సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే నెల రామ్‌లీలామైదాన్‌లో నిర్వహించే ర్యాలీ.. వరుస పరాజయాలతో నిరాశలో మునిగిపోయిన కార్యకర్తలకు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక సీటు గెలవలేక పోయింది. దీంతో ఢిల్లీలో దాదాపు కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు డీలా పడకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో పాటు భూసేకరణ బిల్లుకు నిరసనగా రామ్‌లీలామైదాన్‌లో ఏప్రిల్ 12న భారీ ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.
ఈ ర్యాలీకి హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రైతులతో పాటు ఢిల్లీకి చెందిన రైతులు కూడా భారీ స్థాయిలో పాల్గొనేలా చేయాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఢిల్లీలో దాదాపు 25 వేల రైతు కుటుంబాలు ఉన్నాయని అంచనా. వీరిని ర్యాలీలో పాల్గొనేలా చేసే భాధ్యతను ఢిల్లీ కాంగ్రెస్ స్వీకరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త పని లభించింది. ర్యాలీకి ముందు ఢిల్లీ కాంగ్రెస్ నగరంలో కిసాన్ రథ్ యాత్ర జరపనుంది. ఈ యాత్ర బుధవారం లేదా గురువారం ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. ఉదయం ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో రథ యాత్ర నిర్వహించి సాయంత్రం బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతులెక్కువగా ఉన్న నరేలా, మెహ్రోలీ, నజఫ్‌ఘడ్, ముండ్కా, బవానా, పాలం, బిజ్వాసన్, చత్తర్‌పుర్ వంటి ప్రాంతాల గుండా జరిగేలా ఈ రథ యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ రథయాత్ర, బహిరంగసభల్లో పాల్గొంటారు.
పింఛన్లు చెల్లించనందుకు నిరసన
వితంతువులు, వృద్ధులు, శారీరక వికలాంగులకు పింఛన్లు చెల్లించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ మంగళవారం ఎమ్సీడీ ముఖ్య కార్యాలయం సివిక్ సెంటర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను చేధించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. నిధుల కొరత కారణంగా తమకు గత పది నెలలుగా పింఛన్లు అందడం లేదని వృద్ధులు, వితంతువులు ఆరోపించారు.
సోనియా ర్యాలీ ఢిల్లీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపనుందా!
Published Wed, Mar 25 2015 4:27 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement