ఢిల్లీ జన్‌లోక్‌పాల్..రాజ్యాంగ విరుద్ధం
Published Fri, Feb 7 2014 12:00 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
పార్టీ ఏర్పాటు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు దూకుడుగా వ్యవహరించి, అన్నింటా సఫలీకృతమైన కేజ్రీవాల్‌కు ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లును అమల్లోకి తేవడంలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓైవె పు ప్రభుత్వానికి మద్దతిస్తూనే బిల్లు విషయంలో కాంగ్రెస్ మోకాలడ్డుతుండగా, రాజ్యాంగపరమైన సమస్యలు కూడా కేజ్రీవాల్ సర్కారును ఇరకాటంలో పడేస్తున్నాయి.
న్యూఢిల్లీ:ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడంలేదు. కేంద్ర అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ గురువారం నివేదించారు. దీంతో ఈ బిల్లు కథ మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.. ఢిల్లీకి ప్రత్యేక జన్‌లోక్‌పాల్ బిల్లు తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే బిల్లును అమలులోకి తీసుకువస్తామని అప్పట్లో ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ మొదటినుంచి మడతపేచీ పెడుతోంది.
లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోనిదే బిల్లును కేబినెట్‌లో ప్రవేశపెట్టరాదని కాంగ్రెస్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెడితే తాము వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ముందే హెచ్చరించింది. కాగా, వచ్చే వారం బహిరంగ స్థలంలో జన్‌లోక్‌పాల్‌ను ప్రవేశపెడతామని ఆప్ భీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. కాగా, కేంద్ర అనుమతి లేకుండానే బిల్లును ప్రవేశపెడతామన్న ఆప్ సర్కార్ ప్రతిపాదనలోని రాజ్యాంగబద్ధతపై ఎస్‌జీని సంప్రదించారు. కాగా, కేంద్ర అనుమతి లేకుండా ఆప్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమేనని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. గత ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలను ఆమోదించిందని, అవి ప్రస్తుతం అమలులో ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ జన్‌లోక్‌పాల్ చట్టం చేయడానికి యత్నిస్తే అది కేంద్ర చట్టాన్ని పరిహసించినట్లేనని వివరించారు. కాబట్టి దీనికి రాష్ట్రపతి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనను ఆదిలోనే వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వ యోచన రాజ్యాంగ వ్యతిరేకమైనదని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేసినందున ఆప్ సర్కార్‌ను బిల్లుపై ముందుకు పోకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
‘ఈ బిల్లు వ్యవహారంలో మేం తుదికంటా పోరాడతాం. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అంగీకరించం..’ అని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ అన్నారు. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని ఆప్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెరవబోమని, మద్దతు ఇవ్వాలా వద్దా అనేది ఆయా పార్టీల ఇష్టమని ఆప్ నాయకులు అంటున్నారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఎవరికీ భయపడబోమని వారు ఢంకా బజాయిస్తున్నారు. కాగా,ఈ నెల 13వ తేదీన బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికి ముందు స్పోర్ట్స్ స్టేడియంలో రెండు రోజుల పాటు బిల్లుపై చర్చ జరిపాలని యోచిస్తోంది.
కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ఎల్జీకి సొలిసిటర్ జనరల్ నివేదికపై కేంద్ర మంత్రి మనీష్ తివారి స్పందిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనన్నారు. ఆప్ సర్కార్ రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటైంది కాబట్టి అది రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోవడం అనుచితమవుతుందన్నారు. రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాతే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సూచించారు.
Advertisement
Advertisement