క్రేజీ పొలిటీషియన్
విశ్లేషణం
ఐఆర్‌ఎస్ వదిలిపెట్టి, ఉద్యమాల బాటపట్టి, సమాచారహక్కు తెచ్చి, జన్‌లోక్‌పాల్‌కోసం పట్టుబట్టి, ఆమ్‌ఆద్మీ పార్టీ పెట్టి, సామాన్యుడికి పట్టంకట్టి, ముఖ్యమంత్రిని ఓడగొట్టిన క్రేజీ పొలిటీషియన్... అరవింద్ కేజ్రీవాల్.
కేజ్రీవాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్. సీ, లుకింగ్, బ్రైట్‌లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్థం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. కంటి కదలికలు కుడివైపు పైకి ఉంటే ఏదో క్రియేట్ చేసి చెప్తున్నారని అర్థం.
నాకు నచ్చిందే చేస్తాను...
కేజ్రీవాల్ సంప్రదాయ రాజకీయ నాయకులకు పూర్తిగా భిన్నమైన నాయకుడు. తన ఉపన్యాసాలతో అదరగొట్టడు, అలివికాని హామీలతో మభ్యపెట్టడు. సామాన్యుడిలో సామాన్యుడిలా వారి సమస్యల పరిష్కారంకోసం కృషిచేస్తాడు. తాను నమ్మిన విలువల పరిరక్షణకోసం పోరాడతాడు. నిజమైన ప్రజా సేవకుడిగా పనిచేస్తాడు. అందుకేనేమో తమ పార్టీ గుర్తుగా చీపురు ఎంచుకున్నాడు. అయితే అరవింద్ పైకి కనిపించేటంత ప్రజాస్వామ్య నాయకుడు కాదని ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు తరచుగా చూపుడువేలును చూపించి మాట్లాడతాడు. అలాగే అరచేతిని కిందకు ఉంచి మాట్లాడతాడు. వీటినిబట్టి ఆయన అథారిటేటివ్ నాయకుడని చెప్పవచ్చు. అంటే ఎవరేం చెప్పినా తాను అనుకున్నదే చేయడం, తాను చెప్పిందే మిగతావారు వినాలనే తత్వమన్నమాట. జనలోక్‌పాల్ బిల్లుకోసం హజారేతో కలిసి ఉద్యమించినప్పటికీ, రాజకీయపార్టీ స్థాపన విషయంలో ఆయనతో విభేదించడానికి కూడా ఈ నాయకత్వ లక్షణమే కారణమని చెప్పవచ్చు. అయితే విజన్, ఫోకస్ ఉన్న నాయకుడు కాబట్టి తన పార్టీని సమర్థంగా, విజయపథంలో నడిపించగలిగాడు.
ప్రొయాక్టివ్ పర్సన్...
అరవింద్ ప్రొయాక్టివ్ వ్యక్తిత్వమున్నవాడు. సమస్యలు వచ్చినప్పుడు వాటిపై స్పందించడం కాకుండా, సమస్యలను ముందే గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషిచేస్తాడు. తాను చేస్తున్నది మంచో చెడో నిర్ణయించుకునేందుకు తన అంతర్వాణినే ఆధారంగా తీసుకుంటాడే తప్ప ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోడు. ఒత్తిడి ఎదురైనప్పుడు తానే భరిస్తాడు, పెద్దగా బయటకు వ్యక్తంచేయడు. ఏ విషయంపైనైనా ఎదుటివారిని ఒప్పించేందుకు అనేక ఉదాహరణలు వివరిస్తాడు. తన సహచరుల స్పందనలు, ప్రజల ప్రతిస్పందనలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. జయాపజయాలకు తానొక్కడినే బాధ్యుడినని అనుకోడు. తన జట్టుతోపాటు పరిస్థితులు కూడా కారణమని ఒప్పుకుంటాడు. గతం, వర్తమానం కంటే భవిష్యత్తు గొప్పగా, మెరుగ్గా ఉండేందుకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటాడు.
ప్రజలకోసం...
ప్రజల మనిషిగా...
ఆమ్‌ఆద్మీ పార్టీ స్థాపించాకనే కేజ్రీవాల్ ప్రజాసమస్యను పట్టించుకుంటున్నాడనుకుంటే పొరపాటే. అంతకుముందే... తాను ఇన్‌కంటాక్స్ అధికారిగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రజలకు సమాచారహక్కు ఉంటే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చని విశ్వసించారు. ఆ హక్కుకోసం ఉద్యమించారు, సాధించారు, రామన్ మెగసస్సే అవార్డును అందుకున్నారు. ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ పార్టీలను నేను వ్యతిరేకిస్తున్నాను... రాజకీయాలు నాకు సహనాన్ని నేర్పాయి... సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటే... ఢిల్లీలో మా విజయం ప్రజల విజయమే... ఇవన్నీ కేజ్రీవాల్ మాటలే. వర్తమాన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనే సమున్నత లక్ష్యంతో ఆయన స్థాపించిన ఆమ్‌ఆద్మీపార్టీ సంచలనాలు సృష్టించింది... మరిన్ని సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
ఒత్తిడి ఎదురైనప్పుడు తానే భరిస్తాడు. ఏ విషయంపైనైనా ఎదుటివారిని ఒప్పించేందుకు అనేక ఉదాహరణలిస్తాడు.
విశేష్, సైకాలజిస్ట్