అతిథుల రాకపై మిత్రుల అలక
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే.. బీజేపీ మిత్ర పక్షాల్లో లుకలుకలు మొదలయ్యాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టమే వారికి వేదిక కాబోతోంది. మోడీ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడమే మిత్రపక్షాల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్లను పిలవడం రెండు పార్టీలకు సుతారమూ ఇష్టం లేదు.
లంకతో తమిళులను అణచివేస్తున్న రాజపక్షేను ఆహ్వానించడమేంటంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్ల బ్యాడ్జీ ధరించి రాజపక్షేకు నిరసన తెలియజేస్తానని ప్రకటించారు. ఇక పాక్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే శివసేనకు.. నవాజ్ షరీఫ్ రాక మింగుడుపడటం లేదు. మోడీ సర్కార్ పాక్పై దూకుడుగా వ్యవహరిస్తుందని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అయితే షరీఫ్ రాకపై స్పందించేందుకు శివసేన నిరాకరించింది. మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మౌనమే సమాధానమైంది. పాక్ ప్రధాని రాకను అడ్డుకోవాలంటూ సరభ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కూడా పిలుపునిచ్చారు.
కొసమెరుపు ఏంటంటే.. బీజేపీ మిత్రపక్షాలు రాజకీయ కారణాల వల్లే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయే తప్ప కాదు కూడదని చెప్పే సాహసం చేయలేదు. లంక, పాక్ అధినేతలకు ఆహ్మానం వద్దంటూ బీజేపీ, మోడీ ఎదుట డిమాండ్ చేయలేకపోయాయి. కారణమేంటంటే గతంలో మాదిరి బీజేపీని బెదిరించే పరిస్థితి లేకపోవడమే. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిపూర్ణమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మోడీ సునామీ ప్రభావంతో 282 ఎంపీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మంత్రి పదవులు మొదలు ఇతరత్రా పనుల కోసం మిత్రులే మోడీ ప్రాపకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ కారణం వల్లే ఎన్డీయే మిత్రులు బెదిరింపులకు పోకుండా అసంతృప్తితో సరిపెట్టాయి.