కేంద్రం అనుమతి తప్పనిసరి; నిపుణుల అభిప్రాయం
సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే డిసెంబర్ 29న రామ్‌లీలా మైదాన్‌లో ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటుచేసి జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే, ఆ హామీని నెరవేర్చడం కష్టమేనని ఆప్ ఇప్పుడు భావిస్తోంది. అందుకు చట్ట సంబంధ సమస్యలున్నాయని బుధవారం ఆ పార్టీ నేత కేజ్రీవాల్ స్వయంగా చెప్పారు. లోక్‌పాల్ బిల్లు, ఢిల్లీకి రాష్ట్రహోదా విషయానికి వస్తే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రప్రభుత్వానికి ఈ విషయాలపై ఉత్తర్వులు జారీచేసే వీలున్నా, చట్టం చేయాలంటే మాత్రం కేంద్రం అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్టం చేసిందని ఆయన వివరించారు.
అయితే, ఈ విషయం కేజ్రీవాల్‌కు ముందే తెలిసి ఉండాల్సిందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఉమేశ్ సెహగల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టాన్నీ ఆమోదించలేదన్న విషయం తనకు ఇప్పుడే తెలిసినట్లుగా కేజ్రీవాల్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కొత్త చట్టాన్ని రూపొందించడానికి ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి పొందవలసిన అవసరం లేదని, కానీ ఇదివరకే చట్టం ఉన్న దానిపై కొత్త చట్టం చేయాలనుకున్నట్లయితే కేంద్రం అనుమతి తప్పక తీసుకోవలసి ఉంటుందని వివరించారు.
కేంద్రం ఇటీవలే లోక్‌పాల్ బిల్లు ఆమోదించింది కాబట్టి ఢిల్లీలో మరో లోక్‌పాల్ చట్టాన్ని తేలేరని, ఢిల్లీలో లోకాయుక్త చట్టం ఇదివరకే ఉండడం వల్ల కొత్తగా లోకాయుక్త చట్టం చేయడానికి మొదట కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా లేనందువల్ల కేంద్రపాలిత ప్రాంతానికి వర్తించే చట్టాలే వర్తిస్తాయి. అందువల్ల ఆప్ ప్రభుత్వం లోకాయుక్త చట్టం కొత్తగా రూపొందించి, దానిని కేబినెట్ ఆమోదించిన తరువాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అనుమతి కోసం పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించాక ఆ బిల్లు తగిన సవరణలతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి తిరిగివస్తుంది. అప్పుడు దానిని ఢిల్లీ విధానసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందగలుగుతారు. ఈ ప్రక్రియకు కొన్ని నెలలు పట్టే అవకాశముంది.