ఆరు నూరైనా అక్కడే!
Published Wed, Feb 12 2014 10:38 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జన్‌లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లులకు చట్టరూపం ఇవ్వడానికి ఆప్ ప్రభుత్వం తొందరపడుతున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. స్వరాజ్ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర బుధవారం కూడా లభించలేదు. బుధవారం కేబినెట్ సమావేశంలో దీని ముసాయిదాపై చర్చ జరిపినప్పటికీ ఆమోదించలేదు. ఇక జన్‌లోక్‌పాల్ బిల్లును వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కేంద్రానికి పంపకుండానే బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీని సమావేశపరిచి ఈ బిల్లులను ఆమోదించాలని కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయం అవి చట్టరూపం దాల్చడానికి అడ్డంకిగా మారింది. కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టొచ్చా అనే అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అభిప్రాయాన్ని కోరారు. ఈ బిల్లును సరైన రీతిలో సభలో ప్రవేశపెట్టనట్లయితే వ్యతిరేకిస్తామని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఈ బిల్లును విధానసభ లో ప్రవేశపెట్టాలనే విషయంలో ఆప్ సర్కారు గట్టి పట్టుదలతో ఉంది. జన్‌లోక్‌పాల్ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టరాదంటూ లె ఫ్టినెంట్ గవర్నర్ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ బిల్లు గురువారం అసెంబ్లీ ముందుకు రావడం ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అంటున్నాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ నో
ఇందిరాగాంధీ ఇండోర్‌స్టేడియంలో ప్రజల సమక్షంలో జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యోచన కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. ఐజీఐ స్టేడియంలో విధానసభ నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ ఆప్ సర్కారు పంపిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియంలో విధానసభ సమావేశ నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ సుముఖంగా లేరని తెలిసినప్పటికీ ఇందు కు అనుమతి నివ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను మరోసారి కోరింది.
ఎదురుదెబ్బ: కాగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్‌లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని న్యాయశాఖ స్పష్టం చేసింది.
కేబినెట్‌లో చర్చించాం
ఎల్‌జీ విన్నపం మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చిందని విద్య, ప్రజాపనుల శాఖ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రత కల్పించలేమని ఢిల్లీ పోలీసులు చెప్పడంపై ఆయన స్పందిస్తూ ఇంతకంటే భారీఎత్తున జరిగిన క్రీడలు, మత సంబంధమైన ఉత్సవాలకే ఎంతో భద్రత కల్పించారన్నారు. అటువంటప్పుడు కేవలం నాలుగు లేదా ఐదు గంటలపాటు ఐజీఐ స్టేడియంకు భద్రత ఎందుకు కల్పించలేరని ఆయన ప్రశ్నించారు. భద్రత విషయంలో వారు అసలు ఎందుకంత నిర్లిప్తంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విధానసభ ఆవల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలుగుతుందా అని ప్రశ్నించగా ఈ విషయం ప్రభుత్వం, స్పీకర్ల పరిధిలో ఉందన్నారు.
Advertisement
Advertisement