‘లోక్‌పాల్’ లుకలుకలు...బిల్లు గట్టెక్కేనా!
Published Wed, Feb 5 2014 11:49 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కార్ జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీరును ప్రభుత్వానికి మద్దతు ఇస్తోన్న కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తుండడంతో జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టరూపం దాల్చేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హోం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా జన్‌లోక్‌పాల్‌బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం ఈ వ్యతిరేకతను పట్టించుకోవడానికి నిరాకరిస్తోంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది బీజేపీ ఇంకా స్పష్టం చేయనప్పటికీ , రాజ్యాంగవిరుద్ధ పద్ధతిలో బిల్లును ప్రవేశపెట్టినట్లయితే తాము దానిని వ్యతిరేకిస్తామని మాత్రం స్పష్టం చేసింది.
జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు ఢిల్లీ సర్కార్ ఈ బిల్లును లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా హోం మంత్రిత్వశాఖకు పంపి అనుమతి తీసుకోవాలని, ముందస్తు ఆమోదం లేకుండా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగవిరుద్ధమని కాంగ్రెస్ అంటోంది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెట్టే బిల్లును తాము ఆమోదించబోమని కాంగ్రెస్ తెలిపింది.
ముందస్తు అనుమతిలేకుండా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆప్ సర్కారు ప్రయత్నించినట్లయితే ఈ అంశాన్ని సభా కార్యకలాపాల జాబితాలో చేర్చరాదని స్పీకర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించవచ్చని, లేదా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుమతి నిరాకరించవచ్చని లేదా బహిరంగ ప్రదేశంలో సభ నిర్వహించడానికి అసెంబ్లీ తీర్మానాన్ని తేవాలని ఆదేశించవచ్చని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇతర పార్టీల వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తోంది. తమది ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని వాదిస్తోంది. అసెంబ్లీ అత్యున్నత చట్టసభ అని ఆప్ సర్కార్ అంటోంది. ఇతర పార్టీల అభిప్రాయాల గురించి తమకు అవసరం లేదని, అనుకున్నట్లుగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడ్తామని ఆప్ నేతలు అంటున్నారు.విధానసభలో ఆమ్‌ఆద్మీ పార్టీకున్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు లేవు. అసెంబ్లీలో స్పీకర్‌ను తీసివేస్తే ఆప్ సంఖ్యా బలం 26 కాగా, శిరోమణి అకాలీదళ్ సభ్యునితో కలుపుకుని ప్రతిపక్ష బీజేపీ బలం 32 ఉంది.
కాంగ్రెస్‌కు 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆప్ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నానని ప్రకటించినప్పటికీ జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ఇస్తానంటున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్, జేడీయూ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ లోక్‌పాల్ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు వ్యతిరేకించినా, కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరై, బీజేపీ వ్యతిరేకించినా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడం సాధ్యం కాదు. పోనీ.. ఇన్ని అడ్డంకులు దాటి ప్రభుత్వం అనుకున్నట్లుగా విధానసభ లోక్‌పాల్ బిల్లును ఆమోదించినా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు ఆయన అనుమతి నిరాకరించడానికి లేదా ప్రతికూల వ్యాఖ్యతో రాష్ట్రపతికి పంపడానికి కూడా అవకాశముందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
సామాజిక కార్యకర్త అన్నాహజారే చేప ట్టిన ఉద్యమస్ఫూర్తితో ఢిల్లీలో ప్రత్యేక జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఆప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే 15 రోజుల్లో ఈ బిల్లును అమలులోకి తెస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినా బిల్లు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఆ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేనందున బిల్లును ప్రవేశపెట్టడంలో ఆప్ సర్కార్ తటపటాయిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది లేదంటే అంతే.. బిల్లు ఆమోదం పొందితే ముఖ్యమంత్రి సైతం దీని పరిధిలోకి వస్తారు.
Advertisement
Advertisement