
రైతులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్
మోగా: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ వాయువేగంతో దూసుకెళుతోంది. అందరికంటే ముందే ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆదివారం ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోగాలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో రైతులకోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో భాగంగా, వర్షాల వల్లగానీ, వరదలు, కరువు, క్రిమిసంహారక మందుల ప్రభావం, ఇతర ఎలాంటి కారణాలవల్ల ఓ రైతు పంట నష్టపోతే ఎకరాకు పరిహారంగా రూ.20 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అదే సమయంలో వ్యవసాయ శ్రామికులకు కరువు లేదా ఇతర కారణాలతో వ్యవసాయ పనులు లేకుంటే వారికి నెలకు రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పారు. పంజాబ్లో రైతు ఆత్మహత్యలకు అకాళీదల్ కారణమని ఆరోపించారు. అవినీతికి పాల్పడి సంపాధించిన కోట్ల డబ్బును స్వాధీనం చేసుకొని పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పంట ధరల విషయంలో స్వామినాథన్ కమిషన్ చెప్పిన సూచనలను తప్పకుండా పాటిస్తామని అన్నారు. రాష్ట్రంలో పెరిగి పోతున్న డ్రగ్ సంస్కృతి తగ్గిస్తానని హామీ ఇచ్చారు.