swearing-in
-
పట్టాభిషేకం
అట్టహాసంగా జయ పదవీ ప్రమాణం సీఎంగా జయను చూసి తరించిన జనం మంత్రి వర్గంలో 28 మందికి చోటు ఫలించిన అన్నాడీఎంకే శ్రేణుల పూజలు అన్నాడీఎంకే నేతల పూజలు ఫలించాయి. ఎట్టకేలకు జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో గవర్నర్ కే రోశయ్య అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చేత శనివారం పదవీ ప్రమాణం చేయించడంతో అమ్మ పాలన ప్రారంభ మైంది. అట్టహాసంగా సాగిన ఈ మహోత్సవంలో రాజకీయ, రాజకీయేతర, కోలివుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆస్తుల కేసుల నుంచి జయకు విముక్తి లభించాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే రెండు కోర్కెల సాధనకు అన్నాడీఎంకే శ్రేణులు అల్లాడిపోయారు. రాష్ట్రంలోని ఆలయాలన్నింటిలో పూజలు, హోమాలు నిర్వహించారు. పాలాభిషేకాలు చేయించారు. తలనీలాలు సమర్పించుకున్నారు. మరికొందరు ఏకంగా బలవన్మరణాలకే పాల్పడ్డారు. ఇంత చేసినా ఈనెల 11వ తేదీన జయ నిర్దోషిగా మారగా ఒక్కకోర్కె మాత్రమే తీరిందని డీలాపడిపోయారు. సీఎం పదవి దక్కే నా, ఎర్రబుగ్గ కారులో అమ్మను చూసే అదృష్టం కలిగేనా అని ఆందోళన చెందారు. అన్నాడీఎంకే నేతలతో ఆలయాలు మళ్లీ కిటకిటలాడాయి. అమ్మ అభిమానుల మొరను ఆ దేవుడు ఆలకించాడన్నట్లుగా జయ సీఎం అయ్యారు. రాహుకాలం దాటిన తరువాత పదవీ ప్రమాణం కోసం ఉదయం 10.30 గంటలకు ఇంటి నుంచి జయ బయలుదేరారు. దిండుగల్లు నుంచి వచ్చిన యువతీయువకులు శరీరం, ముఖం అంతా అన్నాడీఎంకే పార్టీ మూడురంగులు పూసుకుని జయకు అభివాదం చేశారు. వీరి ఉత్సాహాన్ని గమనించిన జయ కారు దిగి వారిని పిలిపించుకున్నారు. కొద్దిసేపు వారితో సంభాషించి ఫొటో కూడా దిగడంతో వారు ఉబ్బితబ్బిబ్బై పోయారు. అక్కడి నుంచి దారిపొడవునా నిలిచి ఉన్న జనానికి అభివాదం చేస్తూ 10.56 గంటలకు ఆడిటోరియం చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ జయకు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. సరిగ్గా 11 గంటలకు గవర్నర్ కే రోశయ్య ప్రాంగణానికి చేరుకోగా జ్ఞానదేశికన్ స్వాగతం చెప్పారు. రోశయ్య వేదికపైకి రాగానే జయ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తనతో పాటూ ప్రమాణం చేయనున్న 28 మంది మంత్రులను గవర్నర్‌కు పరిచయం చేసిన తరువాత 20 నిమిషాల్లో పదవీ ప్రమాణం ముగిసింది. జయ వేదికపైకి రాగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలంతా జయ జయ ధ్వానాలు చేశారు. జయ ప్రయాణం కారణంగా మెరినాబీచ్రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి సచివాలయం వరకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఎలిళగంపై బైనాక్యులర్స్‌తో పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ అగ్రనేతలు హెచ్రాజా, ఇల గణేశన్లతోపాటు మదురై ఆదీనం స్వామి సైతం హాజరైనారు. జయ పదవీ ప్రమాణం పూర్తికాగానే ఆమె కారుకున్న అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించి జాతీయపతాకాన్ని, పైన ఎర్రబుగ్గను అమర్చారు. తరలివచ్చిన కోలివుడ్: ఒకప్పటి నటిగా తమిళ సినీరంగంతో జయలలిత స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నందున ప్రమాణోత్సవానికి కోలివుడ్ తరలివచ్చింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మ పార్టీ నేతలు సైతం రజనీతో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. అమ్మ కోసం రాజీనామా చేసిన ఆర్కే నగర్ ఎమ్మెల్యే రజనీకి పాదాభివందనం చేయడం కలకలం రేపింది. దక్షిణభారత నటీనటుల సంఘం అధ్యక్షులు, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, ఎమ్మెల్యే శరత్‌కుమార్, రజనీకాంత్ పక్కపక్కనే కూర్చుని హడావిడి చేశారు. కార్యక్రమంపై తరచూ ముచ్చటించుకున్నారు. ఓ సందర్భంలో రజనీతో కలిసి శరత్‌కుమార్ సెల్ఫీ తీసుకున్నారు. సంగీత దర్శకులు ఇళయరాజా, నటులు శివకుమార్, కార్తీ, ప్రభు, అర్జున్, రామరాజన్, నటిలు వెన్నిరాడై నిర్మల, సచ్చు, కుయిలీ హాజరయ్యారు. జయ కేసులో శిక్షపడి ఆమెతోపాటూ నిర్దోషిగా బైటపడిన శశికళ తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చునడం మరో ఆకర్షణైంది. జయ సీఎం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని 207 అమ్మ క్యాంటీన్లలో మూడుపూటలా ఉచితంగా టిఫిన్, భోజనం పంపిణీ చేసేలా చెన్నై కార్పొరేషన్ చైర్మన్ సైదై దొరస్వామి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన జనంతో అమ్మ క్యాంటీన్లు నిండిపోయాయి. ప్రమాణం పూర్తిచేయగానే జయ నేరుగా ఇంటికి చేరుకున్నారు. ఆడిటోరియంకు వెళ్లేపుడు పార్టీ అధినేత్రిగా, తిరిగి వచ్చేపుడు సీఎంగా కారులో వెళుతున్న జయను చూసిన జనం హర్షాతిరేకాలు చేశారు. ఆడ, మగ, వృద్ధులు, యువకులు అనే తేడా లేకుండా వీధుల్లో నృత్యాలు చేశారు. జయ పదవీప్రమాణ స్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని జనం చూసేందుకు వీలుగా బీచ్‌కు సమీపంలో భారీ తెరను అమర్చారు. -
14న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం ‘రాంలీలా’లో చకచకా ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాంలీలా మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలి రావాల్సిందిగా ట్వీటర్లో గురువారం ఆయన నగరవాసులను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో పోలీసులు ఈ మైదానంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా నగరవాసులు తరలివస్తారని వారు అంచనా వేస్తున్నారు. సామాన్యులతో పాటు వీవీఐపీలను కూడా అర్వింద్... ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో భద్రత కోసం పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్‌లీలా మైదాన్‌లో 50 వేల మంది కూర్చునేందుకు వీలవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు లక్షమంది స్థానికులు హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భద్రత కోసం ఉన్నతాధికారులు 3,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. వీరిలో కొందరు వేదికపై ఉన్నవారికి భద్రత కల్పించడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. మిగతావారు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రోజునకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. కేజ్రీవాల్ ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉందని ఆప్ నేతలు అంటున్నారు. శనివారం ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రామ్‌లీలా మైదాన్‌కు తరలి వస్తారని, అందువల్ల తాము చూస్తూ ఊరుకోలేమని పోలీసులు కేజ్రీవాల్‌కు తెలియజేశారు. అయితే తమ చర్యలు కార్యకర్తలకు, మద్దతుదారులకు ఇబ్బంది కలిగించేవిగా కాకుండా సమర్థంగా ఉంటాయని పోలీసులు అంటున్నారు. రామ్‌లీలా మైదాన్‌లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్ర ప్రజాపనుల శాఖ 75 సీసీటీవీ కెమెరాలను అమరుస్తోంది. వాల్ విడియోలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రామ్‌లీలా మైదాన్‌కు కేజ్రీవాల్ తన మద్దతుదారులతో కలసి రోడ్‌షోతో రానున్నారు. దీంతో దారిపొడవునా భద్రత విషయమై పోలీసులు ఆప్ నేతలు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. పలు కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చడం ముఖ్యంగా ఘజియాబాద్ సరిహద్దు వద్ద భద్రత ఏర్పాట్లపై పోలీసులు దృష్టిపెడుతున్నారు, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే కౌశాంబీలోని కేజ్రీవాల్ ఉంటున్న భవనం వద్ద క్యాంపును ఏర్పాటుచేశారు. దీంతోపాటు బారికేడ్లను అమర్చారు. -
ఫోన్లలోనూ ప్రమాణస్వీకారం లైవ్!
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మిగిలిన నాయకుల కంటే ఒకడుగు ముందుండే నరేంద్రమోడీ.. మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎటూ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని టీవీ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే, టీవీ అందుబాటులో లేని వాళ్లు, ప్రయాణాలలో ఉన్నవాళ్లకు ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్నామన్న బాధ అక్కర్లేదు. ఎందుకంటే, మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం మొత్తాన్ని ఫోన్లలో కూడా లైవ్‌గా అందించబోతున్నారు. లాండ్‌లైన్, మొబైల్ ఫోన్ల ద్వారా దీన్ని వినచ్చు. ఈ విషయాన్ని వివాకనెక్ట్ అనే మొబైల్ మార్కెటింగ్ సంస్థ తెలిపింది. +91 22 4501 4501 నెంబరుకు కాల్ చేస్తే చాలు.. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఈ కార్యక్రమాన్ని వినచ్చు. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే ఈ నెంబరుకు ఫోన్ చేయాలి. అలాగే, రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. -
మేమంతా వెళ్తున్నాం.. మీరో!
దేశ 15వ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు బాలీవుడ్ తారలు ఉత్సుకతతో తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా తమ తమ భావాలను వాళ్లు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. హేమమాలిని, అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్.. ఇలా అనేకమంది ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. దారిలోనే వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ భావాలు పంచుకున్నారు. ఎవరేమన్నారో ఓసారి చూస్తారా.. Good afternoon! Going to Delhi now to participate in the celebrations! May not be able to talk to u thro the day! Its going to be a busy day — Hema Malini (@dreamgirlhema) May 26, 2014 On my way to Delhi. Looking forward to the beginning of a new era. Jai Ho.:) #SwearingInceremony — Anupam Kher (@AnupamPkher) May 26, 2014 Delhi beckons! Feel privileged, honoured & proud that I'll be able to witness in person the historic moment of swearing-in of Modiji today. — Madhur Bhandarkar (@mbhandarkar268) May 26, 2014 On my way to delhi! Atmosphere even in the aircraft is electric! Everyone is buzzing about the swearing in! #NaMoPm — Vivek Oberoi (@vivek_oberoi) May 26, 2014 -
అతిథుల రాకపై మిత్రుల అలక
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే.. బీజేపీ మిత్ర పక్షాల్లో లుకలుకలు మొదలయ్యాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టమే వారికి వేదిక కాబోతోంది. మోడీ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడమే మిత్రపక్షాల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్లను పిలవడం రెండు పార్టీలకు సుతారమూ ఇష్టం లేదు. లంకతో తమిళులను అణచివేస్తున్న రాజపక్షేను ఆహ్వానించడమేంటంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్ల బ్యాడ్జీ ధరించి రాజపక్షేకు నిరసన తెలియజేస్తానని ప్రకటించారు. ఇక పాక్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే శివసేనకు.. నవాజ్ షరీఫ్ రాక మింగుడుపడటం లేదు. మోడీ సర్కార్ పాక్‌పై దూకుడుగా వ్యవహరిస్తుందని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అయితే షరీఫ్ రాకపై స్పందించేందుకు శివసేన నిరాకరించింది. మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మౌనమే సమాధానమైంది. పాక్ ప్రధాని రాకను అడ్డుకోవాలంటూ సరభ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కూడా పిలుపునిచ్చారు. కొసమెరుపు ఏంటంటే.. బీజేపీ మిత్రపక్షాలు రాజకీయ కారణాల వల్లే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయే తప్ప కాదు కూడదని చెప్పే సాహసం చేయలేదు. లంక, పాక్ అధినేతలకు ఆహ్మానం వద్దంటూ బీజేపీ, మోడీ ఎదుట డిమాండ్ చేయలేకపోయాయి. కారణమేంటంటే గతంలో మాదిరి బీజేపీని బెదిరించే పరిస్థితి లేకపోవడమే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిపూర్ణమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మోడీ సునామీ ప్రభావంతో 282 ఎంపీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మంత్రి పదవులు మొదలు ఇతరత్రా పనుల కోసం మిత్రులే మోడీ ప్రాపకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ కారణం వల్లే ఎన్డీయే మిత్రులు బెదిరింపులకు పోకుండా అసంతృప్తితో సరిపెట్టాయి. -
మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరు కానున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీలో విజయం సాధించగానే కేసీఆర్‌కు మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. సోమవారం భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన సారథ్యంలో బీజేపీకి ఘనవిజయం అందించారు. -
మోడీ ప్రమాణస్వీకారానికి అమితాబ్, రజనీ
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్, కండలవీరుడు సల్మాన్ ఖాన్, సీనియర్ గాయని లతా మంగేష్కర్.. వీళ్లంతా ఈనెల 26వ తేదీన జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈ సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీని లతామంగేష్కర్ ఆశీర్వదించి.. విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక సల్మాన్ ఖాన్ అహ్మదాబాద్‌లో గాలిపటాల ఉత్సవం సందర్భంగా మోడీని కలిశారు. సల్మాన్ తండ్రి, బాలీవుడ్ కథారచయిత సలీంఖాన్ ఎప్పటినుంచో మోడీ అభిమాని. ఇక ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ కూడా మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 2500 మంది అతిథులు పాల్గొనే ఈ కార్యక్రమం ఎప్పటిలా అశోకా హాల్లో కాకుండా.. రాష్ట్రపతి భవన్ ముందున్న మైదానంలో జరగబోతోంది. ఉభయ సభలకు చెందిన మొత్తం 777 మంది ఎంపీలను రాష్ట్రపతి భవన్ ఆహ్వానించింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ఏపీజే అబ్దుల్ కలాంలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. మోడీ తల్లి హీరాబెన్, ఆయన ముగ్గురు సోదరులు కూడా వస్తారని అనుకుంటున్నా, ఇంకా నిర్ధారణ కాలేదు. కొత్త ప్రధాని 20 మంది అతిథులను, కొత్త మంత్రులు ఒక్కొక్కరు నలుగురి చొప్పున అతిథులను పిలవచ్చు. కాగా, ఎప్పటిలా అశోకా హాల్లో కాకుండా, రాష్ట్రపతి భవన్ వెలుపల బహిరంగ ప్రదేశంలో ప్రమాణస్వీకారం చేస్తున్న ప్రధానమంత్రుల్లో మోడీ మూడో వారు. ఇంతకుముందు చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఇలాగే చేశారు.