ఆమోదం వాయిదా జరిగింది చర్చ మాత్రమే!
Published Tue, Jan 28 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జన్‌లోక్‌పాల్ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర పడలేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముసాయిదా బిల్లుపై చర్చ మాత్రమే జరిగింది. దీంతో ఇక తదుపరి సమావేశంలోనే ఆమోదం పొందే అవకాశముందని కేబినెట్ మంత్రులు చెబుతున్నారు. శుక్రవారం కేబినెట్ మరోసారి సమావేశం కానుందని, ఆరోజు ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర పడవచ్చని చెబుతున్నారు. కాగా ఎందుకు ఆమోదం పొందలేదనే విషయమై ఆప్ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ‘జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదా ఇంకా పూర్తి కాలేదు. న్యాయశాఖ బిల్లు ముసాయిదాను సరైన ఫార్మాట్‌లో పంపకపోవడంతో శుక్రవారం వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనుగుణమైన ఫార్మాట్‌లో ముసాయిదా శుక్రవారం వరకు సిద్ధమైతే ఆరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడవచ్చు’నని చెప్పారు. ఇదిలాఉండగా ముసాయిదా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఫిబ్రవరిలో నగరంలోని రాంలీలా మైదాన్‌లో బహిరంగ అసెంబ్లీని ఏర్పాటు చేసి బిల్లుకు చట్టరూపం ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కార్ యోచిస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో కేబినెట్ ముఖ్యకార్యదర్శి నిమగ్నమయ్యారు.జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను కూడా కేబినెట్ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి ఆమోదం లభించిన వెంటనే రాంలీలా మైదాన్‌లో బహిరంగ అసెంబ్లీ కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను ప్రభుత్వ నేతలు కలిసే అవకాశముంది. బహిరంగ అసెంబ్లీపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించే సమావేశం ఎప్పుడు? ఎక్కడ? జరగనుందనే విషయం గవర్నర్ నిర్ణయంపై ఆధారపడనుంది. బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు అంటున్నారు.
సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులపై చర్చ
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మంగళవారం ఉదయం రెండు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనుకుంటోందని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కేబినెట్ సమావేశం తరువాత చెప్పారు. అయితే ఇందుకోసం కోసం విధివిధానాలను అతిక్రమించలేమని ఆయన చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశాన్ని పరిశీలించడం కోసం ఓ కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు. కమిటీ నిర్ధారిత గడువు ప్రకారం పనిచే స్త్తుందని, అప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులను ఎవరినీ పదవినుంచి తొలగించరని ఆయన స్పష్టంచేశారు. మహిళా సురక్షా దళ్ కోసం హోం గార్డులను, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఉపయోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మాస్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.
మంత్రుల నుంచి నివేదిక కోరిన సీఎంఆప్ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల రోజులలో తాము చేసిన పనులతో కూడిన నివేదిక సమర్పించవలసిందిగా సహచర మంత్రులను కోరారు.
Advertisement
Advertisement