సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాంలీలా మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలి రావాల్సిందిగా ట్వీటర్‌లో గురువారం ఆయన నగరవాసులను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో పోలీసులు ఈ మైదానంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా నగరవాసులు తరలివస్తారని వారు అంచనా వేస్తున్నారు. సామాన్యులతో పాటు వీవీఐపీలను కూడా అర్వింద్... ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో భద్రత కోసం పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రామ్‌లీలా మైదాన్‌లో 50 వేల మంది కూర్చునేందుకు వీలవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు లక్షమంది స్థానికులు హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భద్రత కోసం ఉన్నతాధికారులు 3,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. వీరిలో కొందరు వేదికపై ఉన్నవారికి భద్రత కల్పించడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. మిగతావారు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రోజునకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. కేజ్రీవాల్ ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉందని ఆప్ నేతలు అంటున్నారు. శనివారం ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రామ్‌లీలా మైదాన్‌కు తరలి వస్తారని, అందువల్ల తాము చూస్తూ ఊరుకోలేమని పోలీసులు కేజ్రీవాల్‌కు తెలియజేశారు. అయితే తమ చర్యలు కార్యకర్తలకు, మద్దతుదారులకు ఇబ్బంది కలిగించేవిగా కాకుండా సమర్థంగా ఉంటాయని పోలీసులు అంటున్నారు.
రామ్‌లీలా మైదాన్‌లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్ర ప్రజాపనుల శాఖ 75 సీసీటీవీ కెమెరాలను అమరుస్తోంది. వాల్ విడియోలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రామ్‌లీలా మైదాన్‌కు కేజ్రీవాల్ తన మద్దతుదారులతో కలసి రోడ్‌షోతో రానున్నారు. దీంతో దారిపొడవునా భద్రత విషయమై పోలీసులు ఆప్ నేతలు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. పలు కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చడం ముఖ్యంగా ఘజియాబాద్ సరిహద్దు వద్ద భద్రత ఏర్పాట్లపై పోలీసులు దృష్టిపెడుతున్నారు, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే కౌశాంబీలోని కేజ్రీవాల్ ఉంటున్న భవనం వద్ద క్యాంపును ఏర్పాటుచేశారు. దీంతోపాటు బారికేడ్లను అమర్చారు.
14న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం ‘రాంలీలా’లో చకచకా ఏర్పాట్లు
Published Thu, Feb 12 2015 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement