
హజారే దీక్షకు స్పందన అంతంతే
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకి చేరుకుంది. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతిచ్చేందుకు మొదటి రోజు అన్నా టీమ్‌లోని సభ్యులెవరూ రాలేదు. కాని రెండవ రోజు కిరణ్ బేడీ రాలేగన్‌సిద్ధి చేరుకున్నారు. ఈసారి అన్నా చేపట్టిన నిరాహార దీక్షకు ఊహించినంతగా మద్దతు లభించలేదని తెలుస్తోంది. అయితే అన్నా మాత్రం జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంపై వెనక్కి తగ్గేదిలేదని మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాలేగన్‌సిద్ధి గ్రామంలో బుధవారం ఉదయం మొదటి రోజు మాదిరిగానే ప్రభాత్ భేరీ నిర్వహించారు. నిరాహార దీక్ష సందర్భంగా అక్కడ మద్దతిచ్చేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారందరి కోసం వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
మండేలా వ్యాక్స్ విగ్రహ ఆవిష్కరణ...
ఇటీవలే మరణించిన నల్ల వజ్రం, దక్షిణాఫ్రికా ప్రథమ నల్లజాతి అధ్యక్షులైన నెల్సన్ మండేలా వ్యాక్స్ విగ్రహాన్ని అన్నా హజారే బుధవారం ఉదయం ఆవిష్కరించారు. పుణే జిల్లా లోనవాలాలోని వ్యాక్స్ మ్యూజియం కోసం ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని అన్నా హజారే చేతులమీదుగా ఆవిష్కరించిన అనంతరం ఆ విగ్రహాన్ని లోనవాలా వ్యాక్స్ మ్యూజియంకు తరలించారు.
అన్నా కాల్ సెంటర్ ప్రారంభం...
రాలేగన్‌సిద్ధిలోనే కాకుండా దేశవ్యాప్తంగా తమ తమ గ్రామాలు, తాలూకాలు, జిల్లాల్లోనే కార్యకర్తలు జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఆందోళనలు చేయాలని అన్నా హజారే పిలుపునిచ్చిన విషయం విదితమే. ఇందుకోసం ఓ కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దానికి అన్నా కాల్ సెంటర్‌గా నామకరణం చేశారు.