ఎన్ని వందలసార్లయినా.. సీఎం కుర్చీ వదిలేస్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి హెచ్చరిక గళం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటీవల ధర్నాకు దిగిన కేజ్రీవాల్.. అసెంబ్లీలో జన్ లోక్పాల్ బిల్లు ఆమోదం పొందకుంటే ఏకంగా పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అవినీతిని అరికట్టేందుకు ఎంతదాకా అయినా పోరాడుతానని చెప్పిన మరుసటి రోజే మరో ముందడుగు వేశారు. అసెంబ్లీలో బిల్లు పాసవకుంటే తనకు పదవిలో కొనసాగే అర్హత లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు వందసార్లయినా ముఖ్యమంత్రి పదవిని వదులు కుంటానని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ముఖ్యమంత్రి కావడం కోసం కాదని, అవినీతి అరికట్టేందుకని చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీకి కాస్త దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో ఏడు వారాల క్రితం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపుతున్నా ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ ఎన్నికల హామీలో లోక్పాల్ బిల్లు ముఖ్యమైనది. కాగా లోక్బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన పంతం నెగ్గకుంటే పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జన్ లోక్పాల్ బిల్లుతో పాటు స్వరాజ్ బిల్లు పాసవకుంటే తమ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు.
జన్ లోక్పాల్, బిల్లును ఈ నెల 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆప్కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా అసమ్మతి ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్కు 8 మంది, బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఆప్ మళ్లీ పూర్తి మెజారిటీ సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.