Ralegaon Siddhi
-
ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష
పుణే: మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రకటించారు. సూపర్మార్కెట్లు, కిరాణా కొట్లలో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న అన్నాహజారే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారని ఆయన లేఖలో వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో..
సాక్షి, ముంబై: జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం నుంచి అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు డిగ్రీల గడ్డకట్టించే చలికి కూడా బెదరకుండా కాసేపు నడిచి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. ‘కరో యా మరో’, ‘ఆర్ యా పార్’ (చావో రేవో) అనే నినాదంతో ఉదయం సుమారు 11 గంటల ప్రాం తంలో దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు ముందు ఆయన గ్రామస్తులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షాస్థలమైన యాదవ్‌బాబా మందిరం వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అన్నా హజారే కొత్తగా స్థాపించిన జనతంత్ర మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష గురించి తెలుసుకున్న అనేక మంది దీక్షకు మద్దతు తెలిపేందుకు రాలెగావ్‌సిద్ధికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో విపరీతంగా రద్దీ కనిపిం చింది. అన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఎవరూ గుమిగూడాల్సిన అవసరంలేదని, ప్రజలు వారి వారి గ్రామాల్లో తాలూకాలు, జిల్లాల్లో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఎవరితోనూ చర్చ లు జరిపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా దీక్ష చేయడం ఇది ఐదోసారి. ‘బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం మాకు చాలా సార్లు హమీ ఇచ్చింది. ఏడాది గడిచినా దానికి మోక్షం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. ఇలా గే కాలయాపన చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ శీతాకాల సమావేశాల్లో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాల్సిందే. బిల్లుకు ఆమోదం లభించేదాకా నా దీక్షను కొనసాగిస్తా’ అని ఆయన సోమవారం విలేకరుల తో మాట్లాడుతూ అన్నారు. ఇక అన్నాకు మద్దతుగా ముంబై, నాగపూర్, పుణేతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీ అవి నీతి కేసులను విచారించడానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు జన్‌లోక్‌పాల్ బిల్లు ఉపయోగపడుతుంది. అన్నా నేతృత్వంలోని పౌరసంఘం సభ్యులు దీనిని తొలిసారిగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన బిల్లులో కొన్ని మార్పులు చేసింది. సీబీఐ, ప్రధానిని లోక్‌పాల్ బిల్లులో చేర్చడానికి తిరస్కరించింది. దీంతో ఈ మాజీ సైనికోద్యోగి ఐదోసారి దీక్షకు దిగారు. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం... అన్నా హజారే దీక్షతో రాలెగావ్‌సిద్ధికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రముఖులు రావడం ప్రారంభమైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఆయన గతంలో ముంబైలో చేపట్టిన దీక్షకు పెద్దగా స్పందన రానప్పటికీ ఈసారి మాత్రం మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు రాలెగావ్‌సిద్ది గ్రామానికి చేరుకొని భద్రత వ్యవస్థను పర్యవేక్షించారు. యాదవ్ బాబా ఆలయం వద్ద రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై అన్నా హజారే దీక్షలో కూర్చుండగా, మరో వేదికపై ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేదికపై అన్నా ఒక్కరే కూర్చున్నారు. వేదిక వెనుక కనిపిస్తున్న బ్యానర్‌పై కేవలం మహాత్మాగాంధీ చిత్రం ఉంది. -
అందరిదృష్టీ రాలెగావ్పైనే
సాక్షి, ముంబై: అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్ బిల్లు ప్రవేశపెడతామంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తిస్థాయిలో నెరవేరవకపోవడంతో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ది గ్రామం పేరు మారుమోగుతోంది. గతంలో అనేక ఆందోళనలు చేపట్టిన అన్నా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఏకంగా ఐదోసారి ఆందోళనకు దిగుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీలో, ఒకసారి ముంబైలో ఆందోళనలు చేశారు. ఇక ఐదోసారి మాత్రం రాలెగావ్సిద్దిలోనే మంగళవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నారు. లోక్‌పాల్ బిల్లుపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలకు పెద్ద ఎత్తున స్పందన లభించినప్పటికీ ముంబైలో ఆందోళన ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 76 ఏళ్ల అన్నా హజారే పట్టువదలని విక్రమార్కుడిలా మరో ఆందోళనకు సిద్దమవుతున్నారు. మొదటిసారి 2011 ఏప్రిల్‌లో... లోక్‌పాల్ బిల్లు కోసం మొట్టమొదటిసారిగా అన్నా 2011 ఏప్రిల్‌లో నిరాహార దీక్ష చేశారు. ఈ ఆందోళన ఏప్రిల్ ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ మైదానంలో కొనసాగింది. దీంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు, పౌరసంఘానికి చెందిన ఐదుగురితో ఉమ్మడి ముసాయిదా కమిటీని నియమించడంతో ఆయన తన దీక్ష విరమించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం మాటమార్చడంతో అదే ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి 13 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన 13 రోజుల నిరాహార దీక్ష సందర్భంగా ఆరోగ్యం బాగా క్షీణించినప్పటికీ ఈ సంఘ సేవకుడు వెనుతిరిగి చూడలేదు. ఈ ఆందోళనకు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆ ఏడాది శీతాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వడంతో ఆయన రెండో ఆందోళన ముగిసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ సీబీఐ, ప్రధాని తదితర అనేక కీలకమైన అంశాలను లోక్‌పాల్ పరిధి నుంచి తొలగించారు. దీంతో మూడోసారి అన్నా హజారే ఢిల్లీలో ఆందోళనకు దిగారు. అయితే చలి కారణంగా దీక్షాస్థలిని ముంబైకి మార్చుకున్నారు. తదనంతరం బిల్లు కోసం మరోసారి ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు. ఈ ఆందోళన కూడా గత ఆగస్టులో ముగిసింది. రాలెగావ్‌సిద్ది నుంచి ప్రారంభం.... అన్నా హజారే స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలెగావ్‌సిద్ది గ్రామం నుంచి మొదట తన ఆందోళనలు పారంభించారు. ఈ గ్రామంతోపాటు మహారాష్ట్రలోని వివిధ సమస్యలపై ఆయన ఇప్పటి వరకు 18 సార్లు నిరాహార దీక్షలు చేయగా ప్రతిసారి ప్రభుత్వం ఆయన డిమాండ్లకు తలొగ్గడం విశేషం. ఆయన చేపట్టిన వాటిల్లో 14 నిరాహార దీక్షలు మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినవి కాగా చివరి నాలుగు మాత్రంలోక్పాల్ బిల్లు కోసం ఉద్దేశించినవి. అన్నా తొలిసారి 1980లో దీక్ష చేశారు. ఇప్పటివరకు సుమారు 125 రోజులకుపైగా ఆయన నిరాహార దీక్షల్లో ఉన్నారు. 1996లో చేసిన నిరాహార దీక్ష 12 రోజులుపాటు కొనసాగింది.లోక్‌పాల్ బిల్లు కోసం గత ఆగస్టు 16 నుంచి చేపట్టిన దీక్ష అత్యధికంగా 13 రోజులపాటు కొనసాగింది. ఈ సామాజిక యోధుడి దీక్షల కారణంగా ఇప్పటివరకు 450 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు మంత్రులు తమ పదవులు కోల్పోయారు.