ఎందాకైనా వెళ్తా..!
జన్‌లోక్‌పాల్ చట్టంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
రాజీనామాకూ వెనుకాడబోనని పరోక్ష వ్యాఖ్య
అవినీతి బయటపడుతుందనే కాంగ్రెస్, బీజేపీలు
భయపడుతున్నాయి
న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ చట్టం తీసుకువచ్చేందుకు ఎందాకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. రాజీనామాకు సైతం వెనుకాడబోనని పరోక్షంగా తేల్చిచెప్పారు. అవినీతి నిర్మూలన తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, ఈ చట్టం వస్తే ఇబ్బందులు తప్పవన్న భయంతోనే కాంగ్రెస్, బీజేపీ మద్దతు పలకడం లేదని మండిపడ్డారు. శనివారం ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చట్టం కోసం ఎందాకైనా వెళ్లడం అంటే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా.. ‘‘అవినీతి అనేది పెద్ద అంశం. మీరు అనుకున్నది కూడా జరగొచ్చు..’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కామన్వెల్త్ అవినీతిని బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ భయపడుతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏడేళ్లపాటు పాలించిన బీజపీ కూడా వణుకుతోంది. అందుకే వారు కచ్చితంగా అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటారు’’ అని అన్నారు. గత వారం ఢిల్లీ కేబినెట్ జనలోక్‌పాల్ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇది చట్టరూపం దాలిస్తే ముఖ్యమంత్రి నుంచి గ్రూప్-డి ఉద్యోగులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే ఈ చట్టం కింద గరిష్టంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ఈ బిల్లును తెస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం తెలిసిందే. కేజ్రీవాల్ చెప్పిన ముఖ్యాంశాలు..
ఢిల్లీ అసెంబ్లీలో ఏదైనా చట్టం చేయాలనుకుంటే ముందుగా తమ ఆమోదం పొందాలంటూ 2002లో హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరాం. ఈ మేరకు లేఖ కూడా రాశాం.
జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదం కోసం హోంశాఖకు పంపబోం.
ఢిల్లీ అసెంబ్లీకి మూడు అంశాలు మినహా వేటిపైనా చట్టం చేసుకునే అధికారాన్ని రాజ్యాంగమే కట్టబెట్టింది. చట్టం చేయాలా వద్దా అన్నది చెప్పాల్సింది రాజ్యాంగం. అంతే తప్ప మరెవ్వరికీ ఆ అధికారం లేదు.