ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో.. | Anna Hazare begins indefinite fast for Jan Lokpal Bill | Sakshi
Sakshi News home page

ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో..

Published Tue, Dec 10 2013 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో..

ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో..

 సాక్షి, ముంబై:  జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం నుంచి అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు డిగ్రీల గడ్డకట్టించే చలికి కూడా బెదరకుండా కాసేపు నడిచి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. ‘కరో యా మరో’, ‘ఆర్ యా పార్’ (చావో రేవో) అనే నినాదంతో ఉదయం సుమారు 11 గంటల ప్రాం తంలో దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు ముందు ఆయన గ్రామస్తులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షాస్థలమైన యాదవ్‌బాబా మందిరం వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 
 
 అయితే అన్నా హజారే కొత్తగా స్థాపించిన జనతంత్ర మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష గురించి తెలుసుకున్న అనేక మంది దీక్షకు మద్దతు తెలిపేందుకు రాలెగావ్‌సిద్ధికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో విపరీతంగా రద్దీ కనిపిం చింది. అన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఎవరూ గుమిగూడాల్సిన అవసరంలేదని, ప్రజలు వారి వారి గ్రామాల్లో తాలూకాలు, జిల్లాల్లో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఎవరితోనూ చర్చ లు జరిపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా దీక్ష చేయడం ఇది ఐదోసారి.
 
  ‘బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం మాకు చాలా సార్లు హమీ ఇచ్చింది. ఏడాది గడిచినా దానికి మోక్షం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. ఇలా గే కాలయాపన చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ శీతాకాల సమావేశాల్లో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాల్సిందే. బిల్లుకు ఆమోదం లభించేదాకా నా దీక్షను కొనసాగిస్తా’ అని ఆయన సోమవారం విలేకరుల తో మాట్లాడుతూ అన్నారు. ఇక అన్నాకు మద్దతుగా ముంబై, నాగపూర్, పుణేతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీ అవి నీతి కేసులను విచారించడానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు జన్‌లోక్‌పాల్ బిల్లు ఉపయోగపడుతుంది. అన్నా నేతృత్వంలోని పౌరసంఘం సభ్యులు దీనిని తొలిసారిగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన బిల్లులో కొన్ని మార్పులు చేసింది. సీబీఐ, ప్రధానిని లోక్‌పాల్ బిల్లులో చేర్చడానికి తిరస్కరించింది. దీంతో ఈ మాజీ సైనికోద్యోగి ఐదోసారి దీక్షకు దిగారు. 
 
 అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం...
 అన్నా హజారే దీక్షతో రాలెగావ్‌సిద్ధికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రముఖులు రావడం ప్రారంభమైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఆయన గతంలో ముంబైలో చేపట్టిన దీక్షకు పెద్దగా స్పందన రానప్పటికీ ఈసారి మాత్రం మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా  ఉన్నతాధికారులు రాలెగావ్‌సిద్ది గ్రామానికి చేరుకొని భద్రత వ్యవస్థను  పర్యవేక్షించారు. యాదవ్ బాబా ఆలయం వద్ద రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై అన్నా హజారే దీక్షలో కూర్చుండగా, మరో వేదికపై ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేదికపై అన్నా ఒక్కరే కూర్చున్నారు. వేదిక వెనుక కనిపిస్తున్న బ్యానర్‌పై కేవలం మహాత్మాగాంధీ చిత్రం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement