లోక్‌పాల్.. లొల్లి లొల్లి!
Published Sat, Feb 8 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లుపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. నలుగురు న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేర్రూ.వాల్ శుక్రవారం లెఫ్టినెంట్ గవ ర్నర్‌కు రాసిన లేఖలో వెల్లడించగా, కేజ్రీవాల్ సర్కార్ ప్రత్యేకంగా జన్‌లోక్‌పాల్ బిల్లు విషయమై తమను సంప్రదించలేదని కేర్రూ.వాల్ పేర్కొన్న నలుగురు న్యాయనిపుణులలో ఇద్దరు అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయమై తాము మారూ. ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముద్గల్‌తో పాటు ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు పి.వి. కపూర్, కె.ఎన్.భట్, పినాకీ మిశ్రా సలహా తీసుకున్నామని ఎల్జీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు విషయమై తమను సంప్రదించలేదని, రాజ్యాంగ సంబంధిత ఇతర అంశాలను మాత్రమే చర్చించిందని కె.ఎన్. భట్, పినాకీమిశ్రా తెలిపారు.
తాను అసలు జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను చూడనేలేదని భట్ తెలిపారు. విధానసభ ఆమోదం కోసం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును ఎల్జీ ద్వారా రాష్ట్రపతి వద్దకు పంపవలసి ఉంటుందా?.. అన్న దానిపైనే తాను ఢిల్లీ ప్రభుత్వానికి సలహా ఇచ్చానని పినాకీ మిశ్రా చెప్పారు. కె.ఎన్ .భట్ కూడా ప్రభుత్వం తనను ఈ విషయంపైనే సంప్రదించిందని స్పష్టం చేశారు. కాగా దీనిపై శనివారం ఆప్ ప్రభుత్వం స్పందించింది. జన్‌లోక్‌పాల్ బిల్లుపై తాము న్యాయనిపుణుల సలహా కోరలేదని, బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు కేంద్రం అనుమతి పొందాలనే హోం మంత్రిత్వశాఖ సూచనపై మాత్రమే వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారని తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖలోని అంశాలను మీడియాలోని కొన్ని వర్గాలు తప్పుగా ఉటంకించాయని ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి రాసిన లేఖను బహిరంగం చేసిన తర్వాత ఇలాంటి వక్రీకరణలు రావడం విచారకరమని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది.
సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కోరినట్లుగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా మారూ. ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ప్రముఖ న్యాయవాదుల సలహా తీసుకుందని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. హోం మంత్రిత్వశాఖ సూచనలు రాజ్యాంగవిరుద్ధమని వారు అభిప్రాయపడ్డారని వివరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు నిబంధనలపై ప్రభుత్వం న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తన లేఖలో ఎక్కడా పేర్కొనలేదని, ఢిల్లీ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి హోం మంత్రిత్వశాఖ ఢిల్లీ ప్రభుత్వానికి చేసిన సూచనలపై మాత్రమే లేఖలో ప్రస్తావించారని ప్రభుత్వం వివరణలో పేర్కొంది.
బిల్లును కేంద్రానికి పంపాల్సిందే..
వీలైనంత త్వరగా జన్‌లోక్‌పాల్ చట్టం తెచ్చి ప్రజలలో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ రాజ్యాంగ నియమాలను పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. కేంద్రం అనుమతి లేకుండా జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమేనని వారు అంటున్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా లేదు కాబట్టి మిగతా రాష్ట్ర అసెంబ్లీలకు ఉన్నట్లు అధికారాలు ఢిల్లీ విధానసభకు లేవని వారు అంటున్నారు. అర్థిక వ్యయంతో కూడిన ప్రతిబిల్లును ఢిల్లీ విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం దానిని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు.
కేంద్రం ఇప్పటికే ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుతో సంబంధమున్న బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు కూడా ఢిల్లీ సర్కార్ కేంద్రం ఆమోదం పొందవలసి ఉంటుందని వారు చెబుతున్నారు.అలాగే జన్‌లోక్‌పాల్ బిల్లుకు కొంత నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కూడా విడుదలవుతాయి కాబట్టి ఈ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని వారు అంటున్నారు. ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ పోలీసులను, డీడీఏ సిబ్బందిని కూడా పరిధిలోకి తీసుకుంది కనుక విధానసభలో ప్రవేశపెట్టడానికి ముందు ఈ బిల్లుకు హోం శాఖ ఆమోదం తప్పనిసరి అంటున్నారు. కేంద్రం ఇప్పటికే లోక్‌పాల్ బిల్లు ఆమోదించింది కనుక ఢిల్లీ సర్కార్ రూపొందించిన బిల్లుకు కేంద్రం ముందస్తు ఆమోదం తప్పనిసరి అని వారు అంటున్నారు.
వెనక్కు తగ్గం: ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్‌బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆప్ ముందడుగే వేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ మేం అధికారంలోకి వచ్చే ముందు జన్‌లోక్‌పాల్ తీసుకొస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చాం.. బిల్లుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అసెంబ్లీలో ప్రవేశపెడతాం. రాజ్యాంగంలోని 255 అధికరణ ప్రకారం మేం ముందుకు పోతాం. ఎవరినీ బతిమాలేది లేదు..’ అని ఆయన నొక్కిచెప్పారు. ఒకవేళ జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందితే తమ పార్టీల్లో చాలామంది నాయకులు జైలుకు పోవాల్సి ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement