సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వివాదాల్లో చిక్కుకుంది. పార్టీ ఏర్పాటు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పారదర్శకంగానే ఉన్నామన్న ‘ఆప్’కు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే ‘ఝలక్’ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జన్‌లోక్‌పాల్ ఉద్యమం కోసం వసూలు చేసిన నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై కేజ్రీవాల్‌కు హజారే లేఖ రాయగా, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలంటూ సోమవారం కేజ్రీవాల్ ఆయనకు బదులిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై హజారే మంగళవారం రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో మాట్లాడుతూ, నిధుల విషయం సమస్యే కాదని, తన పేరు దుర్వినియోగం చేసుకుంటున్నారనే అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలో సేకరించిన నిధులను దేనికోసం ఉపయోగిస్తున్నారో తనకు తెలియదన్నారు. కేజ్రీవాల్.. హజారే అనుమానాలను నివృత్తి చేసే యత్నాల్లో పడ్డారు. నిధులపై పలుసార్లు హజారేతో చర్చించానని, ఆడిటింగ్ కూడా చేయించారని, అయినా, నిధుల వాడకంపై సందేహాలు ఎందుకని ప్రశ్నించారు.