న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లపై పాక్ ఉక్రమూకలు జరిపిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమాపై గత కొద్దిరోజులుగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలసిందే. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ అంశంపై మాట్లాడుతూ.. కశ్మీర్ పండిట్ల కష్టాలను పట్టించుకోని బీజేపీ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మాత్రం శ్రద్ధ చూపిస్తోందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లు కేంద్రంలో అధికారం ఉన్న కాషాయ పార్టీ కశ్మీర్ పండిట్లకు ఏం న్యాయం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు.
దేశ వ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ పండిట్‌లు కశ్మీర్‌కు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోరుకుంటున్నారని సిసోడియా అన్నారు. బీజేపీ కేవలం కాశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం ఆందోళన చెందుతోందని, కాశ్మీరీ పండిట్‌లు కోసం కాదని ఆయన ధ్వజమెత్తారు. కాశ్మీరీ పండిట్ల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా చేశారని ఆయన అన్నారు. సరైన డాక్యుమెంట్లు లేకపోయినా 223 మంది ఉపాధ్యాయులకు శాశ్వత హోదా కల్పించారని, వారి పెన్షన్ వ్యవస్థను క్రమబద్ధీకరించారని అన్నారు. ఢిల్లీలోని కాశ్మీరీ పండిట్‌లకు నెలకు రూ. 3000 కూడా అందించారని చెప్పారు. అయినా కాశ్మీరీ పండిట్లకు కావాల్సింది సినిమా కాదని వారికి తగిన న్యాయం జరగాలని సిసోడియా చెప్పారు.
కాగా కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోద పన్ను మినహాయింపు అంశంపై కేజ్రీవాల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరూ ఉచితంగా చూస్తారని వ్యాఖ్యానించారు. అలాగే సినిమా కలెక్షన్లను కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు.. ఇంతకూ ఢిల్లీలో కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని కేజ్రీవాల్‌పై కౌంటర్ వేశారు. దీనికి స్పందనగా ఢిల్లీ డిప్యూటీ సీఎం రీకౌంటర్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment