అరవింద్ కేజ్రీవాల్: వచ్చాడు.. ఊడ్చేశాడు
పిల్లకాకి అంటూ కాకలుతీరిన నేతలంతా వెక్కిరించారు. ఉద్యమాలంటే ఏమో గానీ ఎన్నికల్లో ఏం నెట్టుకొస్తాడు లెమ్మని విశ్లేషకులు కూడా పెదవి విరిచారు. కానీ సామాజిక ఉద్యమ నేత అరవింద్ కేజ్రీవాల్ (45) అందరి అంచనాలనూ తారుమారు చేశారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని హస్తిన రాజకీయ యవనిక నుంచి అక్షరాలా ‘ఊడ్చిపారేశారు’. 1968 ఆగస్టు 16న హర్యానాలోని హిస్సార్‌లో జన్మించిన కేజ్రీవాల్ ఐటీ ఖరగ్‌పూర్ నుంచి పట్టభద్రుడయ్యారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదులుకుని సామాజికోద్యమ నేతగా మారారు. సమాచార హక్కు చట్టం అమలు కోసం పాటుపడ్డారు.
జన్ లోక్‌పాల్ బిల్లు కోసం 2011లో అన్నాహజారేతో కలిసి చరిత్రాత్మక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అనంతర పరిణామాల్లో అన్నాకు కాస్త దూరమయ్యారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అవినీతి అంతం, పారదర్శకత, అభివృద్ధే ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో తొలి రోజు నుంచే కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించారు. ఢిల్లీలోనే గాక పరిసర రాష్ట్రాల్లో కూడా యువత కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచింది. కేజ్రివాల్ భార్య సునీత ఐఆర్‌ఎస్‌లో ఆయనకు బ్యాచ్‌మేట్.