‘పఠాన్‌కోట్’పై చిటపటలు | War on Pathankot attack | Sakshi
Sakshi News home page

‘పఠాన్‌కోట్’పై చిటపటలు

Published Wed, Jan 6 2016 2:10 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

War on Pathankot attack

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో మోదీ సర్కారుపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మిత్రపక్షం శివసేనా మోదీపై విమర్శలు గుప్పించింది. పాక్‌ పట్ల ఆయన  వైఖరిని తప్పుపట్టింది. ప్రపంచాన్ని ఒక్కటి చేయడాన్ని పక్కనపెట్టి దేశంపై దృష్టి పెట్టాలని  హితవు పలికింది. ‘నవాజ్ షరీఫ్‌తో మోదీ కప్పు టీ తాగి వచ్చినందుకు పాక్ ముష్కరులు ఏడుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్నారు’ అని తన పత్రిక సామ్నాలో విమర్శించింది. మోదీ ఇటీవల పాక్ వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని తప్పుపట్టింది. ‘మేం పాక్‌తో  చర్చలకు వ్యతిరేకం కాదు.

అలాగనీ దేశ భద్రత, సమగ్రత విషయంలో రాజీపడబోం’ అని పేర్కొంది. కాంగ్రెస్ విమర్శలు వ్యాఖ్యలు జాతి వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేలా ఉన్నాయని బీజేపీ  దుయ్యబట్టింది. ‘ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన ఈ సమయంలో అమరుల త్యాగాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది’ అని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నిప్పులు చెరిగారు. కాగా,  పఠాన్‌కోట్ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల శవాలను పందిచర్మంలో పెట్టిన తర్వాత పూడ్చిపెట్టాలని త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ అన్నారు.
 
 320 మంది కమాండోలు
 తక్షణమే పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌కు వెళ్లాలని జనవరి 1న కేంద్ర హోం శాఖ నుంచి ఎన్‌ఎస్‌జీ ప్రధాన కార్యాలయానికి సందేశం అందగానే.. కమాండో టీం సిద్ధమైంది. తొలి విడతలో 160 మంది  పఠాన్‌కోట్ చేరుకోగా 2, 3 తేదీల్లో మరో రెండు విడతల్లో 80 మంది చొప్పున బ్లాక్‌క్యాట్స్ పఠాన్‌కోట్ చేరుకున్నారు. 320 మంది కమాండోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆపరేషన్‌లో ఎన్‌ఎస్‌జీ ‘బ్లాక్‌క్యాట్’ కమాండోలు ఎంపీ 5 తుపాకులు, గ్లాక్ పిస్టల్స్, కార్నర్ షాట్ గన్స్, తలుపులు, గోడలను బద్దలుకొట్టే బస్టర్ బాంబ్స్‌ను విరివిగా ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement