ఆమోదం పొందకపోతే తప్పుకుంటా
న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి కుండబద్దలు కొట్టారు. శాసనసభ సమావే శం తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ జన్‌లోక్‌పాల్ బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తాం. ఒకవేళ దానిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వీగిపోయేవిధంగా చేస్తే ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా’ అని అన్నారు. తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలా కలిసికట్టుగా వ్యవహరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారని అన్నారు. ఈ రెండు పార్టీలు అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తాము కోరుకున్నది కూడా ఇదేనని, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ఈవిధంగా వ్యవహరించడానికి కారణం ఓ భారీ వ్యాపార సంస్థపై తాము చర్యలకు ఉపక్రమించడమే ఇందుకు కారణమన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు త మ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయన్నారు. సభా కార్యకలాపాలు జరగబోవని, ఇందుకు కారణం ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకోవడమేనన్నారు. కాగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఒకటి లేదా రెండు రోజుల్లో...
జన్‌లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లుల ఆమోదంకోసం ఆప్ సర్కారు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసినప్పటికీ తొలిరోజు వాటిని సభలో ప్రవేశపెట్టలేదు. స్వరాజ్ బిల్లును మంత్రిమండలి ఉదయం ఆమోదించింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టొచ్చని అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించినప్పటికీ తరువాత ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతులు ఎమ్మెల్యేలకు అందలేదని, సభ్యులు చదవడం కోసం వాటిని అందజేశాకే సభలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు స్పీకర్ ఎం.ఎస్. ధీర్ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) అనుమతి లేకుండా స్పీకర్ బిల్లును సభలో ప్రవేశపెట్టనివ్వకూడదన్న అభ్యంతరాలపై స్పందిస్తూ ప్రభుత్వం దానిని సభలో ప్రవేశపెట్టొచ్చని, అయితే ఎల్‌జీ అనుమతి లేకుండా దాని పై చర్చ జరిపించే అధికారం స్పీకర్‌కు లేదన్నారు.
ఇదిలాఉండగా బిల్లును విధానసభలో ఆమోదించడానికి ముందు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ న్యాయమంత్రిత్వశాఖ ఎల్‌జీకి సూచించింది. ఈ నేపథ్యంలో జన్‌లోక్ పాల్ బిల్లును సభలో ప్రవే శపెట్టలేకపోయినట్లయితే కేజ్రీవాల్ రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందించి, దానిని సభలో ప్రవేశపెట్టాలా? వద్దా ? అనే అంశంపై అసెంబ్లీలోనే సభ్యుల అభిప్రాయాన్ని కోరవచ్చని అంటున్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడానికి మెజారిటీ సభ్యులు నిరాకరించినట్లయితే కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశముందని వారంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం సభలో ప్రవేశపెట్టవచ్చని మరికొందరు అంటున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాన్ని విధానసభలో కాక మరోచోట జరపకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారును నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేదార్‌కుమార్ మండల్ దానిని ఉపసంహరించుకున్నారు.
దీనిపై నిర్ణయం స్పీకర్ ఇంకా ఓ నిర్ణయంతీసుకోనందువల్ల ఇప్పుడే ఇలాంటి పిటిషన్ దాఖలు చేయనవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తొందరపాటుగా అభివర్ణించింది. అవసర మని భావిస్తే తరువాత దాఖలు చేయొచ్చని న్యాయమూర్తులు బి. డి. అహ్మద్, సిద్దార్థ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఇదిలాఉంచితే పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వడాన్ని ప్రభుత్వ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యతిరేకించారు. ఇది మంత్రి మండలి, లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించాల్సిన అంశమని, ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని ఆయన వాదించారు. అసెంబ్లీ భవనం వెలుపల విధానసభ సమావేశాన్ని నిర్వహించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారీఎత్తున డబ్బు ఖర ్చవుతుందనే విషయాన్నికూడా ప్రశాంత్ భూషణ్ ఖండించారు.
ఎటూ తేల్చుకోలేకపోతోంది: లవ్లీ
సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్ బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలో సందిగ్ధావస్థపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక అయోమయ పరిస్థితిని సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లును సరైన పద్ధతిలో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తాము చెప్పామని, ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. అయితే ప్రభుత్వ వైఖరే స్పష్టంగా లేదన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తొలుత తమకు సర్క్యులర్‌ను జారీచేసిందని, అయితే దానిని ఉపసంహరించుకుందనే విషయం గురువారం సభలోకి వచ్చినతర్వాత తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి పాఠశాల పిల్లాడి చేష్టల్లా ఉన్నాయని ఆయన విమర్శించారు.