‘సామాన్యుడి’కి సవాళ్లెన్నో!
‘సామాన్యుడి’కి సవాళ్లెన్నో!
Published Tue, Dec 24 2013 1:32 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
దేశరాజధానిలో ‘సామాన్యుడి’ సర్కారు కొలువుదీరడానికి రంగం సిద్ధమయింది. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికీ నిత్యం 700 లీటర్ల నీరు ఉచితంగా ఇవ్వడం, విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించడం వంటివి ఆప్‌కు కష్టసాధ్యంగా పరిణమించవచ్చు. తమ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతుందన్న నమ్మకం పార్టీలోనే లేదని ఆప్ నేతలు చెబుతుండడం కొసమెరుపు.
సాక్షి, న్యూఢిల్లీ:ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్)కి పథకాల అమలులో చిక్కుముళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరెంటు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని సంబంధిత రంగాల నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కూడా కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండకపోవచ్చు. పోలీసుశాఖను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తేవడానికి షీలా దీక్షిత్ కూడా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆప్ ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచిచూడాలి. ఆప్ పథకాలు ఆచరణ సాధ్యం కావని కాంగ్రెస్, బీజేపీ స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కోవాల్సిన సమస్యలకు కొదవేమీ లేదు.
తాము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో జన్‌లోక్ పాల్ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా, అవినీతి అధికారుల తొలగింపు, ఆస్తుల స్వాధీనం వంటి హామీలు ఇచ్చారు. కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, ప్రతి ఇంటికీ 700 లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయడం వంటి ముఖ్యమైన హామీలను వీలైనంత త్వరలో అమలు పరచాలని ప్రజలు కోరుతున్నారు. కేజ్రీవాల్ సత్తా నిరూపించుకోవాలంటే ఈ రెండు హామీలను విజయవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. మరో రెండునెలల్ల్లో లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ఈ హామీల అమలును ప్రకటించడం సాధ్యం కాదని చెబుతున్నారు. అందువల్ల కేజ్రీవాల్ రెండు నెలల లోపల ఈ హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ వాగ్దానాలను అమలు చేసినప్పుడే ఆప్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు నిస్సంకోచంగా వెళ్లగలుగుతుందని విపక్ష నాయకులు అంటున్నారు.
ఎన్నాళ్లు ఉంటుందో ?
ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న సందే హాలు సద్దుమణగడం లేదు. ఆప్ ప్రభుత్వం మనుగడపై ఆ పార్టీ నేతలే మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది, ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ ఆప్ ప్రభుత్వం చానాళ్లు కొనసాగలేదన్న సందేహాన్ని సోమవారం కూడా వ్యక్తం చేశారు. ఆప్ తన మేనిఫెస్టో అమలు చేస్తుందని, అయితే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఆప్ ప్రభుత్వాన్ని కూల్చవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తుమ్మితే ఊడిపోయేలా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధపడిన అరవింద్ కేజ్రీవాల్ దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవలసి ఉంది.
మంత్రివర్గంలో ఎవరెవరికి చాన్స్ ?
ప్రభుత్వం ఏర్పాటు తథ్యం కావడంతో కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రి మండలిలో ఆరుగురికి చోటు లభించే అవకాశముంది. అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పించడంలో భాగంగా ఒక మహిళ, ఒక సిక్కు, ఒక ముస్లింకు ప్రాతినిథ్యం కల్పించడం అనవాయితీ. ఆప్ తరపున ఎన్నికైన 28 ఎమ్మెల్యేల్లో పత్పర్‌గంజ్ నుంచి గెలిచిన మనీష్ సిసోడియాకు మంత్రి పదవి లభించడ ం ఖాయమని అంటున్నారు. మాలవీయనగర్‌లో మంత్రి కిరణ్ వాలియాను ఓడించిన సోమ్‌నాథ్ భారతి, లక్ష్మీనగర్‌లో మంత్రి వాలియాను ఓడించిన వినోద్ కుమార్ బిన్నీకి పదవి దక్కవచ్చని అంటున్నారు.
గ్రేటర్ కైలాష్‌లో విజయ్ కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రాను ఓడించిన సౌరభ్ భరద్వాజ్‌కు కూడా అవకాశం దక్కవచ్చు. ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు భారతి లేదా రాఖీ బిర్లా లేదా వందనా కుమారిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిక్కులకు ప్రతినిధిగా తిలక్‌నగర్ నుంచి గెలిచిన జర్నైల్ సింగ్ పేరును కూడా పరిశీలించవచ్చని అంటున్నారు. భారతి వృత్తిరీత్యా వకీలు కాగా సౌరభ్ భరద్వాజ్ ఐటీ నిపుణుడు. జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆప్ కార్యకర్తగా మారారు. హత్య కేసులో చిక్కుకున్న ఆప్ కార్యకర్త కేసును వాదించిన భారతి ఆప్‌లో సభ్యురాలయ్యారు. రాఖీ బిర్లా విలేకరిగా పనిచేసేవారు. ఆమె మంగోల్‌పురిలో మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించారు. వందనా కుమారి బీజేపీ దిగ్గజం రవీంద్ర బన్సల్‌పై షాలిమార్‌బాగ్‌లో విజయం సాధించారు.
ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు:
ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను ఆప్ నేత మనీ ష్ సిసోడియా వెల్లడించారు. ఎస్‌ఎంఎస్‌లు, ఇంట ర్నెట్ ద్వారా 6,97,370 మంది అభిప్రాయాలు తెలి యజేశారన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మొత్తం 5,23,183 సందేశాలు అందాయని, వాటిలో 2,65,000 సందేశాలు ఢిల్లీనుంచి వచ్చాయని తెలి పారు. ఇంటర్నెట్ ద్వారా అందిన సలహాల్లో 74 శాతం మంది ప్రభుత్వ ఏర్పాటును కోరారని మనీష్ వెల్లడించారు. ఇవిగాక ఆప్ ఢిల్లీలో 280 జనసభలు నిర్వహించిందని, అందులో 257సభల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూల అభిప్రాయం వచ్చిందని, 23 వ్యతిరేకించాయని సిసోడియా చెప్పారు.
Advertisement
Advertisement