జన్‌లోక్‌పాల్‌కు ‘ఢిల్లీ’ ఓకే | AAP sarkar okay for jan lokpal bill | Sakshi
Sakshi News home page

జన్‌లోక్‌పాల్‌కు ‘ఢిల్లీ’ ఓకే

Published Tue, Feb 4 2014 12:20 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

జన్‌లోక్‌పాల్‌కు ‘ఢిల్లీ’ ఓకే - Sakshi

జన్‌లోక్‌పాల్‌కు ‘ఢిల్లీ’ ఓకే

బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం
సొంతంగా బిల్లును రూపొందించిన కేజ్రీ సర్కారు
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బిల్లుకు ఆమోదం
బిల్లును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
అనుమతికి పంపించబోమని వెల్లడి
జన్‌లోక్‌పాల్ పరిధిలోకి ముఖ్యమంత్రి
 
 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. తమ మరో ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా ముందడుగు వేసింది. అవినీతి వ్యతిరేక జన్‌లోక్‌పాల్ బిల్లుకు సోమవారం కేజ్రీవాల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించి బిల్లును ఆమోదిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. బిల్లు ఆమోదం పొందే చివరి రోజు సమావేశాన్ని  స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తామని పేర్కొంది. కేంద్రప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఈ బిల్లును పంపించడం లేదని కేజ్రీవాల్ మంత్రివర్గ సహచరుడు మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లునైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు కేంద్ర హోం శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఢిల్లీ పోలీస్, డీడీఏ, ఎన్‌డీఎంసీలు ఈ జన్‌లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయా అన్న ప్రశ్నకు సిసోడియా సమాధానం ఇవ్వలేదు. అయితే, అవి ఢిల్లీ ప్రభుత్వంలోని అవినీతి వ్యతిరేక విభాగం కిందకే వస్తాయి కాబట్టి.. లోక్‌పాల్‌లో ఏసీబీ విలీనం కాగానే సహజంగానే జన్‌లోక్‌పాల్ పరిధిలోకి కూడా వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ ఈ మూడు విభాగాలు నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకే జవాబుదారీగా ఉంటాయి కనుక ఈ ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించే అవకాశాలున్నాయి.
 
 ఢిల్లీ ప్రభుత్వ జన్‌లోక్‌పాల్‌లోని ముఖ్యాంశాలు..
 
 ముఖ్యమంత్రి నుంచి గ్రూప్ డీ ఉద్యోగస్తుడి వరకు అందరూ దీని పరిధిలోకి వస్తారు. సీఎంకు, మంత్రులకు  ప్రత్యేక రక్షణలు లేవు.
 
 నిజాయితీపరులైన అధికారులకు, అవినీతిని వెలుగులోకి తెచ్చినవారికి రక్షణ. నిజాయితీపరులైన అధికారులకు ఏటా అవార్డులు.
 
 కాల పరిమితితో కూడిన విచారణ
 జనలోక్‌పాల్‌లో రెండు విభాగాలుంటాయి. ఒకటి దర్యాప్తు విభాగం, మరొకటి నేర విచారణ విభాగం.
 సొంతంగా కానీ, ఏదైనా ఫిర్యాదుపైన కానీ లోక్‌పాల్ విచారణ ప్రారంభించవచ్చు. నేరం రుజువైతే ఆర్నెల్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అరుదైన, తీవ్రమైన అవినీతి కేసుల్లో జీవితఖైదు విధించవచ్చు.
 అవినీతిలో లబ్ధి పొందింది వ్యాపార లేక వాణిజ్య సంస్థ అయితే, శిక్షతో పాటు ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టానికి 5 రెట్లు జరిమానా.
 
 లోక్‌పాల్ చైర్‌పర్సన్‌ను, 10 మంది సభ్యులను ఏడేళ్ల పదవీకాలంతో ఏడుగురు సభ్యుల కమిటీ నియమిస్తుంది. ఆ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి ఉంటారు. ప్రతిపక్ష నేత, మాజీ లోకాయుక్త, కనీసం ముగ్గురు న్యాయ వ్యవహారాల నిపుణులు, ఇద్దరు ప్రఖ్యాత పౌరులు ఉంటారు.
 పార్లమెంట్ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లులోని ప్రధానాంశాలు..
 
 కొన్ని ప్రత్యేక మినహాయింపులతో ప్రధానమంత్రి లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. ప్రధానిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. విచారణ రహస్యంగా జరుగుతుంది.స
 
 లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్, గరిష్టంగా 8 మంది సభ్యులుంటారు. సభ్యుల్లో సగం మంది న్యాయ వ్యవహారాల నిపుణులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉంటుంది.
 
 చైర్‌పర్సన్‌ను, సభ్యులను నియమించే ఐదుగురు సభ్యుల కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, ఒక ప్రఖ్యాత న్యాయ నిపుణుడు ఉంటారు.
 దర్యాప్తు 60 రోజుల్లో, విచారణ ఆరు నెలల్లో ముగించాలి.
 
 అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులకు ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, అవినీతికి అలవాటు పడిన అధికారులకు పదేళ్ల వరకూ కారాగారవాసం.
 
 విదేశాల నుంచి నిధులు వచ్చే, ప్రజాధనం సేకరించే మత సంస్థలు, సొసైటీలు, ఇతర సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి.
 
 చార్జిషీట్ నమోదుపై నిర్ణయం తీసుకునేముందు సొంత విచారణ విభాగం ద్వారా కానీ, దర్యాప్తు సంస్థ ద్వారా కానీ లోక్‌పాల్ విచారణకు ఆదేశించవచ్చు.
 
 నిర్ణయం తీసుకునేముందు లోక్‌పాల్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాధికారి వాదన వినాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement