Jan Lokpal Bill
-
హజారే దీక్ష వెనక అజ్ఞాత శక్తి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అవినీతిని అరికట్టేందుకు, ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులను కూడా విచారించేందుకు జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకరావాలంటూ అన్నా హజారే మరోసారి రామ్ లీలా మైదానంలో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఈ సారైనా విజయం సాధిస్తుందా ? ఫలితం సంగతి మాట పక్కనే పెడితే కనీసం ఆయన దీక్షకు అంతటి ప్రాచుర్యం లభిస్తుందా? నాటి దీక్ష అరవింద్ కేజ్రివాల్ నాయకత్వాన ఆప్ పార్టీ ఆవిర్భవించేందుకు దోహదం పడిందీ. ఇప్పుడు అలాంటి పార్టీ మరోటి పుట్టుకొస్తుందా ? 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారా ప్రారంభించిన దీక్షకు అంతటి ఆదరణ లభించడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా హోస్ని ముబారక్, కల్నల్ గడాఫీ లాంటి నియంతలను మట్టి కరిపించిన ‘అరబ్ వసంతం’ పేరిట మధ్యప్రాచ్యంలో ఉప్పెనలా ప్రజా ఉద్యమం కొనసాగుతున్న రోజులవి. దేశీయంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన రోజులు. అన్నా హజారే లాంటి ఉద్యమాలను 24 గంటలపాటు ప్రసారం చేయడానికి అవసరమైన ఫుటేజ్ కోసం టీవీలు కూడా వెతుక్కుంటున్న రోజులు. అన్నింటికన్నా అవినీతిని అంతమొందించాలన్న మొండి సంకల్పంతో అరవింద్ కేజ్రివాల్, ఆయన సహచరుడు మానిష్ సిసోడియా ముందుకొచ్చిన రోజులు. నిజం చెప్పాలంటే నాడు ఆర్టీఐ కార్యకర్తగా మెగసెసె అవార్డు అందుకున్న అరవింద్ కేజ్రివాల్, అన్నా హజారే ఉద్యమానికి ఊపిరిలా నిలబడ్డారు. హజారేను రాందేవ్ బాబా, శ్రీశ్రీ రవిశంకర్, కిరణబేడీ, ప్రశాంత్ భూషణ్‌ను తన సహచరుడు సిసోడియా సహకారంతో కలుసుకొని వారిని ఒక వేదికపైకి తీసుకొచ్చిందే కేజ్రివాల్. అప్పటికే మహారాష్ట్ర మంత్రుల అవినీతికి వ్యతిరేకంగా పలుసార్లు నిరాహార దీక్షలు చేసిన అన్నా హజారే ముందుంటే బావుంటుందని భావించే కేజ్రివాల్ ఆయనకు ఆ తర్వాత పోరాటంలో సముచిత స్థానం కల్పించారు. 2011, జనవరి నెలలో మొదటిసారి అవినీతికి వ్యతిరేకంగా భారీ సభను నిర్వహించినప్పుడు పలువురు వక్తల్లో అన్నా హజారే ఒకరు మాత్రమే. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా నడిపించినా ఫలితం లేకపోవడంతో అరవింద్ కేజ్రివాల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పోరాడాలనుకున్నారు. ముందుగా అందుకు స్వాగతం పలికిన అన్నా హజారే ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటూ తప్పుకున్నారు. హిమాచల్ నుంచి పార్టీని ప్రారంభించాలనుకున్నప్పుడు అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసి రావాల్సిందిగా సిసోడియాను అక్కడికి పంపించిందే హజారియా. చివరకు రాజకీయ పార్టీకి దూరంగా ఉండాలనుకోవడం ఆరెస్సెస్ ఒత్తిడే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెల్లార్లు రామ్‌లీలా మైదానంలో జనం ఉన్నా లేకున్నా పడిగాపులు కాసిన వారంతా ఎక్కువగా ఆరెస్సెస్ కార్యకర్తలే. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై పోరాటం కనుక ఆరెస్సెస్ తన కార్యకర్తలను పెద్ద ఎత్తున పంపించింది. నేడు బీజేపీ అధికారంలో ఉంది కనుక అన్నా హజారే ఉద్యమానికి ఆరెస్సెస్ కలిసి వచ్చే అవకాశం లేదు. అరవింద్ కేజ్రివాల్ బృందం అండ అంతకన్నా లేదు. నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా, అవినీతి కుంభకోణాలు నాడంతగా లేవు. నాడు టెలికాం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ మన్మోహన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కారణంగానే కేజ్రివాల్ ప్రధానంగా ప్రజా ఉద్యమంలోకి వచ్చారు. ఇక ఏ టీవీ అన్నా హజారేతోపాటు పడిగాపులు పడేందుకు నేడు సిద్ధంగా లేవు. చాలా టీవీలు ప్రజల గొంతును మరచిపోయి ‘హిజ్ వాయిస్’గా మారిపోయాయి. అంతర్జాతీయంగా కూడా ప్రజా ఉద్యమాల స్ఫూర్తి లేదు. మరి, ఏ ప్రతిఫలాన్ని ఆశించి అన్నా హజారే మళ్లీ ఉద్యమం చేపట్టారో అర్థం కావడం లేదు. మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేయడానికి వచ్చారా ? మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు వచ్చారా? ఆ సంకల్పంతోనే మరో సారి ఆరెస్సెస్ ఆయన వెంట ఉండి ఆయన్ని పక్కదారి పట్టించిందా? కాలమే సమాధానం చెప్పాలి. గతంలో అన్నా హజారే ఒత్తిడి వల్ల ఆరుగురు మంత్రులను మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నుంచి తొలగించిన నాటికి నేటికి ఒక్క మహారాష్ట్రలోనే అవినీతి 600 రెట్లు పెరిగిందన్నది ఓ సర్వే అంచనా. -
మరో కేజ్రీవాల్‌ను రానీయను!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి తన ఉద్యమంలో మరోసారి పుట్టడం జరగదని సామాజిక వేత్త అన్నా హజారే స్పష్టం చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకురాలేకపోవడంపై భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాల్లో జరిగిన ర్యాలీ పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌పాల్‌పై చిత్తశుద్ధి లేదని అన్నారు. నేను చేసే ఉద్యమాల్లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మళ్లీ రాబోడని అన్నా హజారే స్పష్టం చేశారు. అవినీతిపై అన్నాహజారే 2011 చేపట్టిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. తరువాత.. ఉద్యమం నుంచి బయటకు వచ్చి.. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపి ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును చట్టం చేయడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని హజారే చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 23న దేశ రాజధాని ఢిల్లీలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
జన్‌లోక్‌పాల్‌తో లోకాయుక్త నిర్వీర్యం
లోకాయుక్త మాజీ అధికారి సంతోష్‌హెగ్డే తుమకూరు, న్యూస్‌లైన్ : జన్‌లోక్‌పాల్ బిల్లు అమలైతే లోకాయుక్త అధికారాలు కోల్పోయి.. నిర్వీర్యమవుతుందని లోకాయుక్త మాజీ అధికారి సంతోష్‌హెగ్డే అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన డిగ్రీ పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమంలో సంతోష్‌హెగ్డే పాల్గొన్నారు. అనంతరం హెగ్డే మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లు అమలు చేయడానికి ముందుకు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ ఆ బిల్లు అమలైతే లోకాయుక్త అధికారులు ఉండరని తెలిపారు. ఈ విషయంపై ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని మీడియా ప్రశ్నించగా.. ఎన్నికలు ఉన్న కారణంగా తాను మాట్లాడలేకపోయానని సంతోష్ సమాధానమిచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానన్నారు. 2006 నుంచి 2012 వరకు లోకాయుక్తకు 24 వేల కేసులు వచ్చాయని, అందులో 700 మంది అవినీతిపరులకు శిక్ష వేయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ర్ట పోలీస్ శాఖలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఏడీజీపీ రవీంద్రనాథ్ ఉదంతమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ నిర్లక్ష్యం వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యంగా పోలీసులు భావించాలని సూచించారు. -
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
-
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లుకోసం వెయ్యిసార్లైనా సీఎం పదవిని వదిలేస్తా అన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నంత పని చేశారు. జన లోక్ పాల్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించకపోవడంతో కేజ్రివాల్ రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపారు. దాంతో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వ పాలన 49 రోజులకే ముగిసింది. కాంగ్రెస్ మద్దతుతో కొనసాగిన ప్రభుత్వం దినదిన గండంగానే గడిచింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో చాలా వేగంగా కేజ్రివాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. -
అంబానీతో ఢీ.. కేజ్రీవాల్ పదవికి ఎసరు!!
దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యాపార సామ్రాజ్యంతో ఢీకొన్నారు. అలా ఢీకొన్నది ఓ మామూలు సామాన్యుడు. అంతే, అతడి ఉద్యోగానికే ఎసరు వచ్చింది. ఆయనెవరో ఇప్పటికే అర్థమైంది కదూ. అరవింద్ కేజ్రీవాల్.. సరిగ్గా 50 రోజులు కూడా ముఖ్యమంత్రిగా పని చేయకముందే ఆయన పదవి ఊడిపోయేంత పరిస్థితి వచ్చింది. ఇంతకీ అలా ఎందుకు జరిగింది? అంబానీలతో ప్రత్యక్షంగా ఢీకొన్నందుకేనా? గొర్రె పొట్టేలు వెళ్లి కొండను ఢీకొంటే కొండకు ఏమీ కాదు సరికదా.. పొట్టేలు కొమ్ములే విరిగిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోలేకనే కేజ్రీవాల్ దాదాపుగా తన పదవి కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. ఓ సామాన్య ఐఆర్ఎస్ ఉద్యోగిగా ఉండే అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కోసం పోరాడేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత అన్నా హజారేతో కలిసి జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం తీవ్రస్థాయిలో ఉద్యమించారు. అటు నుంచి ఢిల్లీ రాజకీయాలను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటుచేసి, అతి తక్కువ కాలంలోనే ఎన్నికల్లో పోటీకి దిగారు. పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా, ఢిల్లీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా నిలిచి కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో అధికారం చేపట్టారు. పార్టీ పెట్టిన తొలినాళ్ల నుంచే ఢిల్లీలో కరెంటు బిల్లులు, వాటిలో ఉన్న లోపాల గురించి గట్టిగా పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్, పదవిలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే రిలయన్స్ పవర్ ఇండస్ట్రీస్‌పై విచారణకు ఆదేశించారు. రిలయన్స్ లెక్కల్లో ఉన్న తప్పొప్పులు వెతికి తీయాల్సిందిగా కాగ్, ఏసీబీ లాంటి సంస్థలను ఆదేశించారు. అంతేనా.. ఏకంగా చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన మురళీ దేవ్రా, ముఖేష్ అంబానీలపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. అంతే, తెరవెనక ఏం జరిగిందో గానీ.. జనలోక్‌పాల్ బిల్లును అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ తనంతట తానుగానే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగేలా వాతావరణం తీసుకొచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్ తలచుకుంటే ఎంతటి సమర్థుడైనా మట్టికరవాల్సిందేనని మరోసారి చెప్పేందుకు సిద్ధమైపోయారు!! -
'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై కేంద్ర మంత్రి వి. నారాయణ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చవకబారు ప్రచారం కోసమే కేజ్రివాల్ వెంపర్లాడుతున్నారని.. అందులో భాగంగానే జనలోక్ పాల్ బిల్లు కోసం పట్టుపడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రా లేక రాష్ట్ర మంత్రా అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. అరవింద్ కేజ్రివాల్ చవకబారు ప్రచారం మానుకొని.. ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నారాయణస్వామి సూచించారు. -
ఆమోదం పొందకపోతే తప్పుకుంటా
న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి కుండబద్దలు కొట్టారు. శాసనసభ సమావే శం తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ జన్‌లోక్‌పాల్ బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తాం. ఒకవేళ దానిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వీగిపోయేవిధంగా చేస్తే ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా’ అని అన్నారు. తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలా కలిసికట్టుగా వ్యవహరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారని అన్నారు. ఈ రెండు పార్టీలు అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తాము కోరుకున్నది కూడా ఇదేనని, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ఈవిధంగా వ్యవహరించడానికి కారణం ఓ భారీ వ్యాపార సంస్థపై తాము చర్యలకు ఉపక్రమించడమే ఇందుకు కారణమన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు త మ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయన్నారు. సభా కార్యకలాపాలు జరగబోవని, ఇందుకు కారణం ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకోవడమేనన్నారు. కాగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో... జన్‌లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లుల ఆమోదంకోసం ఆప్ సర్కారు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసినప్పటికీ తొలిరోజు వాటిని సభలో ప్రవేశపెట్టలేదు. స్వరాజ్ బిల్లును మంత్రిమండలి ఉదయం ఆమోదించింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టొచ్చని అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించినప్పటికీ తరువాత ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతులు ఎమ్మెల్యేలకు అందలేదని, సభ్యులు చదవడం కోసం వాటిని అందజేశాకే సభలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు స్పీకర్ ఎం.ఎస్. ధీర్ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనుమతి లేకుండా స్పీకర్ బిల్లును సభలో ప్రవేశపెట్టనివ్వకూడదన్న అభ్యంతరాలపై స్పందిస్తూ ప్రభుత్వం దానిని సభలో ప్రవేశపెట్టొచ్చని, అయితే ఎల్జీ అనుమతి లేకుండా దాని పై చర్చ జరిపించే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. ఇదిలాఉండగా బిల్లును విధానసభలో ఆమోదించడానికి ముందు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ న్యాయమంత్రిత్వశాఖ ఎల్జీకి సూచించింది. ఈ నేపథ్యంలో జన్‌లోక్ పాల్ బిల్లును సభలో ప్రవే శపెట్టలేకపోయినట్లయితే కేజ్రీవాల్ రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందించి, దానిని సభలో ప్రవేశపెట్టాలా? వద్దా ? అనే అంశంపై అసెంబ్లీలోనే సభ్యుల అభిప్రాయాన్ని కోరవచ్చని అంటున్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడానికి మెజారిటీ సభ్యులు నిరాకరించినట్లయితే కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశముందని వారంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం సభలో ప్రవేశపెట్టవచ్చని మరికొందరు అంటున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాన్ని విధానసభలో కాక మరోచోట జరపకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారును నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేదార్కుమార్ మండల్ దానిని ఉపసంహరించుకున్నారు. దీనిపై నిర్ణయం స్పీకర్ ఇంకా ఓ నిర్ణయంతీసుకోనందువల్ల ఇప్పుడే ఇలాంటి పిటిషన్ దాఖలు చేయనవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తొందరపాటుగా అభివర్ణించింది. అవసర మని భావిస్తే తరువాత దాఖలు చేయొచ్చని న్యాయమూర్తులు బి. డి. అహ్మద్, సిద్దార్థ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఇదిలాఉంచితే పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వడాన్ని ప్రభుత్వ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యతిరేకించారు. ఇది మంత్రి మండలి, లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించాల్సిన అంశమని, ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని ఆయన వాదించారు. అసెంబ్లీ భవనం వెలుపల విధానసభ సమావేశాన్ని నిర్వహించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారీఎత్తున డబ్బు ఖర ్చవుతుందనే విషయాన్నికూడా ప్రశాంత్ భూషణ్ ఖండించారు. ఎటూ తేల్చుకోలేకపోతోంది: లవ్లీ సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్ బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలో సందిగ్ధావస్థపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక అయోమయ పరిస్థితిని సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లును సరైన పద్ధతిలో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తాము చెప్పామని, ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. అయితే ప్రభుత్వ వైఖరే స్పష్టంగా లేదన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తొలుత తమకు సర్క్యులర్‌ను జారీచేసిందని, అయితే దానిని ఉపసంహరించుకుందనే విషయం గురువారం సభలోకి వచ్చినతర్వాత తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి పాఠశాల పిల్లాడి చేష్టల్లా ఉన్నాయని ఆయన విమర్శించారు. -
ఆరు నూరైనా అక్కడే!
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జన్‌లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లులకు చట్టరూపం ఇవ్వడానికి ఆప్ ప్రభుత్వం తొందరపడుతున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. స్వరాజ్ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర బుధవారం కూడా లభించలేదు. బుధవారం కేబినెట్ సమావేశంలో దీని ముసాయిదాపై చర్చ జరిపినప్పటికీ ఆమోదించలేదు. ఇక జన్‌లోక్‌పాల్ బిల్లును వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కేంద్రానికి పంపకుండానే బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీని సమావేశపరిచి ఈ బిల్లులను ఆమోదించాలని కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయం అవి చట్టరూపం దాల్చడానికి అడ్డంకిగా మారింది. కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టొచ్చా అనే అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అభిప్రాయాన్ని కోరారు. ఈ బిల్లును సరైన రీతిలో సభలో ప్రవేశపెట్టనట్లయితే వ్యతిరేకిస్తామని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఈ బిల్లును విధానసభ లో ప్రవేశపెట్టాలనే విషయంలో ఆప్ సర్కారు గట్టి పట్టుదలతో ఉంది. జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టరాదంటూ లె ఫ్టినెంట్ గవర్నర్ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ బిల్లు గురువారం అసెంబ్లీ ముందుకు రావడం ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అంటున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నో ఇందిరాగాంధీ ఇండోర్‌స్టేడియంలో ప్రజల సమక్షంలో జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యోచన కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. ఐజీఐ స్టేడియంలో విధానసభ నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ ఆప్ సర్కారు పంపిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియంలో విధానసభ సమావేశ నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ సుముఖంగా లేరని తెలిసినప్పటికీ ఇందు కు అనుమతి నివ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను మరోసారి కోరింది. ఎదురుదెబ్బ: కాగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్‌లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని న్యాయశాఖ స్పష్టం చేసింది. కేబినెట్లో చర్చించాం ఎల్జీ విన్నపం మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చిందని విద్య, ప్రజాపనుల శాఖ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రత కల్పించలేమని ఢిల్లీ పోలీసులు చెప్పడంపై ఆయన స్పందిస్తూ ఇంతకంటే భారీఎత్తున జరిగిన క్రీడలు, మత సంబంధమైన ఉత్సవాలకే ఎంతో భద్రత కల్పించారన్నారు. అటువంటప్పుడు కేవలం నాలుగు లేదా ఐదు గంటలపాటు ఐజీఐ స్టేడియంకు భద్రత ఎందుకు కల్పించలేరని ఆయన ప్రశ్నించారు. భద్రత విషయంలో వారు అసలు ఎందుకంత నిర్లిప్తంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విధానసభ ఆవల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలుగుతుందా అని ప్రశ్నించగా ఈ విషయం ప్రభుత్వం, స్పీకర్ల పరిధిలో ఉందన్నారు. -
నా ప్రభుత్వాన్ని నేనెందుకు పడగొట్టుకుంటా?
తన ప్రభుత్వాన్ని తాను పడగొట్టుకోవాలనుకోవట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జనలోక్‌పాల్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ - ఆప్ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన స్పందించారు. జన లోక్‌పాల్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందని పక్షంలో తాను రాజీనామా చేస్తానంటూ ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా ఆ బిల్లుకు ముందుగానే కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోడానికి ఆయన నిరాకరించారు. లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే మైలేజి పెరుగుతుందనే కేజ్రీవాల్ ఇలా చేస్తున్నారన్న మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఆ భావన తప్పని, తనకు తానుగా ప్రభుత్వాన్ని పడగొట్టుకోవాలని ఏమాత్రం అనుకోవట్లేదని చెప్పారు. తనపని తాను చేస్తున్నానని, పగలు.. రాత్రి చాలా కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. అయితే అదే సమయంలో, ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందనే బాధ మాత్రం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రేపు పడిపోతుందనుకుంటే, ఈవాళే పడిపోయినా నష్టం లేదన్నారు. ఏక్షణమైన కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోవచ్చన్న విషయాన్ని ప్రస్తావించగా ఈ వ్యాఖ్య చేశారు. అది వాళ్ల ఇష్టమని, తమకు మద్దతు ఇవ్వడం వాళ్లకు అంత కష్టంగా ఉంటే ఇవ్వనక్కర్లేదని కేజ్రీవాల్ చెప్పారు. -
రాజీనామా చేస్తా.. మెజారిటీ సీట్లు సాధిస్తాం: కేజ్రివాల్
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు. పార్లమెంట్ లో జన లోక్ పాల్ బిల్లును ఆమోదించకపోతే రాజీనామా చేయడానికైనా వెనుకాడను అని కేజ్రివాల్ తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న బిల్లుకు మద్దతు తెలుపమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం మనగడ ప్రశ్నార్థకమైంది. మాకు జన లోక్ పాల్, స్వరాజ్ బిల్లు చాలా ప్రధానం. ఆ బిల్లులకు ఆమోదం తెలుపడంలో విఫలమైతే, అధికారంలో కొనసాగడంలో అర్ధం లేదు. అందుకు రాజీనామా చేస్తాను అని కేజ్రివాల్ అన్నారు. అవినీతి వ్యతిరేక బిల్లులను ఆమోదించకపోతే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారు అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే పూర్తి మెజారిటిని సాధిస్తాం అని కేజ్రివాల్ ధీమా వ్యక్తం చేశారు. -
ఎన్ని వందలసార్లయినా.. సీఎం కుర్చీ వదిలేస్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి హెచ్చరిక గళం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటీవల ధర్నాకు దిగిన కేజ్రీవాల్.. అసెంబ్లీలో జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకుంటే ఏకంగా పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అవినీతిని అరికట్టేందుకు ఎంతదాకా అయినా పోరాడుతానని చెప్పిన మరుసటి రోజే మరో ముందడుగు వేశారు. అసెంబ్లీలో బిల్లు పాసవకుంటే తనకు పదవిలో కొనసాగే అర్హత లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు వందసార్లయినా ముఖ్యమంత్రి పదవిని వదులు కుంటానని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ముఖ్యమంత్రి కావడం కోసం కాదని, అవినీతి అరికట్టేందుకని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీకి కాస్త దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో ఏడు వారాల క్రితం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపుతున్నా ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ ఎన్నికల హామీలో లోక్‌పాల్ బిల్లు ముఖ్యమైనది. కాగా లోక్బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన పంతం నెగ్గకుంటే పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జన్ లోక్‌పాల్ బిల్లుతో పాటు స్వరాజ్ బిల్లు పాసవకుంటే తమ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. జన్ లోక్‌పాల్, బిల్లును ఈ నెల 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆప్‌కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా అసమ్మతి ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్‌కు 8 మంది, బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఆప్ మళ్లీ పూర్తి మెజారిటీ సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎందాకైనా వెళ్తా..!
జన్‌లోక్‌పాల్ చట్టంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకూ వెనుకాడబోనని పరోక్ష వ్యాఖ్య అవినీతి బయటపడుతుందనే కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయి న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ చట్టం తీసుకువచ్చేందుకు ఎందాకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. రాజీనామాకు సైతం వెనుకాడబోనని పరోక్షంగా తేల్చిచెప్పారు. అవినీతి నిర్మూలన తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, ఈ చట్టం వస్తే ఇబ్బందులు తప్పవన్న భయంతోనే కాంగ్రెస్, బీజేపీ మద్దతు పలకడం లేదని మండిపడ్డారు. శనివారం ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చట్టం కోసం ఎందాకైనా వెళ్లడం అంటే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా.. ‘‘అవినీతి అనేది పెద్ద అంశం. మీరు అనుకున్నది కూడా జరగొచ్చు..’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కామన్వెల్త్ అవినీతిని బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ భయపడుతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏడేళ్లపాటు పాలించిన బీజపీ కూడా వణుకుతోంది. అందుకే వారు కచ్చితంగా అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటారు’’ అని అన్నారు. గత వారం ఢిల్లీ కేబినెట్ జనలోక్‌పాల్ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇది చట్టరూపం దాలిస్తే ముఖ్యమంత్రి నుంచి గ్రూప్-డి ఉద్యోగులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే ఈ చట్టం కింద గరిష్టంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ఈ బిల్లును తెస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం తెలిసిందే. కేజ్రీవాల్ చెప్పిన ముఖ్యాంశాలు.. ఢిల్లీ అసెంబ్లీలో ఏదైనా చట్టం చేయాలనుకుంటే ముందుగా తమ ఆమోదం పొందాలంటూ 2002లో హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరాం. ఈ మేరకు లేఖ కూడా రాశాం. జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదం కోసం హోంశాఖకు పంపబోం. ఢిల్లీ అసెంబ్లీకి మూడు అంశాలు మినహా వేటిపైనా చట్టం చేసుకునే అధికారాన్ని రాజ్యాంగమే కట్టబెట్టింది. చట్టం చేయాలా వద్దా అన్నది చెప్పాల్సింది రాజ్యాంగం. అంతే తప్ప మరెవ్వరికీ ఆ అధికారం లేదు. -
సీఎం.. ప్రకటనల పులి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనల పులిగా మారిపోయారని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అలవికాని హామీలు ఇవ్వడం.. వాటిని నెరవేర్చలేకపోవడం.. కేజ్రీవాల్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా అనధికార కాలనీల గురించి, రేషన్ కార్డులు, అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడటంలేదని విమర్శించారు. ఆప్ ప్రభుత్వం ప్రకటనలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ.. వాటి అమలుపై చూపడంలేదన్నారు. కొత్త పథకాలను ప్రకటించడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేర్రూ.వాల్ యత్నిస్తున్నారని గోయల్ విమర్శించారు. న గరవాసులు ఆప్ సర్కార్ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అనే అంశంపై రాష్ట్ర పార్టీ సర్వే నిర్వహించనుందని చెప్పారు. జన్‌లోక్‌పాల్‌పై ఆయన మాట్లాడుతూ అది రాజ్యాంగబద్ధమా..కాదా అనే విషయం తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అది రాజ్యాంగబద్ధం కాకపోతే బీజేపీ మద్దతు ఇవ్వడం కష్టమేనని తేల్చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు జన్‌లోక్‌పాల్ బిల్లుపై సీఎం కేర్రూ.వాల్ రాసిన లేఖలో వాడిన భాష ఆక్షేపణీయమని గోయల్ అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. వారికి ఎల్జీ తీరుపై ఏమైనా అనుమానాలుంటే రాష్ట్రపతిని కలిసి విన్నవించుకోవాలే తప్ప అటువంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. ‘మీరు రాజ్యాంగాన్ని గౌరవించకపోతే.. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు..’ అని ఆప్ నాయకులను గోయల్ హెచ్చరించారు. అనుమతితో పనేలేదు నగరంలో చిన్న చిన్న స్థలాలు కలిగిన యజమానులకు శుభవార్త. 100 చదరపు మీటర్ల స్థలం కలిగిన వారు నిర్మాణ పనులను చేపట్టేందుకు ఇక పై ఆయా కార్పొరేషన్లనుంచి అనుమతి పొందరనవసరమే లేదు. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ టికెట్‌పై గెలుపొం దిన మూడు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొని పైవిధం గా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను పాటిస్తామంటూ సంబంధిత అధికారులకు ఓ అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావన్నారు. 40 లక్షలమంది నివసించే అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేందుకు అనుమతించకపోవడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఈ కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేం దు కు అనుమతించకుండా అభివృద్ధిని ఢిల్లీ ప్రభుత్వం అడ్డుకోవడంపైనా వారంతా చర్చించారన్నారు. అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతించకపోతే హైకోర్టు ఎదుట ధర్నాకు దిగుతామని ఆయనహెచ్చరించారు. ఈ అంశాన్ని ఎల్రూ. దృష్టికి తీసుకెళతామన్నారు. అనధికార కాలనీల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకుగాను తమ పార్టీ కార్యాలయంలో త్వరలో ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాలనీల్లో పారిశుధ్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు ఆయన సూచించారు. ఎన్డీఎంసీ, ఎస్డీఎంసీ, ఈడీఎంసీల ఏకీకరణకు సంబంధించి ఎమ్మెల్యే నంద్ కిషోర్గార్గ్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశామని, సదరు కమిటీ తమకు సలహాలు, సూచనలు ఇస్తుందన్నామన్నారు. ‘ఏక్ నోట్-కమల్ పర్ ఓట్’ పేరిట కార్పొరేటర్లు తమ తమ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి యజమానులను కలుస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని వారంతా ఈ సందర్భంగా కోరతారన్నారు. -
లోక్‌పాల్.. లొల్లి లొల్లి!
సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లుపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. నలుగురు న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేర్రూ.వాల్ శుక్రవారం లెఫ్టినెంట్ గవ ర్నర్‌కు రాసిన లేఖలో వెల్లడించగా, కేజ్రీవాల్ సర్కార్ ప్రత్యేకంగా జన్‌లోక్‌పాల్ బిల్లు విషయమై తమను సంప్రదించలేదని కేర్రూ.వాల్ పేర్కొన్న నలుగురు న్యాయనిపుణులలో ఇద్దరు అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయమై తాము మారూ. ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముద్గల్‌తో పాటు ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు పి.వి. కపూర్, కె.ఎన్.భట్, పినాకీ మిశ్రా సలహా తీసుకున్నామని ఎల్జీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు విషయమై తమను సంప్రదించలేదని, రాజ్యాంగ సంబంధిత ఇతర అంశాలను మాత్రమే చర్చించిందని కె.ఎన్. భట్, పినాకీమిశ్రా తెలిపారు. తాను అసలు జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను చూడనేలేదని భట్ తెలిపారు. విధానసభ ఆమోదం కోసం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును ఎల్జీ ద్వారా రాష్ట్రపతి వద్దకు పంపవలసి ఉంటుందా?.. అన్న దానిపైనే తాను ఢిల్లీ ప్రభుత్వానికి సలహా ఇచ్చానని పినాకీ మిశ్రా చెప్పారు. కె.ఎన్ .భట్ కూడా ప్రభుత్వం తనను ఈ విషయంపైనే సంప్రదించిందని స్పష్టం చేశారు. కాగా దీనిపై శనివారం ఆప్ ప్రభుత్వం స్పందించింది. జన్‌లోక్‌పాల్ బిల్లుపై తాము న్యాయనిపుణుల సలహా కోరలేదని, బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు కేంద్రం అనుమతి పొందాలనే హోం మంత్రిత్వశాఖ సూచనపై మాత్రమే వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారని తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖలోని అంశాలను మీడియాలోని కొన్ని వర్గాలు తప్పుగా ఉటంకించాయని ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి రాసిన లేఖను బహిరంగం చేసిన తర్వాత ఇలాంటి వక్రీకరణలు రావడం విచారకరమని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కోరినట్లుగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా మారూ. ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ప్రముఖ న్యాయవాదుల సలహా తీసుకుందని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. హోం మంత్రిత్వశాఖ సూచనలు రాజ్యాంగవిరుద్ధమని వారు అభిప్రాయపడ్డారని వివరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు నిబంధనలపై ప్రభుత్వం న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తన లేఖలో ఎక్కడా పేర్కొనలేదని, ఢిల్లీ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి హోం మంత్రిత్వశాఖ ఢిల్లీ ప్రభుత్వానికి చేసిన సూచనలపై మాత్రమే లేఖలో ప్రస్తావించారని ప్రభుత్వం వివరణలో పేర్కొంది. బిల్లును కేంద్రానికి పంపాల్సిందే.. వీలైనంత త్వరగా జన్‌లోక్‌పాల్ చట్టం తెచ్చి ప్రజలలో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ రాజ్యాంగ నియమాలను పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. కేంద్రం అనుమతి లేకుండా జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమేనని వారు అంటున్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా లేదు కాబట్టి మిగతా రాష్ట్ర అసెంబ్లీలకు ఉన్నట్లు అధికారాలు ఢిల్లీ విధానసభకు లేవని వారు అంటున్నారు. అర్థిక వ్యయంతో కూడిన ప్రతిబిల్లును ఢిల్లీ విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం దానిని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు. కేంద్రం ఇప్పటికే ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుతో సంబంధమున్న బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు కూడా ఢిల్లీ సర్కార్ కేంద్రం ఆమోదం పొందవలసి ఉంటుందని వారు చెబుతున్నారు.అలాగే జన్‌లోక్‌పాల్ బిల్లుకు కొంత నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కూడా విడుదలవుతాయి కాబట్టి ఈ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని వారు అంటున్నారు. ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ పోలీసులను, డీడీఏ సిబ్బందిని కూడా పరిధిలోకి తీసుకుంది కనుక విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు ఈ బిల్లుకు హోం శాఖ ఆమోదం తప్పనిసరి అంటున్నారు. కేంద్రం ఇప్పటికే లోక్‌పాల్ బిల్లు ఆమోదించింది కనుక ఢిల్లీ సర్కార్ రూపొందించిన బిల్లుకు కేంద్రం ముందస్తు ఆమోదం తప్పనిసరి అని వారు అంటున్నారు. వెనక్కు తగ్గం: ప్రశాంత్ భూషణ్ న్యూఢిల్లీ: జన్లోక్పాల్బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆప్ ముందడుగే వేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ మేం అధికారంలోకి వచ్చే ముందు జన్‌లోక్‌పాల్ తీసుకొస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చాం.. బిల్లుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అసెంబ్లీలో ప్రవేశపెడతాం. రాజ్యాంగంలోని 255 అధికరణ ప్రకారం మేం ముందుకు పోతాం. ఎవరినీ బతిమాలేది లేదు..’ అని ఆయన నొక్కిచెప్పారు. ఒకవేళ జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందితే తమ పార్టీల్లో చాలామంది నాయకులు జైలుకు పోవాల్సి ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. -
ఢిల్లీ జన్‌లోక్‌పాల్..రాజ్యాంగ విరుద్ధం
పార్టీ ఏర్పాటు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు దూకుడుగా వ్యవహరించి, అన్నింటా సఫలీకృతమైన కేజ్రీవాల్‌కు ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లును అమల్లోకి తేవడంలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓైవె పు ప్రభుత్వానికి మద్దతిస్తూనే బిల్లు విషయంలో కాంగ్రెస్ మోకాలడ్డుతుండగా, రాజ్యాంగపరమైన సమస్యలు కూడా కేజ్రీవాల్ సర్కారును ఇరకాటంలో పడేస్తున్నాయి. న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీ పార్టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడంలేదు. కేంద్ర అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ గురువారం నివేదించారు. దీంతో ఈ బిల్లు కథ మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.. ఢిల్లీకి ప్రత్యేక జన్‌లోక్‌పాల్ బిల్లు తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే బిల్లును అమలులోకి తీసుకువస్తామని అప్పట్లో ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ మొదటినుంచి మడతపేచీ పెడుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోనిదే బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టరాదని కాంగ్రెస్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెడితే తాము వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ముందే హెచ్చరించింది. కాగా, వచ్చే వారం బహిరంగ స్థలంలో జన్‌లోక్‌పాల్‌ను ప్రవేశపెడతామని ఆప్ భీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. కాగా, కేంద్ర అనుమతి లేకుండానే బిల్లును ప్రవేశపెడతామన్న ఆప్ సర్కార్ ప్రతిపాదనలోని రాజ్యాంగబద్ధతపై ఎస్జీని సంప్రదించారు. కాగా, కేంద్ర అనుమతి లేకుండా ఆప్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమేనని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. గత ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలను ఆమోదించిందని, అవి ప్రస్తుతం అమలులో ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ జన్‌లోక్‌పాల్ చట్టం చేయడానికి యత్నిస్తే అది కేంద్ర చట్టాన్ని పరిహసించినట్లేనని వివరించారు. కాబట్టి దీనికి రాష్ట్రపతి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనను ఆదిలోనే వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వ యోచన రాజ్యాంగ వ్యతిరేకమైనదని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేసినందున ఆప్ సర్కార్‌ను బిల్లుపై ముందుకు పోకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ‘ఈ బిల్లు వ్యవహారంలో మేం తుదికంటా పోరాడతాం. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అంగీకరించం..’ అని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ అన్నారు. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని ఆప్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెరవబోమని, మద్దతు ఇవ్వాలా వద్దా అనేది ఆయా పార్టీల ఇష్టమని ఆప్ నాయకులు అంటున్నారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఎవరికీ భయపడబోమని వారు ఢంకా బజాయిస్తున్నారు. కాగా,ఈ నెల 13వ తేదీన బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికి ముందు స్పోర్ట్స్ స్టేడియంలో రెండు రోజుల పాటు బిల్లుపై చర్చ జరిపాలని యోచిస్తోంది. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ఎల్జీకి సొలిసిటర్ జనరల్ నివేదికపై కేంద్ర మంత్రి మనీష్ తివారి స్పందిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనన్నారు. ఆప్ సర్కార్ రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటైంది కాబట్టి అది రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోవడం అనుచితమవుతుందన్నారు. రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాతే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సూచించారు. -
‘లోక్‌పాల్’ లుకలుకలు...బిల్లు గట్టెక్కేనా!
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆమ్ఆద్మీ పార్టీ సర్కార్ జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీరును ప్రభుత్వానికి మద్దతు ఇస్తోన్న కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తుండడంతో జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టరూపం దాల్చేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హోం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా జన్‌లోక్‌పాల్‌బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే ఆమ్ఆద్మీ పార్టీ మాత్రం ఈ వ్యతిరేకతను పట్టించుకోవడానికి నిరాకరిస్తోంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది బీజేపీ ఇంకా స్పష్టం చేయనప్పటికీ , రాజ్యాంగవిరుద్ధ పద్ధతిలో బిల్లును ప్రవేశపెట్టినట్లయితే తాము దానిని వ్యతిరేకిస్తామని మాత్రం స్పష్టం చేసింది. జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు ఢిల్లీ సర్కార్ ఈ బిల్లును లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా హోం మంత్రిత్వశాఖకు పంపి అనుమతి తీసుకోవాలని, ముందస్తు ఆమోదం లేకుండా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగవిరుద్ధమని కాంగ్రెస్ అంటోంది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెట్టే బిల్లును తాము ఆమోదించబోమని కాంగ్రెస్ తెలిపింది. ముందస్తు అనుమతిలేకుండా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆప్ సర్కారు ప్రయత్నించినట్లయితే ఈ అంశాన్ని సభా కార్యకలాపాల జాబితాలో చేర్చరాదని స్పీకర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించవచ్చని, లేదా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుమతి నిరాకరించవచ్చని లేదా బహిరంగ ప్రదేశంలో సభ నిర్వహించడానికి అసెంబ్లీ తీర్మానాన్ని తేవాలని ఆదేశించవచ్చని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇతర పార్టీల వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తోంది. తమది ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని వాదిస్తోంది. అసెంబ్లీ అత్యున్నత చట్టసభ అని ఆప్ సర్కార్ అంటోంది. ఇతర పార్టీల అభిప్రాయాల గురించి తమకు అవసరం లేదని, అనుకున్నట్లుగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడ్తామని ఆప్ నేతలు అంటున్నారు.విధానసభలో ఆమ్ఆద్మీ పార్టీకున్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు లేవు. అసెంబ్లీలో స్పీకర్‌ను తీసివేస్తే ఆప్ సంఖ్యా బలం 26 కాగా, శిరోమణి అకాలీదళ్ సభ్యునితో కలుపుకుని ప్రతిపక్ష బీజేపీ బలం 32 ఉంది. కాంగ్రెస్‌కు 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆప్ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నానని ప్రకటించినప్పటికీ జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ఇస్తానంటున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్, జేడీయూ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ లోక్‌పాల్ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు వ్యతిరేకించినా, కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరై, బీజేపీ వ్యతిరేకించినా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడం సాధ్యం కాదు. పోనీ.. ఇన్ని అడ్డంకులు దాటి ప్రభుత్వం అనుకున్నట్లుగా విధానసభ లోక్‌పాల్ బిల్లును ఆమోదించినా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు ఆయన అనుమతి నిరాకరించడానికి లేదా ప్రతికూల వ్యాఖ్యతో రాష్ట్రపతికి పంపడానికి కూడా అవకాశముందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సామాజిక కార్యకర్త అన్నాహజారే చేప ట్టిన ఉద్యమస్ఫూర్తితో ఢిల్లీలో ప్రత్యేక జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఆప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే 15 రోజుల్లో ఈ బిల్లును అమలులోకి తెస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినా బిల్లు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఆ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేనందున బిల్లును ప్రవేశపెట్టడంలో ఆప్ సర్కార్ తటపటాయిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది లేదంటే అంతే.. బిల్లు ఆమోదం పొందితే ముఖ్యమంత్రి సైతం దీని పరిధిలోకి వస్తారు. -
జన్‌లోక్‌పాల్‌కు ‘ఢిల్లీ’ ఓకే
బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం సొంతంగా బిల్లును రూపొందించిన కేజ్రీ సర్కారు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బిల్లుకు ఆమోదం బిల్లును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతికి పంపించబోమని వెల్లడి జన్‌లోక్‌పాల్ పరిధిలోకి ముఖ్యమంత్రి న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. తమ మరో ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా ముందడుగు వేసింది. అవినీతి వ్యతిరేక జన్‌లోక్‌పాల్ బిల్లుకు సోమవారం కేజ్రీవాల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించి బిల్లును ఆమోదిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. బిల్లు ఆమోదం పొందే చివరి రోజు సమావేశాన్ని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తామని పేర్కొంది. కేంద్రప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఈ బిల్లును పంపించడం లేదని కేజ్రీవాల్ మంత్రివర్గ సహచరుడు మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లునైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు కేంద్ర హోం శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఢిల్లీ పోలీస్, డీడీఏ, ఎన్డీఎంసీలు ఈ జన్‌లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయా అన్న ప్రశ్నకు సిసోడియా సమాధానం ఇవ్వలేదు. అయితే, అవి ఢిల్లీ ప్రభుత్వంలోని అవినీతి వ్యతిరేక విభాగం కిందకే వస్తాయి కాబట్టి.. లోక్‌పాల్‌లో ఏసీబీ విలీనం కాగానే సహజంగానే జన్‌లోక్‌పాల్ పరిధిలోకి కూడా వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ ఈ మూడు విభాగాలు నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకే జవాబుదారీగా ఉంటాయి కనుక ఈ ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ జన్లోక్పాల్లోని ముఖ్యాంశాలు.. ముఖ్యమంత్రి నుంచి గ్రూప్ డీ ఉద్యోగస్తుడి వరకు అందరూ దీని పరిధిలోకి వస్తారు. సీఎంకు, మంత్రులకు ప్రత్యేక రక్షణలు లేవు. నిజాయితీపరులైన అధికారులకు, అవినీతిని వెలుగులోకి తెచ్చినవారికి రక్షణ. నిజాయితీపరులైన అధికారులకు ఏటా అవార్డులు. కాల పరిమితితో కూడిన విచారణ జనలోక్‌పాల్‌లో రెండు విభాగాలుంటాయి. ఒకటి దర్యాప్తు విభాగం, మరొకటి నేర విచారణ విభాగం. సొంతంగా కానీ, ఏదైనా ఫిర్యాదుపైన కానీ లోక్‌పాల్ విచారణ ప్రారంభించవచ్చు. నేరం రుజువైతే ఆర్నెల్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అరుదైన, తీవ్రమైన అవినీతి కేసుల్లో జీవితఖైదు విధించవచ్చు. అవినీతిలో లబ్ధి పొందింది వ్యాపార లేక వాణిజ్య సంస్థ అయితే, శిక్షతో పాటు ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టానికి 5 రెట్లు జరిమానా. లోక్‌పాల్ చైర్‌పర్సన్‌ను, 10 మంది సభ్యులను ఏడేళ్ల పదవీకాలంతో ఏడుగురు సభ్యుల కమిటీ నియమిస్తుంది. ఆ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి ఉంటారు. ప్రతిపక్ష నేత, మాజీ లోకాయుక్త, కనీసం ముగ్గురు న్యాయ వ్యవహారాల నిపుణులు, ఇద్దరు ప్రఖ్యాత పౌరులు ఉంటారు. పార్లమెంట్ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లులోని ప్రధానాంశాలు.. కొన్ని ప్రత్యేక మినహాయింపులతో ప్రధానమంత్రి లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. ప్రధానిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. విచారణ రహస్యంగా జరుగుతుంది.స లోక్‌పాల్‌లో చైర్పర్సన్, గరిష్టంగా 8 మంది సభ్యులుంటారు. సభ్యుల్లో సగం మంది న్యాయ వ్యవహారాల నిపుణులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉంటుంది. చైర్‌పర్సన్‌ను, సభ్యులను నియమించే ఐదుగురు సభ్యుల కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, ఒక ప్రఖ్యాత న్యాయ నిపుణుడు ఉంటారు. దర్యాప్తు 60 రోజుల్లో, విచారణ ఆరు నెలల్లో ముగించాలి. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులకు ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, అవినీతికి అలవాటు పడిన అధికారులకు పదేళ్ల వరకూ కారాగారవాసం. విదేశాల నుంచి నిధులు వచ్చే, ప్రజాధనం సేకరించే మత సంస్థలు, సొసైటీలు, ఇతర సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. చార్జిషీట్ నమోదుపై నిర్ణయం తీసుకునేముందు సొంత విచారణ విభాగం ద్వారా కానీ, దర్యాప్తు సంస్థ ద్వారా కానీ లోక్‌పాల్ విచారణకు ఆదేశించవచ్చు. నిర్ణయం తీసుకునేముందు లోక్‌పాల్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాధికారి వాదన వినాల్సి ఉంటుంది. -
జన్ లోక్‌పాల్‌పై ‘ప్రజా’ అసెంబ్లీ
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిపరుల భరతం పడతామన్న ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించే దిశగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ సర్కారు అడుగులు వేస్తోంది. బిల్లుపై చర్చించేందుకు ఫిబ్రవరి 13 నుంచి 16 దాకా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది. 16న చివరి రోజు సమావేశాల్లో ప్రజలు కూడా పాల్గొనేందుకు వీలు కల్పిస్తామని మంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. అందుకోసం ఆ రోజు అసెంబ్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సమావేశమవుతుందని తెలిపారు! నిజానికి ఈ సమావేశాన్ని లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే చరిత్రాత్మక రీతిలో చేసిన ఉద్యమానికి వేదికైన రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెలిసిందే. భద్రతా సమస్యలు ఎదురవుతాయని పోలీసులు చెప్పడంతో వేదికను మార్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన జన్ లోక్‌పాల్ ముసాయిదాలో సీఎంను కూడా లోకాయుక్త పరిధిలోకి తేవడం విశేషం. ముసాయిదాపై మంత్రివర్గం ఇప్పటికే చర్చించిందని, కూర్పుపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ‘సభలో మాకు మెజారిటీ లేదు గనుక జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో చెప్పలేను. ఒకవేళ సభ ఆమోదం పొందినా, దాన్ని కేంద్రం ఆమోదించడమూ అనుమానమే’ అని ఆయన అనడం విశేషం! రూ.500 కోట్లతో బ్రాండింగా? కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అవినీతిపరులంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కేవలం బ్రాండ్ ఇమేజీ కోసమే ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లు ప్రజాసేవ ఏం చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ ఖర్చు మొత్తాన్నీ ప్రజల నుంచే గోళ్లూడగొట్టి వసూలు చేస్తారన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్, మోడీలపై తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. శుక్రవారం ఆప్ జాతీయ కౌన్సిల్ భేటీలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. రాహుల్, మోడీలతో పాటు పలువురు యూపీఏ మంత్రులు తదితరులు కూడా అవినీతిపరులేనని, వారందరిపైనా ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని చెబుతూ ఒక జాబితాను చదివి విన్పించారు. కేంద్ర మంత్రులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్, కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, కమల్‌నాథ్, సల్మాన్ ఖుర్షీద్, ఫరూక్ అబ్దుల్లా, ప్రఫుల్ పటేల్, జీకే వాసన్, ప్రకాశ్ జైస్వాల్‌లతో పటు ఎ.రాజా, అళగిరి, పవన్‌కుమార్ బన్సల్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి, నితిన్ గడ్కరీ, నవీన్ జిందాల్, అవతార్‌సింగ్ బదానా, అనూ టాండన్, సురేశ్ కల్మాడీ, కనిమొళి, దినూ సోలంకీ, తరుణ్ గొగొయ్, అనంత్‌కుమార్, యడ్యూరప్ప, హెచ్డీ కుమారస్వామి, ఛగన్ భుజ్‌బల్, వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లు అందులో ఉన్నాయి. ఇంకెవరి పేర్లయినా ఉంటే అందజేయాలని పార్టీ శ్రేణులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడ్డందుకు, వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తున్నందుకు సోనియాపై.. రాజకీయాలను నేరమయంగా మార్చినందుకు మోడీపై పోటీ చేయలని నిర్ణయించినట్టు ఆప్ తెలిపింది. -
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ
సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం విధానసభను ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ప్రత్యేకంగా సమావేశపరచాలని కేబినె ట్ నిర్ణయించింది. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తామని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టినా, కొన్ని విభాగాలపై అభ్యంతరాలు రావడంతో ప్రస్తుతం దానిని ఆమోదించలేదని చెప్పారు. మళ్లీ సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో బిల్లును ఆమోదిస్తామని ప్రకటించారు. అభ్యంతరాలేంటో సిసోడియా స్పష్టం చేయనప్పటికీ హోంశాఖ, న్యాయ విభాగాలు బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలిసింది. ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 16న ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే అసెంబ్లీ సమావేశంలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించిందని సిసోడియా తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావాలని ఆయన ప్రజలను ఆహ్వానించారు. బిల్లును ఆమోదించడానికి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. భద్రతా సమస్యల దష్ట్యా మైదాన్‌లో విధానసభను సమావేశపరచడాన్ని పోలీసులు వ్యతిరేకించారు. దాంతో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ స్టేడియంలో 15 వేల మంది కూర్చోవడానికి వీలుంది. స్టేడియంలో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించాల్సి ఉంటుంది. బిల్లు విశేషాలివి.. లోకాయుక్త వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న ‘ఢిల్లీ లోకాయుక్త బిల్లు 2014’ ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లును పోలి ఉన్నా, దానికన్నా కఠినంగా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి కూడా లోకాయుక్తకు జవాబుదారీ అవుతారు. కొత్త బిల్లు ప్రకారం.. పది మంది లోకాయుక్తలకు ఒక చైర్మన్ ఉంటారు. సగం మంది సభ్యులు న్యాయవ్యవస్థకు చెందిన వారుంటారు. మిగతా సగం మంది వివిధ రంగాల నిపుణులు ఉండవచ్చు. రిటైర్డు న్యాయమూర్తులు, అధికారులతో కూడిన కమిటీ లోకాయుక్త సభ్యుల పేర్లను ప్రతిపాదిస్తుంది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఈ పేర్లను ఖరారు చేస్తుంది. అవినీతి అధికారులను డిస్మిస్ చేయడం, డిమోట్ చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. నేరస్తులుగా తేలినవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అధికారం ఉంటుంది. కేసుల విచారణను ఆరునెలల్లో ముగించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. -
ఆమోదం వాయిదా జరిగింది చర్చ మాత్రమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జన్‌లోక్‌పాల్ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర పడలేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముసాయిదా బిల్లుపై చర్చ మాత్రమే జరిగింది. దీంతో ఇక తదుపరి సమావేశంలోనే ఆమోదం పొందే అవకాశముందని కేబినెట్ మంత్రులు చెబుతున్నారు. శుక్రవారం కేబినెట్ మరోసారి సమావేశం కానుందని, ఆరోజు ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర పడవచ్చని చెబుతున్నారు. కాగా ఎందుకు ఆమోదం పొందలేదనే విషయమై ఆప్ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ‘జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదా ఇంకా పూర్తి కాలేదు. న్యాయశాఖ బిల్లు ముసాయిదాను సరైన ఫార్మాట్లో పంపకపోవడంతో శుక్రవారం వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుగుణమైన ఫార్మాట్లో ముసాయిదా శుక్రవారం వరకు సిద్ధమైతే ఆరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడవచ్చు’నని చెప్పారు. ఇదిలాఉండగా ముసాయిదా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఫిబ్రవరిలో నగరంలోని రాంలీలా మైదాన్‌లో బహిరంగ అసెంబ్లీని ఏర్పాటు చేసి బిల్లుకు చట్టరూపం ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కార్ యోచిస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో కేబినెట్ ముఖ్యకార్యదర్శి నిమగ్నమయ్యారు.జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను కూడా కేబినెట్ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి ఆమోదం లభించిన వెంటనే రాంలీలా మైదాన్‌లో బహిరంగ అసెంబ్లీ కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను ప్రభుత్వ నేతలు కలిసే అవకాశముంది. బహిరంగ అసెంబ్లీపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించే సమావేశం ఎప్పుడు? ఎక్కడ? జరగనుందనే విషయం గవర్నర్ నిర్ణయంపై ఆధారపడనుంది. బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు అంటున్నారు. సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులపై చర్చ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మంగళవారం ఉదయం రెండు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనుకుంటోందని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కేబినెట్ సమావేశం తరువాత చెప్పారు. అయితే ఇందుకోసం కోసం విధివిధానాలను అతిక్రమించలేమని ఆయన చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశాన్ని పరిశీలించడం కోసం ఓ కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు. కమిటీ నిర్ధారిత గడువు ప్రకారం పనిచే స్త్తుందని, అప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులను ఎవరినీ పదవినుంచి తొలగించరని ఆయన స్పష్టంచేశారు. మహిళా సురక్షా దళ్ కోసం హోం గార్డులను, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఉపయోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. మంత్రుల నుంచి నివేదిక కోరిన సీఎంఆప్ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల రోజులలో తాము చేసిన పనులతో కూడిన నివేదిక సమర్పించవలసిందిగా సహచర మంత్రులను కోరారు. -
అవినీతి అంతుచూస్తాం
సాక్షి, న్యూఢిల్లీ:తమ ప్రభుత్వం ఢిల్లీని దేశంలో మొట్టమొదటి అవినీతిరహిత రాష్ట్రంగా మారుస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని ప్రసంగిస్తూ పైవిషయం చెప్పారు. గడచిన 25 రోజుల్లో అవినీతి 20 నుంచి 30 శాతం తగ్గిందని చెప్పారు. ‘నేను ఛత్రసాల్ స్టేడియానికి వచ్చే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కారు అగింది. వెంటనే ఆటోడ్రైవర్లు వాహనం చుట్టూ గుమిగూడారు. పోలీసులు తమ వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం లేదని వివరించారు. పోలీసులు డబ్బు గుంజకపోవడం వల్ల టీ ధరలు తగ్గించినట్లు చాయ్వాలాలు చెబుతున్నారు. పోలీసుల్లోనూ నిజాయితీపరులున్నారు. మద్యం మాఫియాతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అధికారి కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తాం. నిజాయితీరులైన అధికారులను ప్రోత్సహిస్తాం’ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా ధర్నా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. సెక్షన్ 144 కింద నిషేదాజ్ఞలు విధించడం రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్నారు. కొందరు అన్నట్లుగా తాను రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదని, ముఖ్యమంత్రి ధర్నా చేయకూడాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన చెప్పారు. తాను ధర్నా చేసే చోట సెక్షన్ 144 విధించినవాళ్లే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే తాను మరోమారు ధర్నా చేయడానికీ వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. ‘సచివాలయం నుంచి చేయగలిగినదంతా చేస్తాను. అక్కడ చేయడానికి వీలుకాని పని జరిపించుకోవడానికి వీధుల్లోకి వెళ్తాను’ అని ఆయన తెలిపారు. తాము సూచించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కేజ్రీవాల్, ఆయన సహచరులు ఇటీవల రైల్‌భవన్ వద్ద 34 గంటలపాటు ధర్నా చేయడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. లోక్‌పాల్ బిల్లు సిద్ధం... అవినీతి అంతానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు దాదాపుగా తయారయిందని, ఫిబ్రవరిలో రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే విధానసభ ప్రత్యేక సమావేశంలో దానిని ఆమోదిస్తామని చెప్పారు. ఢిల్లీలో మహిళల భద్రత కోసం మహిళా సురక్షా దళ్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించామని చెప్పారు. ఇందులో రిటైర్డ్ సైనిక ఉద్యోగులు, పోలీసులు, హోంగార్డులు సభ్యులుగా ఉంటారని సీఎం తెలిపారు. అత్యాచారాలకు పాల్పడినవారిని ఆరు నెలల్లోపే జైలుకు పంపేందుకు అవసరమైన విధానాన్ని ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. వ్యవస్థ మారాలి.. ప్రభుత్వ పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వ్యవస్థలో అందరూ చట్టం దృష్టిలో సమానులు కావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతోపాటు ‘హమ్ హోంగే కామ్యాబ్’ పాట పాడి ప్రసంగం ముగించారు. ఇదిలా ఉంటే పరేడ్ కమాండర్ గౌరవ వందనం సమర్పించేంతవరకు ఆగకుండానే కేజ్రీవాల్ వేగంగా వేదిక దిగి వెళ్లడంతో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినట్లయింది. కఠిన నిబంధనలతో జన్‌లోక్ బిల్లు లోకాయుక్త వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న ‘ఢిల్లీ లోకాయుక్త బిల్లు 2014’ ఫిబ్రవరిలో విధానసభ ముందుకురానుంది. ఈ బిల్లు ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లును పోలిఉన్నా, దానికన్నా కఠినంగా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి కూడా లోకాయుక్తకు జవాబుదారీ అవుతారు. దీని ముసాయిదాను ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపారని అధికారవర్గాలు తెలిపాయి.కొత్త బిల్లు ప్రకారం.. పది మంది లోకాయుక్తలకు ఒక చైర్మన్ ఉంటారు. సగం మంది సభ్యులు న్యాయవ్యవస్థకు చెందిన వారుంటారు. మిగతా సగం మంది వివిధ రంగాల నిపుణులు ఉండవచ్చు. రిటైర్డు న్యాయమూర్తులు, అధికారులతో కూడిన కమిటీ లోకాయుక్త సభ్యులపేర్లను ప్రతిపాదిస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ పేర్లను ఖరారు చేస్తుందని అంటున్నారు. అవినీతి అధికారులను డిస్మిస్ చేయడం, డిమోట్ చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. నేరస్తులుగా తేలినవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చని చెబుతున్నారు. ఇది కేసుల విచారణను ఆరునెలల్లో ముగిస్తుంది. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. -
క్రేజీ పొలిటీషియన్
విశ్లేషణం ఐఆర్ఎస్ వదిలిపెట్టి, ఉద్యమాల బాటపట్టి, సమాచారహక్కు తెచ్చి, జన్లోక్పాల్కోసం పట్టుబట్టి, ఆమ్ఆద్మీ పార్టీ పెట్టి, సామాన్యుడికి పట్టంకట్టి, ముఖ్యమంత్రిని ఓడగొట్టిన క్రేజీ పొలిటీషియన్... అరవింద్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్. సీ, లుకింగ్, బ్రైట్లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్థం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. కంటి కదలికలు కుడివైపు పైకి ఉంటే ఏదో క్రియేట్ చేసి చెప్తున్నారని అర్థం. నాకు నచ్చిందే చేస్తాను... కేజ్రీవాల్ సంప్రదాయ రాజకీయ నాయకులకు పూర్తిగా భిన్నమైన నాయకుడు. తన ఉపన్యాసాలతో అదరగొట్టడు, అలివికాని హామీలతో మభ్యపెట్టడు. సామాన్యుడిలో సామాన్యుడిలా వారి సమస్యల పరిష్కారంకోసం కృషిచేస్తాడు. తాను నమ్మిన విలువల పరిరక్షణకోసం పోరాడతాడు. నిజమైన ప్రజా సేవకుడిగా పనిచేస్తాడు. అందుకేనేమో తమ పార్టీ గుర్తుగా చీపురు ఎంచుకున్నాడు. అయితే అరవింద్ పైకి కనిపించేటంత ప్రజాస్వామ్య నాయకుడు కాదని ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు తరచుగా చూపుడువేలును చూపించి మాట్లాడతాడు. అలాగే అరచేతిని కిందకు ఉంచి మాట్లాడతాడు. వీటినిబట్టి ఆయన అథారిటేటివ్ నాయకుడని చెప్పవచ్చు. అంటే ఎవరేం చెప్పినా తాను అనుకున్నదే చేయడం, తాను చెప్పిందే మిగతావారు వినాలనే తత్వమన్నమాట. జనలోక్‌పాల్ బిల్లుకోసం హజారేతో కలిసి ఉద్యమించినప్పటికీ, రాజకీయపార్టీ స్థాపన విషయంలో ఆయనతో విభేదించడానికి కూడా ఈ నాయకత్వ లక్షణమే కారణమని చెప్పవచ్చు. అయితే విజన్, ఫోకస్ ఉన్న నాయకుడు కాబట్టి తన పార్టీని సమర్థంగా, విజయపథంలో నడిపించగలిగాడు. ప్రొయాక్టివ్ పర్సన్... అరవింద్ ప్రొయాక్టివ్ వ్యక్తిత్వమున్నవాడు. సమస్యలు వచ్చినప్పుడు వాటిపై స్పందించడం కాకుండా, సమస్యలను ముందే గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషిచేస్తాడు. తాను చేస్తున్నది మంచో చెడో నిర్ణయించుకునేందుకు తన అంతర్వాణినే ఆధారంగా తీసుకుంటాడే తప్ప ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోడు. ఒత్తిడి ఎదురైనప్పుడు తానే భరిస్తాడు, పెద్దగా బయటకు వ్యక్తంచేయడు. ఏ విషయంపైనైనా ఎదుటివారిని ఒప్పించేందుకు అనేక ఉదాహరణలు వివరిస్తాడు. తన సహచరుల స్పందనలు, ప్రజల ప్రతిస్పందనలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. జయాపజయాలకు తానొక్కడినే బాధ్యుడినని అనుకోడు. తన జట్టుతోపాటు పరిస్థితులు కూడా కారణమని ఒప్పుకుంటాడు. గతం, వర్తమానం కంటే భవిష్యత్తు గొప్పగా, మెరుగ్గా ఉండేందుకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజలకోసం... ప్రజల మనిషిగా... ఆమ్ఆద్మీ పార్టీ స్థాపించాకనే కేజ్రీవాల్ ప్రజాసమస్యను పట్టించుకుంటున్నాడనుకుంటే పొరపాటే. అంతకుముందే... తాను ఇన్‌కంటాక్స్ అధికారిగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రజలకు సమాచారహక్కు ఉంటే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చని విశ్వసించారు. ఆ హక్కుకోసం ఉద్యమించారు, సాధించారు, రామన్ మెగసస్సే అవార్డును అందుకున్నారు. ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ పార్టీలను నేను వ్యతిరేకిస్తున్నాను... రాజకీయాలు నాకు సహనాన్ని నేర్పాయి... సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటే... ఢిల్లీలో మా విజయం ప్రజల విజయమే... ఇవన్నీ కేజ్రీవాల్ మాటలే. వర్తమాన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనే సమున్నత లక్ష్యంతో ఆయన స్థాపించిన ఆమ్ఆద్మీపార్టీ సంచలనాలు సృష్టించింది... మరిన్ని సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఒత్తిడి ఎదురైనప్పుడు తానే భరిస్తాడు. ఏ విషయంపైనైనా ఎదుటివారిని ఒప్పించేందుకు అనేక ఉదాహరణలిస్తాడు. విశేష్, సైకాలజిస్ట్ -
15 రోజుల్లో జన్‌లోక్‌పాల్ కష్టమే!
కేంద్రం అనుమతి తప్పనిసరి; నిపుణుల అభిప్రాయం సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే డిసెంబర్ 29న రామ్‌లీలా మైదాన్‌లో ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటుచేసి జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే, ఆ హామీని నెరవేర్చడం కష్టమేనని ఆప్ ఇప్పుడు భావిస్తోంది. అందుకు చట్ట సంబంధ సమస్యలున్నాయని బుధవారం ఆ పార్టీ నేత కేజ్రీవాల్ స్వయంగా చెప్పారు. లోక్‌పాల్ బిల్లు, ఢిల్లీకి రాష్ట్రహోదా విషయానికి వస్తే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రప్రభుత్వానికి ఈ విషయాలపై ఉత్తర్వులు జారీచేసే వీలున్నా, చట్టం చేయాలంటే మాత్రం కేంద్రం అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్టం చేసిందని ఆయన వివరించారు. అయితే, ఈ విషయం కేజ్రీవాల్‌కు ముందే తెలిసి ఉండాల్సిందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఉమేశ్ సెహగల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టాన్నీ ఆమోదించలేదన్న విషయం తనకు ఇప్పుడే తెలిసినట్లుగా కేజ్రీవాల్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కొత్త చట్టాన్ని రూపొందించడానికి ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి పొందవలసిన అవసరం లేదని, కానీ ఇదివరకే చట్టం ఉన్న దానిపై కొత్త చట్టం చేయాలనుకున్నట్లయితే కేంద్రం అనుమతి తప్పక తీసుకోవలసి ఉంటుందని వివరించారు. కేంద్రం ఇటీవలే లోక్‌పాల్ బిల్లు ఆమోదించింది కాబట్టి ఢిల్లీలో మరో లోక్‌పాల్ చట్టాన్ని తేలేరని, ఢిల్లీలో లోకాయుక్త చట్టం ఇదివరకే ఉండడం వల్ల కొత్తగా లోకాయుక్త చట్టం చేయడానికి మొదట కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా లేనందువల్ల కేంద్రపాలిత ప్రాంతానికి వర్తించే చట్టాలే వర్తిస్తాయి. అందువల్ల ఆప్ ప్రభుత్వం లోకాయుక్త చట్టం కొత్తగా రూపొందించి, దానిని కేబినెట్ ఆమోదించిన తరువాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అనుమతి కోసం పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించాక ఆ బిల్లు తగిన సవరణలతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి తిరిగివస్తుంది. అప్పుడు దానిని ఢిల్లీ విధానసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందగలుగుతారు. ఈ ప్రక్రియకు కొన్ని నెలలు పట్టే అవకాశముంది. -
‘సామాన్యుడి’కి సవాళ్లెన్నో!
దేశరాజధానిలో ‘సామాన్యుడి’ సర్కారు కొలువుదీరడానికి రంగం సిద్ధమయింది. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికీ నిత్యం 700 లీటర్ల నీరు ఉచితంగా ఇవ్వడం, విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించడం వంటివి ఆప్‌కు కష్టసాధ్యంగా పరిణమించవచ్చు. తమ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతుందన్న నమ్మకం పార్టీలోనే లేదని ఆప్ నేతలు చెబుతుండడం కొసమెరుపు. సాక్షి, న్యూఢిల్లీ:ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి పథకాల అమలులో చిక్కుముళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరెంటు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని సంబంధిత రంగాల నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కూడా కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండకపోవచ్చు. పోలీసుశాఖను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తేవడానికి షీలా దీక్షిత్ కూడా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆప్ ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచిచూడాలి. ఆప్ పథకాలు ఆచరణ సాధ్యం కావని కాంగ్రెస్, బీజేపీ స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కోవాల్సిన సమస్యలకు కొదవేమీ లేదు. తాము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో జన్‌లోక్ పాల్ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా, అవినీతి అధికారుల తొలగింపు, ఆస్తుల స్వాధీనం వంటి హామీలు ఇచ్చారు. కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, ప్రతి ఇంటికీ 700 లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయడం వంటి ముఖ్యమైన హామీలను వీలైనంత త్వరలో అమలు పరచాలని ప్రజలు కోరుతున్నారు. కేజ్రీవాల్ సత్తా నిరూపించుకోవాలంటే ఈ రెండు హామీలను విజయవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. మరో రెండునెలల్ల్లో లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ఈ హామీల అమలును ప్రకటించడం సాధ్యం కాదని చెబుతున్నారు. అందువల్ల కేజ్రీవాల్ రెండు నెలల లోపల ఈ హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ వాగ్దానాలను అమలు చేసినప్పుడే ఆప్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు నిస్సంకోచంగా వెళ్లగలుగుతుందని విపక్ష నాయకులు అంటున్నారు. ఎన్నాళ్లు ఉంటుందో ? ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న సందే హాలు సద్దుమణగడం లేదు. ఆప్ ప్రభుత్వం మనుగడపై ఆ పార్టీ నేతలే మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది, ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ ఆప్ ప్రభుత్వం చానాళ్లు కొనసాగలేదన్న సందేహాన్ని సోమవారం కూడా వ్యక్తం చేశారు. ఆప్ తన మేనిఫెస్టో అమలు చేస్తుందని, అయితే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఆప్ ప్రభుత్వాన్ని కూల్చవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తుమ్మితే ఊడిపోయేలా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధపడిన అరవింద్ కేజ్రీవాల్ దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవలసి ఉంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చాన్స్ ? ప్రభుత్వం ఏర్పాటు తథ్యం కావడంతో కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రి మండలిలో ఆరుగురికి చోటు లభించే అవకాశముంది. అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పించడంలో భాగంగా ఒక మహిళ, ఒక సిక్కు, ఒక ముస్లింకు ప్రాతినిథ్యం కల్పించడం అనవాయితీ. ఆప్ తరపున ఎన్నికైన 28 ఎమ్మెల్యేల్లో పత్పర్గంజ్ నుంచి గెలిచిన మనీష్ సిసోడియాకు మంత్రి పదవి లభించడ ం ఖాయమని అంటున్నారు. మాలవీయనగర్‌లో మంత్రి కిరణ్ వాలియాను ఓడించిన సోమ్‌నాథ్ భారతి, లక్ష్మీనగర్‌లో మంత్రి వాలియాను ఓడించిన వినోద్ కుమార్ బిన్నీకి పదవి దక్కవచ్చని అంటున్నారు. గ్రేటర్ కైలాష్‌లో విజయ్ కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రాను ఓడించిన సౌరభ్ భరద్వాజ్‌కు కూడా అవకాశం దక్కవచ్చు. ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు భారతి లేదా రాఖీ బిర్లా లేదా వందనా కుమారిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిక్కులకు ప్రతినిధిగా తిలక్‌నగర్ నుంచి గెలిచిన జర్నైల్ సింగ్ పేరును కూడా పరిశీలించవచ్చని అంటున్నారు. భారతి వృత్తిరీత్యా వకీలు కాగా సౌరభ్ భరద్వాజ్ ఐటీ నిపుణుడు. జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆప్ కార్యకర్తగా మారారు. హత్య కేసులో చిక్కుకున్న ఆప్ కార్యకర్త కేసును వాదించిన భారతి ఆప్‌లో సభ్యురాలయ్యారు. రాఖీ బిర్లా విలేకరిగా పనిచేసేవారు. ఆమె మంగోల్‌పురిలో మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించారు. వందనా కుమారి బీజేపీ దిగ్గజం రవీంద్ర బన్సల్‌పై షాలిమార్‌బాగ్‌లో విజయం సాధించారు. ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు: ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను ఆప్ నేత మనీ ష్ సిసోడియా వెల్లడించారు. ఎస్ఎంఎస్లు, ఇంట ర్నెట్ ద్వారా 6,97,370 మంది అభిప్రాయాలు తెలి యజేశారన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా మొత్తం 5,23,183 సందేశాలు అందాయని, వాటిలో 2,65,000 సందేశాలు ఢిల్లీనుంచి వచ్చాయని తెలి పారు. ఇంటర్నెట్ ద్వారా అందిన సలహాల్లో 74 శాతం మంది ప్రభుత్వ ఏర్పాటును కోరారని మనీష్ వెల్లడించారు. ఇవిగాక ఆప్ ఢిల్లీలో 280 జనసభలు నిర్వహించిందని, అందులో 257సభల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూల అభిప్రాయం వచ్చిందని, 23 వ్యతిరేకించాయని సిసోడియా చెప్పారు. -
ఆప్ వాగ్దానాలివీ...
అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లును అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా అమలు చేయడం స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకోవడానికి మూడు వేల మొహల్లా సభలను ఏర్పాటు చేయడం. పనుల నాణ్యత సక్రమంగా ఉన్నట్టు ఈ సభను నిర్ధారిస్తేనే ప్రభుత్వం సదరు కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తుంది. కరెంటు చార్జీలను సగం తగ్గిస్తారు. డిస్కమ్‌ల ఖాతాలకు ఆడిటింగ్ నిర్వహిస్తారు. అధిక బిల్లులను సవరిస్తారు. రెండు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం రోజుకు 700 లీటర్ల కంటే తక్కువ వాడే కుటుంబాలకు అంతేమొత్తం నీటిని ఉచితంగా సరఫరా చేస్తారు ఈ ఏడాది నవంబర్ దాకా వచ్చిన అధిక బిల్లులను రద్దు చేస్తారు. ఢిల్లీ పోలీసులు, డీడీఏను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తారు మైనారిటీలకు రక్షణ కల్పిస్తారు. నకిలీ ఎన్‌కౌం టర్లు, ముస్లిం యువతపై కేసులకు ముగింపు అవినీతికి పాల్పడే అధికారులను తొలగించి వారి ఆస్తులను స్వాధీనపర్చుకుంటారు. అశోక్ ఖేమ్కా, దుర్గాశక్తి నాగపాల్ వంటి అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి వార్డులో పౌరరక్షక దళాన్ని ఏర్పాటు చేస్తారు ఢిల్లీ ప్రభుత్వం వ్యాజ్యదారు అయితే ఈ కేసు వాయిదాపడకుండా చూస్తారు. -
పటిష్టమైన జనలోక్‌పాల్ బిల్లు కావాలి
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల అవినీతిని బయటపెట్టేందుకు పటిష్టమైన జనలోక్‌పాల్ కావాలని ‘మన కోసం’ సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శివరామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం 3వ రాష్ట కమిటీ సమావేశం పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో గల ఒక హోటల్లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కోరలు లేని లోక్‌పాల్‌బిల్లు తీసుకురావటం వల్ల ప్రజలకు ఉపయోగం లేనదన్నారు. 2005లో కేంద్ర ప్రభుత్వం సహ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని తెలిపారు. నాటి నుంచి సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప చట్టం అమలు కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయటం లేదని ఆరోపించారు. సహ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు అవసరమైన సిబ్బంది, నిధులు, అధికారులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తను ఏర్పాటు చేయటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చన్నారు. అన్ని రాజకీయపార్టీలను కూడా సహ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేజ్రీవాల్ స్ఫూర్తితో మనకోసం సంస్థ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. అనంతరం సంఘం నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్, ప్రధాన కార్యదర్శి జాస్తి తాతారావు, ఉపాధ్యక్షుడు జి.నాగరత్నం నాయుడు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన కమిటీ వివరాలు రాష్ట్ర అధయక్షుడిగా కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి.మురళి, కోశాధికారిగా కె.రాజారావు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఏడుగురు సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఐదుగురు ప్రచార కార్యదర్శులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉన్నారు. -
ఆప్ నేతలకు దూరంగా అన్నా!
సాక్షి, ముంబై: లోక్‌పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హాజరేను ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కుమార్ విశ్వాస్, మరో ఇద్దరు సభ్యుల బృందం కలిసింది. అయితే వారిని వేదికిపై అనుమంతించేందుకు హజారే ఇష్టం చూపలేదు. దీంతో వారు కింద కూర్చుండి అన్నా ఆందోళనకు మద్దతు పలికారు. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేథా పాట్కర్ కూడా హాజారేను కలిసి, ఆయన దీక్షకు మద్దతు పలికారు. వేదికపెకైక్కి అన్నాతో మాట్లాడిన అనంతరం పాట్కర్ వెళ్లిపోయారు. అన్నా మద్దతుదారుల నిరసన.. ఆప్ సభ్యులకు గురువారం మరో చేదు అనుభవం ఎదురైంది. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న దీక్షకు మద్దతు పలికేందుకు ఆప్ బృందం సభ్యులు రాలేగావ్ సిద్ధీకి చేరుకోడంతో వారిని చూసేందుకు ముందుకు వచ్చిన హజారే మద్దతుదారుల్లో ఓ వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ముర్దాబాద్’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అతనికి మరికొంతమంది తోడవడంతో కొంత కలకలం చెలరేగింది. ఆప్ సభ్యులను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారని తెలిసింది. ఈ విషయమై అన్నా సన్నిహితులు మాట్లాడుతూ... అన్నా హాజరేతో భేటీ అయ్యేందుకు వస్తానని ప్రకటించి, మూడురోజులైనా ఆప్ నేత కేజ్రీవాల్ రాలేగాం సిద్ధి రాకపోవడంతోనే అన్నా మద్దతుదారుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైందని వివరించారు. కొంతమంది నినాదాలతో తమ నిరసనను తెలపగా అన్నా బృందం సభ్యులు వారికి సర్దిచెప్పడంతో శాంతించారని వివరించారు. అనంతరం అన్నా బృందం ఆప్ సభ్యులకు స్వాగతం పలికిందన్నారు. క్షీణిస్తున్న అన్నా ఆరోగ్యం.. చలితోపాటు వయసుపైబడిన కారణంగా దీక్ష చేస్తున్న అన్నా ఆరోగ్యం కొంత క్షిణించినట్టు తెలిసింది. ఆయన బరువు తగ్గారని అన్నా బృందం సభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేంత వరకు తన ఆందోళన కొనసాగుతుందని హజారే మరోసారి స్పష్టం చేశారు. ఆయనకు మద్దతిచ్చేందుకు గురువారం ఉదయం ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ గురువారం రాలేగావ్ సిద్ధీకి చేరుకున్నారు. కొంతసేపు హజారేతో మాట్లాడిన ఆమె అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్నేర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ.. జన్‌లోక్‌పాల్ బిల్లుకోసం దీక్ష చేస్తున్న అన్నా హజారే మద్దతుదారులు గురువారం ఉదయం కూడా ప్రభాత్‌ఫేరీ నిర్వహించారు. అనంతరం పార్నేర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సంతోష్ భారతిపై విశ్వాస్ విమర్శలు... లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న ఆందోళనలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతం చూసుకుంటున్న సంతోష్ భారతిపై ఆప్ సభ్యుడు కుమార్ విశ్వాస్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అన్నా బృందంలో కొందరు విలేకరుల రూపంలో దళారులుగా చేరారని, వారు ఇన్ఫార్మర్లంటూ సంతోషపై పరోక్ష విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ నాయకులకు వేదికపై చోటులేదు... రాజకీయ పార్టీల నాయకులకు వేదికపై చోటు లేదని అన్నా హజారే పేర్కొన్నారు. అన్నాను కలిసేందుకు వచ్చిన ఆప్ సభ్యులను కూడా ప్రజలు కూర్చుండే చోటే కూర్చోబెట్టారు. కొంత సేపటి తర్వాత కుమార్ విశ్వాస్‌కు అన్నాహజారేతో ఏకాంతంగా మాట్లాడేందుకు మాత్రం అవకాశమివ్వడం గమనార్హం. -
హజారే దీక్షకు స్పందన అంతంతే
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకి చేరుకుంది. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతిచ్చేందుకు మొదటి రోజు అన్నా టీమ్‌లోని సభ్యులెవరూ రాలేదు. కాని రెండవ రోజు కిరణ్ బేడీ రాలేగన్సిద్ధి చేరుకున్నారు. ఈసారి అన్నా చేపట్టిన నిరాహార దీక్షకు ఊహించినంతగా మద్దతు లభించలేదని తెలుస్తోంది. అయితే అన్నా మాత్రం జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంపై వెనక్కి తగ్గేదిలేదని మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాలేగన్సిద్ధి గ్రామంలో బుధవారం ఉదయం మొదటి రోజు మాదిరిగానే ప్రభాత్ భేరీ నిర్వహించారు. నిరాహార దీక్ష సందర్భంగా అక్కడ మద్దతిచ్చేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారందరి కోసం వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మండేలా వ్యాక్స్ విగ్రహ ఆవిష్కరణ... ఇటీవలే మరణించిన నల్ల వజ్రం, దక్షిణాఫ్రికా ప్రథమ నల్లజాతి అధ్యక్షులైన నెల్సన్ మండేలా వ్యాక్స్ విగ్రహాన్ని అన్నా హజారే బుధవారం ఉదయం ఆవిష్కరించారు. పుణే జిల్లా లోనవాలాలోని వ్యాక్స్ మ్యూజియం కోసం ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని అన్నా హజారే చేతులమీదుగా ఆవిష్కరించిన అనంతరం ఆ విగ్రహాన్ని లోనవాలా వ్యాక్స్ మ్యూజియంకు తరలించారు. అన్నా కాల్ సెంటర్ ప్రారంభం... రాలేగన్సిద్ధిలోనే కాకుండా దేశవ్యాప్తంగా తమ తమ గ్రామాలు, తాలూకాలు, జిల్లాల్లోనే కార్యకర్తలు జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఆందోళనలు చేయాలని అన్నా హజారే పిలుపునిచ్చిన విషయం విదితమే. ఇందుకోసం ఓ కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దానికి అన్నా కాల్ సెంటర్‌గా నామకరణం చేశారు. -
ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో..
సాక్షి, ముంబై: జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం నుంచి అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు డిగ్రీల గడ్డకట్టించే చలికి కూడా బెదరకుండా కాసేపు నడిచి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. ‘కరో యా మరో’, ‘ఆర్ యా పార్’ (చావో రేవో) అనే నినాదంతో ఉదయం సుమారు 11 గంటల ప్రాం తంలో దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు ముందు ఆయన గ్రామస్తులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షాస్థలమైన యాదవ్‌బాబా మందిరం వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అన్నా హజారే కొత్తగా స్థాపించిన జనతంత్ర మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష గురించి తెలుసుకున్న అనేక మంది దీక్షకు మద్దతు తెలిపేందుకు రాలెగావ్‌సిద్ధికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో విపరీతంగా రద్దీ కనిపిం చింది. అన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఎవరూ గుమిగూడాల్సిన అవసరంలేదని, ప్రజలు వారి వారి గ్రామాల్లో తాలూకాలు, జిల్లాల్లో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఎవరితోనూ చర్చ లు జరిపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా దీక్ష చేయడం ఇది ఐదోసారి. ‘బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం మాకు చాలా సార్లు హమీ ఇచ్చింది. ఏడాది గడిచినా దానికి మోక్షం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. ఇలా గే కాలయాపన చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ శీతాకాల సమావేశాల్లో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాల్సిందే. బిల్లుకు ఆమోదం లభించేదాకా నా దీక్షను కొనసాగిస్తా’ అని ఆయన సోమవారం విలేకరుల తో మాట్లాడుతూ అన్నారు. ఇక అన్నాకు మద్దతుగా ముంబై, నాగపూర్, పుణేతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీ అవి నీతి కేసులను విచారించడానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు జన్‌లోక్‌పాల్ బిల్లు ఉపయోగపడుతుంది. అన్నా నేతృత్వంలోని పౌరసంఘం సభ్యులు దీనిని తొలిసారిగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన బిల్లులో కొన్ని మార్పులు చేసింది. సీబీఐ, ప్రధానిని లోక్‌పాల్ బిల్లులో చేర్చడానికి తిరస్కరించింది. దీంతో ఈ మాజీ సైనికోద్యోగి ఐదోసారి దీక్షకు దిగారు. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం... అన్నా హజారే దీక్షతో రాలెగావ్‌సిద్ధికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రముఖులు రావడం ప్రారంభమైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఆయన గతంలో ముంబైలో చేపట్టిన దీక్షకు పెద్దగా స్పందన రానప్పటికీ ఈసారి మాత్రం మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు రాలెగావ్‌సిద్ది గ్రామానికి చేరుకొని భద్రత వ్యవస్థను పర్యవేక్షించారు. యాదవ్ బాబా ఆలయం వద్ద రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై అన్నా హజారే దీక్షలో కూర్చుండగా, మరో వేదికపై ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేదికపై అన్నా ఒక్కరే కూర్చున్నారు. వేదిక వెనుక కనిపిస్తున్న బ్యానర్‌పై కేవలం మహాత్మాగాంధీ చిత్రం ఉంది. -
ఈ సమావేశాల్లోనే మూడు కీలక బిల్లులు: షిండే
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. శీతాకాలపు సమావేశాల్లో , తెలంగాణ బిల్లు, జన లోక్ పాల్ బిల్లు, కమ్యూనల్ వాయెలెన్స్ బిల్లులను సభలో ప్రవేశపెడుతామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మూడు బిల్లులపై మాకు స్పష్టత ఉంది. బిల్లులను తీసుకువస్తాం అని మీడియా సమావేశంలో వెల్లడించారు. జన లోక్ పాల్ బిల్లును లోకసభ లోఆమోదించాం. ఆతర్వాత రాజ్యసభకు పంపితే.. వారు సెలక్ట్ కమిటీకి పంపారు. అయితే బిల్లుకు కొన్నిసవరణలను కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆ బిల్లు రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. జన లోక్ పాల్ బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నోటీసు పంపాం అని షిండే తెలిపారు. కమ్యూనల్ వాయెలెన్స్ బిల్లుపై చర్చలు జరిగాయి.. తీర్మానం పెండింగ్ లో ఉంది అన్నారు. -
రాలేగావ్లో అన్నా హజారే ఆమరణ దీక్ష
రాలేగావ్ : జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో మంగళవారం ఉదయం దీక్షకు దిగారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్బిల్లును ఆమోదించాలని హజారే డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లుపై గతంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అన్నా హజారే తెలిపారు. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
నేటి నుంచి హజారే ఆమరణ దీక్ష
సాక్షి, ముంబై: జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం మంగళవారం నుంచి ఆయన మరోసారి ఆమరణ నిరహార దీక్షకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ... అపరిమితమైన అవినీతిని అదుపు చేయలేకపోయిన కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించాయన్నారు. మత హింస నిరోధక బిల్లును ఆమోదింపజేస్తామని ప్రతిన పూనిన ప్రధాని అవినీతి నిరోధక బిల్లు విషయంలో అలా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. బిల్లు ప్రవేశపెడతామని సోనియాగాంధీ ఉత్తరం రాయడంతో విశ్వసించి గతంలో తాను చేపట్టిన ఆమరణ దీక్షను విరమించానని చెప్పారు. కానీ ఏడాదిగా రాజ్యసభలో బిల్లుపై చర్చను చేపట్టకుండా సోనియా, యూపీఏ ప్రభుత్వం తనను, ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. ప్రతిపక్షాలు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. లోక్‌జన్‌పాల్ బిల్లు ఆమోదంకోసం మంగళవారం నుంచి మరోసారి ఆయన రాలేగావ్సిద్దిలోని యాదవ్‌బాబా మందిరంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని చెప్పారు. ముఖ్యంగా జన్లోకపాల్ బిల్లు కోసం ప్రజలు అహింసమార్గంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీపార్టీని అభినందించారు. ఆప్ విజయం దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఏ రాజకీయనేతతోనూ వేదికను పంచుకోనన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని హజారే స్పష్టంచేశారు. -
అందరిదృష్టీ రాలెగావ్పైనే
సాక్షి, ముంబై: అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్ బిల్లు ప్రవేశపెడతామంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తిస్థాయిలో నెరవేరవకపోవడంతో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ది గ్రామం పేరు మారుమోగుతోంది. గతంలో అనేక ఆందోళనలు చేపట్టిన అన్నా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఏకంగా ఐదోసారి ఆందోళనకు దిగుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీలో, ఒకసారి ముంబైలో ఆందోళనలు చేశారు. ఇక ఐదోసారి మాత్రం రాలెగావ్సిద్దిలోనే మంగళవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నారు. లోక్‌పాల్ బిల్లుపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు పెద్ద ఎత్తున స్పందన లభించినప్పటికీ ముంబైలో ఆందోళన ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 76 ఏళ్ల అన్నా హజారే పట్టువదలని విక్రమార్కుడిలా మరో ఆందోళనకు సిద్దమవుతున్నారు. మొదటిసారి 2011 ఏప్రిల్‌లో... లోక్‌పాల్ బిల్లు కోసం మొట్టమొదటిసారిగా అన్నా 2011 ఏప్రిల్‌లో నిరాహార దీక్ష చేశారు. ఈ ఆందోళన ఏప్రిల్ ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ మైదానంలో కొనసాగింది. దీంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు, పౌరసంఘానికి చెందిన ఐదుగురితో ఉమ్మడి ముసాయిదా కమిటీని నియమించడంతో ఆయన తన దీక్ష విరమించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం మాటమార్చడంతో అదే ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి 13 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన 13 రోజుల నిరాహార దీక్ష సందర్భంగా ఆరోగ్యం బాగా క్షీణించినప్పటికీ ఈ సంఘ సేవకుడు వెనుతిరిగి చూడలేదు. ఈ ఆందోళనకు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆ ఏడాది శీతాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వడంతో ఆయన రెండో ఆందోళన ముగిసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ సీబీఐ, ప్రధాని తదితర అనేక కీలకమైన అంశాలను లోక్‌పాల్ పరిధి నుంచి తొలగించారు. దీంతో మూడోసారి అన్నా హజారే ఢిల్లీలో ఆందోళనకు దిగారు. అయితే చలి కారణంగా దీక్షాస్థలిని ముంబైకి మార్చుకున్నారు. తదనంతరం బిల్లు కోసం మరోసారి ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు. ఈ ఆందోళన కూడా గత ఆగస్టులో ముగిసింది. రాలెగావ్‌సిద్ది నుంచి ప్రారంభం.... అన్నా హజారే స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలెగావ్‌సిద్ది గ్రామం నుంచి మొదట తన ఆందోళనలు పారంభించారు. ఈ గ్రామంతోపాటు మహారాష్ట్రలోని వివిధ సమస్యలపై ఆయన ఇప్పటి వరకు 18 సార్లు నిరాహార దీక్షలు చేయగా ప్రతిసారి ప్రభుత్వం ఆయన డిమాండ్లకు తలొగ్గడం విశేషం. ఆయన చేపట్టిన వాటిల్లో 14 నిరాహార దీక్షలు మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినవి కాగా చివరి నాలుగు మాత్రంలోక్పాల్ బిల్లు కోసం ఉద్దేశించినవి. అన్నా తొలిసారి 1980లో దీక్ష చేశారు. ఇప్పటివరకు సుమారు 125 రోజులకుపైగా ఆయన నిరాహార దీక్షల్లో ఉన్నారు. 1996లో చేసిన నిరాహార దీక్ష 12 రోజులుపాటు కొనసాగింది.లోక్‌పాల్ బిల్లు కోసం గత ఆగస్టు 16 నుంచి చేపట్టిన దీక్ష అత్యధికంగా 13 రోజులపాటు కొనసాగింది. ఈ సామాజిక యోధుడి దీక్షల కారణంగా ఇప్పటివరకు 450 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు మంత్రులు తమ పదవులు కోల్పోయారు. -
కేంద్ర ప్రభుత్వం చీటింగ్ చేస్తోంది: హజారే
జన లోక్ పాల్ బిల్లుకు ప్రార్లమెంట్ లో ఆమోదిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం చీటింగ్ పాల్పడుతోంది అని సామాజిక కార్యకర్త అన్నా హాజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేలా జన్ లోక్ పాల్ పౌర సమాజ కార్యకర్తలు డ్రాఫ్ చేశారు. జన్ లోక్ పాల్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నుంచి తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో నిరవధిక నిరాహార దీక్షను చేపడుతున్నట్టు హజారే ప్రకటించారు. రెండు సంవత్సరాల క్రితం జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం కొరకు రెండేళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. దీక్ష ఆపండి. లోక్ పాల్ బిల్లును తీసుకువస్తాం అని ప్రభుత్వం సమాచారం అందించింది. జన లోక్ పాల్ బిల్లును తీసుకు రావడానికి యూపీఏ ప్రభుత్వం సిద్దంగా ఉన్నాం అని సోనియా లేఖ తెలిపారు అని హజారే తెలిపారు. సోనియా ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అయితే ప్రభుత్వం ఇలా చీటింగ్ కు పాల్పడుతుందని అనుకోలేదు అని అన్నారు. నేను నా కుటుంబం కోసం ఉద్యమించడం లేదు. ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశాను. సామాన్య ప్రజలు జీవించడానికి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నాను అని హజారే అన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్: వచ్చాడు.. ఊడ్చేశాడు
పిల్లకాకి అంటూ కాకలుతీరిన నేతలంతా వెక్కిరించారు. ఉద్యమాలంటే ఏమో గానీ ఎన్నికల్లో ఏం నెట్టుకొస్తాడు లెమ్మని విశ్లేషకులు కూడా పెదవి విరిచారు. కానీ సామాజిక ఉద్యమ నేత అరవింద్ కేజ్రీవాల్ (45) అందరి అంచనాలనూ తారుమారు చేశారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని హస్తిన రాజకీయ యవనిక నుంచి అక్షరాలా ‘ఊడ్చిపారేశారు’. 1968 ఆగస్టు 16న హర్యానాలోని హిస్సార్‌లో జన్మించిన కేజ్రీవాల్ ఐటీ ఖరగ్‌పూర్ నుంచి పట్టభద్రుడయ్యారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదులుకుని సామాజికోద్యమ నేతగా మారారు. సమాచార హక్కు చట్టం అమలు కోసం పాటుపడ్డారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం 2011లో అన్నాహజారేతో కలిసి చరిత్రాత్మక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అనంతర పరిణామాల్లో అన్నాకు కాస్త దూరమయ్యారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అవినీతి అంతం, పారదర్శకత, అభివృద్ధే ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో తొలి రోజు నుంచే కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించారు. ఢిల్లీలోనే గాక పరిసర రాష్ట్రాల్లో కూడా యువత కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచింది. కేజ్రివాల్ భార్య సునీత ఐఆర్ఎస్లో ఆయనకు బ్యాచ్‌మేట్. -
10 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష
రాలేగావ్ సిద్ధి వేదికగా లోక్‌పాల్ కోసం పోరు న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ కోసం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధి వేదికగా మరోసారి ఉద్యమించేం దుకు అన్నా హజారే సమాయత్తమయ్యారు. ఈ నెల 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈసారి కూడా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచే దీక్ష చేపడతానని ప్రజలకు మాటిచ్చినట్టు చెప్పారు. అయితే, ఇటీవల తనకు జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అలాగే తొలుత ప్రకటించిన దీక్షా వేదిక ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌కు బదులు సొంతూరు రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు. -
10 నుంచి హజారే నిరవధిక దీక్ష
రాలేగావ్‌సిద్ధి (మహారాష్ట్ర): ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. పటిష్ట లోక్‌పాల్ బిల్లు కోసం డిసెంబర్ 10 నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని యాదవ్‌బాబా ఆలయం వేదికగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. గురువారం అన్నా హజారే రాలేగావ్‌సిద్ధిలో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పటిష్ట లోక్‌పాల్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెగువ చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హజారే లేఖ రాశారు. అవినీతికి అడ్డుకట్టవేసే వ్యవస్థను తేవడంలో కేంద్రం విఫలం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
15 రోజుల్లో జన్‌లోక్‌పాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తర ఘట్టానికి చేరాయి. నాలుగోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కొత్తగా ఎన్నికల బరిలో దిగిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు బుధవారం తమ ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేశాయి. జనాకర్షక పథకాలు, హామీలతో ఆప్ ఆకట్టుకోగా, కాంగ్రెస్ మాత్రం పాత పథకాలు, హామీలతోనే సరిపెట్టింది. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతామని, పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఆప్ పేర్కొంది. ఆప్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేజ్రీవాల్, ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం షీలా దీక్షిత్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, కృష్ణతీరథ్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ జేపీ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ‘ఆప్’ ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఢిల్లీ అసెంబ్లీలో ‘ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు’ ప్రవేశపెడతాం. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులందరికీ వర్తిస్తుంది. అధికార వికేంద్రీకరణ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక సభ(మొహల్లా సభ) ఏర్పాటు. రోడ్లు, పేవ్మెంట్ల నిర్మాణం వంటి వాటిపై ఈ సభలే నిర్ణయాలు తీసుకుంటాయి. పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పన. ఢిల్లీ అభివృద్ధి సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలో ఉంచడం. విద్యుత్ చార్జీలు సగానికి తగ్గింపు, ప్రతి ఇంటికి 700 లీటర్ల ఉచిత నీరు, నీటి మాఫియాపై చర్యలు. మహిళల భద్రత కోసం ప్రతి వార్డులో పౌర భద్రతా దళం ఏర్పాటు. మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. డెంగ్యూ నియంత్రణకు టాస్క్ ఫోర్స్. ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు చట్టం. ప్రస్తుత పథకాల కొనసాగింపు: కాంగ్రెస్ ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు. వీటికి బడ్జెట్లో 75 శాతం నిధులు. మహిళల భద్రతలో కీలకమైన శాంతిభద్రతలను రాష్ట్ర పరిధిలోకి తెచ్చేలా ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం కృషి. ఉపాధి కోసం ఢిల్లీకి వలసవచ్చే వారికి అవసరమైన సదుపాయాల కల్పన. డబుల్‌డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం. -
‘ఆమ్ ఆద్మీ’కే అండ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) సామాన్యుడి గోడును తమ మేనిఫెస్టోలో ప్రతిబిం బించేలా రూపొందించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమ్ ఆద్మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని ప్రకటించింది. నగరంలో ఏఏపీ నాయకుడు యోగేంద్ర యాదవ్ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే జనవరి 29న జన్‌లోక్ బిల్లును ఆమోదిస్తామని, విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామని, అధికారాన్ని వికేంద్రీకరిస్తూ ప్రతి నియోజకవర్గానికి మొహల్లా సభలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. విద్యావైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని, ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం విధిస్తామని, స్వచ్చమైన నీటిని ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని, వృద్ధులు, మహిళలకు భద్రత కల్పిస్తామన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి ప్రయత్నిస్తామని, 1984 సిక్కు అల్లర్ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, ముస్లింలపై బూటకపు కేసులు లేకుండా చూస్తామని, షెడ్యూల్ కులాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని వాగ్దానాలు చేశారు. తాము ఢిల్లీ ముఖ్యమంత్రినే కాదని, ఇక్కడున్న అవినీతి వ్యవస్థను కూడా మారుస్తామని ఆయన తెలిపారు. మొహల్లాసభలు ఏర్పాటుచేయడం ద్వారా తమ పార్టీ విప్లవాత్మక ప్రయోగం చేయనుందని యోగేంద్ర చెప్పారు. ‘ఆప్’ మేనిఫెస్టో ముఖ్యాంశాలు: ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు: అధికారంలోకి వచ్చిన 15 రోజులలో జన్‌లోక్ బిల్లుకు చట్టరూపం కల్పిస్తాం. దీని కిందకు ప్రభుత్వోద్యోగులందరూ వస్తారు. అవినీతి కేసుల దర్యాప్తునకు నిర్ణీత కాలపరిమితిని విధించి పరిష్కరిస్తాం. మంత్రులు, శాసనసభ్యులు, కార్యదర్శులపై అవినీతి కేసులను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా విచారిస్తాం. లోక్‌పాల్‌కు ఆర్థిక, పాలన, దర్యాప్తు పరమైన స్వేచ్ఛ ఉంటుంది. అవినీతి ప్రభుత్వోద్యోగులపై దర్యాప్తు ప్రారంభించి ప్రాసిక్యూట్ చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. అవినీతిపరులని తేలిన అధికారులను ఉద్యోగం నుంచి తొలగించి జైలుకు పంపించడంతో పాటు వారి ఆస్తిని స్వాధీనం చేసుకునేలా నిర్ణయాలు ఉంటాయి. మొహల్లా సభలు: గాంధీజీ చెప్పిన స్వరాజ్ తరహాలో ప్రజలకు అధికారాన్ని బదిలీ చేస్తూ ప్రతి మొహల్లాకు ఒక సభ ఏర్పాటుచేస్తారు. తమ ప్రదేశంలో చేపట్టే రోడ్లు, కాలిబాటల నిర్మాణం, మరమ్మతు పనుల నిర్ణయాలను ఈ సభలు తీసుకుంటాయి. మొహల్లా సభ సంతృప్తి చెందిన మీదటే అభివృద్ధి పనులకు బిల్లులను చెల్లిస్తారు. స్థానిక పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య సేవాకేంద్రాల పనితీరును ఈ సభలే పర్యవేక్షిస్తాయి. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా: ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తాం. ఎన్డీఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు మినహా డీడీఏ, ఢిల్లీ పోలీసులు, ఎమ్సీడీలను రాష్ట్రప్రభుత్వం పరిధిలోనే ఉంచాలని డిమాండ్ చేసింది. విద్యుత్ బిల్లులు: అధికారంలోకి వచ్చిన వెంట నే విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తాం. అన్ని డిస్కంల ఆడిట్‌కు ఆదేశిస్తాం. ఆడిట్‌కు అంగీకరించని కంపెనీల లెసైన్స్ రద్దుచేస్తాం. డిస్కంల ఆడిట్‌ను ఆర్టీఐ కిందకు తెచ్చి వాటి ఖాతాలు మరింత పారదర్శకంగా మారుస్తాం. సౌర విద్యుత్తు వాడకాన్ని ప్రోత్సహిస్తాం. ప్రతి ఇంటికి నీటి సరఫరా: నగరంలోని మురికివాడలు, అనధికార కాలనీలలోని ఇళ్లతో సహా అన్ని ఇళ్లకు నీటి సరఫరా సదుపాయం కల్పిస్తాం. ప్రతి ఇంటికి 700 లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తాం. ఢిల్లీ జల్ బోర్డు పనితీరును పారదర్శకంగా చేస్తాం. నగరవాసులకు భద్రత: ప్రతి వార్డుకు ఒక సిటిజన్స్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి ఆపదలోనున్న ప్రతి ఒక్కరికీ భద్రతను కల్పించడంతో పాటు ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్దులపై ప్రత్యేక దృష్టిసారిస్తాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, వర్మ కమిటీ సిఫారసుల అమలుకు చర్యలు తీసుకుంటాం. మెరుగైన విద్యా వైద్య సదుపాయాలు: నగరంలో మరిన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, డెంగీ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన పనిచేసే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు. ఢిల్లీ విద్యార్థుల కోసం కొత్త కాలేజీల ఏర్పాటు, ప్రైవే టు స్కూళ్లు, కాలేజీలలో అధిక ఫీజులు, డొనేషన్ల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తాం. -
వివాదాల్లో ‘ఆప్’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వివాదాల్లో చిక్కుకుంది. పార్టీ ఏర్పాటు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పారదర్శకంగానే ఉన్నామన్న ‘ఆప్’కు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే ‘ఝలక్’ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జన్‌లోక్‌పాల్ ఉద్యమం కోసం వసూలు చేసిన నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై కేజ్రీవాల్‌కు హజారే లేఖ రాయగా, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలంటూ సోమవారం కేజ్రీవాల్ ఆయనకు బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హజారే మంగళవారం రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో మాట్లాడుతూ, నిధుల విషయం సమస్యే కాదని, తన పేరు దుర్వినియోగం చేసుకుంటున్నారనే అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలో సేకరించిన నిధులను దేనికోసం ఉపయోగిస్తున్నారో తనకు తెలియదన్నారు. కేజ్రీవాల్.. హజారే అనుమానాలను నివృత్తి చేసే యత్నాల్లో పడ్డారు. నిధులపై పలుసార్లు హజారేతో చర్చించానని, ఆడిటింగ్ కూడా చేయించారని, అయినా, నిధుల వాడకంపై సందేహాలు ఎందుకని ప్రశ్నించారు. -
టికెటిస్తాం.. హుడాపై పోటీ చేయండి
న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బాసటగా నిలిచింది. ఆయన అద్భుతమైన తెగువ చూపారని ప్రశంసించింది. ‘‘ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులకు ఎంతకాలమని సేవ చేస్తారు? పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి. మా పార్టీ తరఫున హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడాపై పోటీ చేయండి’’ అని ఖేమ్కాకు విజ్ఞప్తి చేసింది.