ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆప్
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్‌సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment