మురికివాడలు, అనధికార కాలనీలలోని ఇళ్లతో సహా అన్ని ఇళ్లకు నీటి సరఫరా సదుపాయం కల్పిస్తాం. ప్రతి ఇంటికి 700 లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తాం. ఢిల్లీ జల్ బోర్డు పనితీరును పారదర్శకంగా చేస్తాం.
నగరవాసులకు భద్రత: ప్రతి వార్డుకు ఒక సిటిజన్స్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి ఆపదలోనున్న ప్రతి ఒక్కరికీ భద్రతను కల్పించడంతో పాటు ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్దులపై ప్రత్యేక దృష్టిసారిస్తాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, వర్మ కమిటీ సిఫారసుల అమలుకు చర్యలు తీసుకుంటాం. మెరుగైన విద్యా వైద్య సదుపాయాలు: నగరంలో మరిన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, డెంగీ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన పనిచేసే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు. ఢిల్లీ విద్యార్థుల కోసం కొత్త కాలేజీల ఏర్పాటు, ప్రైవే టు స్కూళ్లు, కాలేజీలలో అధిక ఫీజులు, డొనేషన్ల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తాం.
Advertisement