పట్టాభిషేకం
అట్టహాసంగా జయ పదవీ ప్రమాణం
సీఎంగా జయను చూసి తరించిన జనం
మంత్రి వర్గంలో 28 మందికి చోటు
ఫలించిన అన్నాడీఎంకే శ్రేణుల పూజలు
అన్నాడీఎంకే నేతల పూజలు ఫలించాయి. ఎట్టకేలకు జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో గవర్నర్ కే రోశయ్య అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చేత శనివారం పదవీ ప్రమాణం చేయించడంతో అమ్మ పాలన ప్రారంభ మైంది. అట్టహాసంగా సాగిన ఈ మహోత్సవంలో రాజకీయ, రాజకీయేతర, కోలివుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆస్తుల కేసుల నుంచి జయకు విముక్తి లభించాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే రెండు కోర్కెల సాధనకు అన్నాడీఎంకే శ్రేణులు అల్లాడిపోయారు. రాష్ట్రంలోని ఆలయాలన్నింటిలో పూజలు, హోమాలు నిర్వహించారు. పాలాభిషేకాలు చేయించారు. తలనీలాలు సమర్పించుకున్నారు. మరికొందరు ఏకంగా బలవన్మరణాలకే పాల్పడ్డారు. ఇంత చేసినా ఈనెల 11వ తేదీన జయ నిర్దోషిగా మారగా ఒక్కకోర్కె మాత్రమే తీరిందని డీలాపడిపోయారు. సీఎం పదవి దక్కే నా, ఎర్రబుగ్గ కారులో అమ్మను చూసే అదృష్టం కలిగేనా అని ఆందోళన చెందారు. అన్నాడీఎంకే నేతలతో ఆలయాలు మళ్లీ కిటకిటలాడాయి. అమ్మ అభిమానుల మొరను ఆ దేవుడు ఆలకించాడన్నట్లుగా జయ సీఎం అయ్యారు.
రాహుకాలం దాటిన తరువాత పదవీ ప్రమాణం కోసం ఉదయం 10.30 గంటలకు ఇంటి నుంచి జయ బయలుదేరారు. దిండుగల్లు నుంచి వచ్చిన యువతీయువకులు శరీరం, ముఖం అంతా అన్నాడీఎంకే పార్టీ మూడురంగులు పూసుకుని జయకు అభివాదం చేశారు. వీరి ఉత్సాహాన్ని గమనించిన జయ కారు దిగి వారిని పిలిపించుకున్నారు. కొద్దిసేపు వారితో సంభాషించి ఫొటో కూడా దిగడంతో వారు ఉబ్బితబ్బిబ్బై పోయారు. అక్కడి నుంచి దారిపొడవునా నిలిచి ఉన్న జనానికి అభివాదం చేస్తూ 10.56 గంటలకు ఆడిటోరియం చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ జయకు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. సరిగ్గా 11 గంటలకు గవర్నర్ కే రోశయ్య ప్రాంగణానికి చేరుకోగా జ్ఞానదేశికన్ స్వాగతం చెప్పారు. రోశయ్య వేదికపైకి రాగానే జయ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
తనతో పాటూ ప్రమాణం చేయనున్న 28 మంది మంత్రులను గవర్నర్‌కు పరిచయం చేసిన తరువాత 20 నిమిషాల్లో పదవీ ప్రమాణం ముగిసింది. జయ వేదికపైకి రాగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలంతా జయ జయ ధ్వానాలు చేశారు. జయ ప్రయాణం కారణంగా మెరినాబీచ్‌రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి సచివాలయం వరకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఎలిళగంపై బైనాక్యులర్స్‌తో పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ అగ్రనేతలు హెచ్‌రాజా, ఇల గణేశన్‌లతోపాటు మదురై ఆదీనం స్వామి సైతం హాజరైనారు. జయ పదవీ ప్రమాణం పూర్తికాగానే ఆమె కారుకున్న అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించి జాతీయపతాకాన్ని, పైన ఎర్రబుగ్గను అమర్చారు.
తరలివచ్చిన కోలివుడ్:
ఒకప్పటి నటిగా తమిళ సినీరంగంతో జయలలిత స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నందున ప్రమాణోత్సవానికి కోలివుడ్ తరలివచ్చింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మ పార్టీ నేతలు సైతం రజనీతో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. అమ్మ కోసం రాజీనామా చేసిన ఆర్కే నగర్ ఎమ్మెల్యే రజనీకి పాదాభివందనం చేయడం కలకలం రేపింది. దక్షిణభారత నటీనటుల సంఘం అధ్యక్షులు, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, ఎమ్మెల్యే శరత్‌కుమార్, రజనీకాంత్ పక్కపక్కనే కూర్చుని హడావిడి చేశారు. కార్యక్రమంపై తరచూ ముచ్చటించుకున్నారు. ఓ సందర్భంలో రజనీతో కలిసి శరత్‌కుమార్ సెల్ఫీ తీసుకున్నారు. సంగీత దర్శకులు ఇళయరాజా, నటులు శివకుమార్, కార్తీ, ప్రభు, అర్జున్, రామరాజన్, నటిలు వెన్నిరాడై నిర్మల, సచ్చు, కుయిలీ హాజరయ్యారు.
జయ కేసులో శిక్షపడి ఆమెతోపాటూ నిర్దోషిగా బైటపడిన శశికళ తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చునడం మరో ఆకర్షణైంది. జయ సీఎం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని 207 అమ్మ క్యాంటీన్లలో మూడుపూటలా ఉచితంగా టిఫిన్, భోజనం పంపిణీ చేసేలా చెన్నై కార్పొరేషన్ చైర్మన్ సైదై దొరస్వామి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన జనంతో అమ్మ క్యాంటీన్లు నిండిపోయాయి. ప్రమాణం పూర్తిచేయగానే జయ నేరుగా ఇంటికి చేరుకున్నారు. ఆడిటోరియంకు వెళ్లేపుడు పార్టీ అధినేత్రిగా, తిరిగి వచ్చేపుడు సీఎంగా కారులో వెళుతున్న జయను చూసిన జనం హర్షాతిరేకాలు చేశారు. ఆడ, మగ, వృద్ధులు, యువకులు అనే తేడా లేకుండా వీధుల్లో నృత్యాలు చేశారు. జయ పదవీప్రమాణ స్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని జనం చూసేందుకు వీలుగా బీచ్‌కు సమీపంలో భారీ తెరను అమర్చారు.