
15 రోజుల్లో జన్‌లోక్‌పాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తర ఘట్టానికి చేరాయి. నాలుగోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కొత్తగా ఎన్నికల బరిలో దిగిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు బుధవారం తమ ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేశాయి. జనాకర్షక పథకాలు, హామీలతో ఆప్ ఆకట్టుకోగా, కాంగ్రెస్ మాత్రం పాత పథకాలు, హామీలతోనే సరిపెట్టింది. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతామని, పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఆప్ పేర్కొంది. ఆప్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేజ్రీవాల్, ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం షీలా దీక్షిత్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, కృష్ణతీరథ్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ జేపీ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆప్’ ఎన్నికల వాగ్దానాలు
అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఢిల్లీ అసెంబ్లీలో ‘ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు’ ప్రవేశపెడతాం. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులందరికీ వర్తిస్తుంది. అధికార వికేంద్రీకరణ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక సభ(మొహల్లా సభ) ఏర్పాటు. రోడ్లు, పేవ్‌మెంట్ల నిర్మాణం వంటి వాటిపై ఈ సభలే నిర్ణయాలు తీసుకుంటాయి. పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పన. ఢిల్లీ అభివృద్ధి సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలో ఉంచడం. విద్యుత్ చార్జీలు సగానికి తగ్గింపు, ప్రతి ఇంటికి 700 లీటర్ల ఉచిత నీరు, నీటి మాఫియాపై చర్యలు. మహిళల భద్రత కోసం ప్రతి వార్డులో పౌర భద్రతా దళం ఏర్పాటు. మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. డెంగ్యూ నియంత్రణకు టాస్క్ ఫోర్స్. ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు చట్టం.
ప్రస్తుత పథకాల కొనసాగింపు: కాంగ్రెస్
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు. వీటికి బడ్జెట్‌లో 75 శాతం నిధులు. మహిళల భద్రతలో కీలకమైన శాంతిభద్రతలను రాష్ట్ర పరిధిలోకి తెచ్చేలా ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం కృషి. ఉపాధి కోసం ఢిల్లీకి వలసవచ్చే వారికి అవసరమైన సదుపాయాల కల్పన. డబుల్‌డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం.