సాక్షి, ముంబై: అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్ బిల్లు ప్రవేశపెడతామంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తిస్థాయిలో నెరవేరవకపోవడంతో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ది గ్రామం పేరు మారుమోగుతోంది. గతంలో అనేక ఆందోళనలు చేపట్టిన అన్నా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఏకంగా ఐదోసారి ఆందోళనకు దిగుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీలో, ఒకసారి ముంబైలో ఆందోళనలు చేశారు. ఇక ఐదోసారి మాత్రం రాలెగావ్‌సిద్దిలోనే మంగళవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నారు. లోక్‌పాల్ బిల్లుపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు పెద్ద ఎత్తున స్పందన లభించినప్పటికీ ముంబైలో ఆందోళన ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 76 ఏళ్ల అన్నా హజారే పట్టువదలని విక్రమార్కుడిలా మరో ఆందోళనకు సిద్దమవుతున్నారు.
మొదటిసారి 2011 ఏప్రిల్‌లో...
లోక్‌పాల్ బిల్లు కోసం మొట్టమొదటిసారిగా అన్నా 2011 ఏప్రిల్‌లో నిరాహార దీక్ష చేశారు. ఈ ఆందోళన ఏప్రిల్ ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ మైదానంలో కొనసాగింది. దీంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు, పౌరసంఘానికి చెందిన ఐదుగురితో ఉమ్మడి ముసాయిదా కమిటీని నియమించడంతో ఆయన తన దీక్ష విరమించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం మాటమార్చడంతో అదే ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి 13 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన 13 రోజుల నిరాహార దీక్ష సందర్భంగా ఆరోగ్యం బాగా క్షీణించినప్పటికీ ఈ సంఘ సేవకుడు వెనుతిరిగి చూడలేదు. ఈ ఆందోళనకు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆ ఏడాది శీతాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వడంతో ఆయన రెండో ఆందోళన ముగిసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ సీబీఐ, ప్రధాని తదితర అనేక కీలకమైన అంశాలను లోక్‌పాల్ పరిధి నుంచి తొలగించారు. దీంతో మూడోసారి అన్నా హజారే ఢిల్లీలో ఆందోళనకు దిగారు. అయితే చలి కారణంగా దీక్షాస్థలిని ముంబైకి మార్చుకున్నారు. తదనంతరం బిల్లు కోసం మరోసారి ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు. ఈ ఆందోళన కూడా గత ఆగస్టులో ముగిసింది.
రాలెగావ్‌సిద్ది నుంచి ప్రారంభం....
అన్నా హజారే స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలెగావ్‌సిద్ది గ్రామం నుంచి మొదట తన ఆందోళనలు పారంభించారు. ఈ గ్రామంతోపాటు మహారాష్ట్రలోని వివిధ సమస్యలపై ఆయన ఇప్పటి వరకు 18 సార్లు నిరాహార దీక్షలు చేయగా ప్రతిసారి ప్రభుత్వం ఆయన డిమాండ్లకు తలొగ్గడం విశేషం. ఆయన చేపట్టిన వాటిల్లో 14 నిరాహార దీక్షలు మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినవి కాగా చివరి నాలుగు మాత్రంలోక్‌పాల్ బిల్లు కోసం ఉద్దేశించినవి.
అన్నా తొలిసారి 1980లో దీక్ష చేశారు. ఇప్పటివరకు సుమారు 125 రోజులకుపైగా ఆయన నిరాహార దీక్షల్లో ఉన్నారు. 1996లో చేసిన నిరాహార దీక్ష 12 రోజులుపాటు కొనసాగింది.లోక్‌పాల్ బిల్లు కోసం గత ఆగస్టు 16 నుంచి చేపట్టిన దీక్ష అత్యధికంగా 13 రోజులపాటు కొనసాగింది. ఈ సామాజిక యోధుడి దీక్షల కారణంగా ఇప్పటివరకు 450 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు మంత్రులు తమ పదవులు కోల్పోయారు.
అందరిదృష్టీ రాలెగావ్‌పైనే
Published Tue, Dec 10 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement