నా ప్రభుత్వాన్ని నేనెందుకు పడగొట్టుకుంటా?
తన ప్రభుత్వాన్ని తాను పడగొట్టుకోవాలనుకోవట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జనలోక్పాల్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ - ఆప్ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన స్పందించారు. జన లోక్పాల్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందని పక్షంలో తాను రాజీనామా చేస్తానంటూ ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా ఆ బిల్లుకు ముందుగానే కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోడానికి ఆయన నిరాకరించారు.
లోక్సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే మైలేజి పెరుగుతుందనే కేజ్రీవాల్ ఇలా చేస్తున్నారన్న మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఆ భావన తప్పని, తనకు తానుగా ప్రభుత్వాన్ని పడగొట్టుకోవాలని ఏమాత్రం అనుకోవట్లేదని చెప్పారు. తనపని తాను చేస్తున్నానని, పగలు.. రాత్రి చాలా కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. అయితే అదే సమయంలో, ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందనే బాధ మాత్రం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రేపు పడిపోతుందనుకుంటే, ఈవాళే పడిపోయినా నష్టం లేదన్నారు. ఏక్షణమైన కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోవచ్చన్న విషయాన్ని ప్రస్తావించగా ఈ వ్యాఖ్య చేశారు. అది వాళ్ల ఇష్టమని, తమకు మద్దతు ఇవ్వడం వాళ్లకు అంత కష్టంగా ఉంటే ఇవ్వనక్కర్లేదని కేజ్రీవాల్ చెప్పారు.