పాక్‌లో మసూద్ అరెస్ట్ | Pathankot Attack: Jaish-e-Mohammed Chief Masood Azhar Detained By Pakistan, Say Reports | Sakshi
Sakshi News home page

పాక్‌లో మసూద్ అరెస్ట్

Published Thu, Jan 14 2016 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

పాక్‌లో మసూద్ అరెస్ట్ - Sakshi

పాక్‌లో మసూద్ అరెస్ట్

 పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు, మరికొందరు ఉగ్రవాదులు అరెస్టు
* పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటన
* ఉగ్రవాదంపై భారత్‌తో కలసి పనిచేస్తామని వెల్లడి
* అరెస్టుపై అధికారిక సమాచారం లేదన్న భారత్
* ప్రధానితో సుష్మాస్వరాజ్, విదేశాంగ అధికారుల భేటీ
* నేడు మళ్లీ సమావేశమై పాక్‌తో చర్చలపై నిర్ణయం


 ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఘటన తర్వాత భారత్ తీసుకొచ్చిన ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. ఈ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు రెహ్మాన్ రవూఫ్‌లను అరెస్టు చేసింది. వీరితోపాటు పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతోపాటు జైషే సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం (ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్, ఐఎస్‌ఐ చీఫ్, హోం, ఆర్థిక మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్, పలువురు కీలక నేతలు హాజరయ్యారు) పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు పకడ్బందీగా పనిచేయాలని.. ఈ ప్రయత్నంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.

ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాటు పఠాన్‌కోట్ ఘటనలో లోతైన విచారణ కోసం ఐఎస్‌ఐ, ఎంఐ, ఐబీలతో పాక్ ప్రధాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం జనవరి 15న (శుక్రవారం) ఇస్లామాబాద్‌లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ భేటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడికి వ్యూహరచన పాకిస్తాన్‌లో జరిగినట్లు, జైషే ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లు ఆధారాలు అందజేసిన భారత్.. బాధ్యులపై చర్చలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో గతవారంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వరుసగా రెండ్రోజులు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో బంతిని పాక్తిసాన్ కోర్టులోకి నెట్టినందున.. ఏం చేయాలనే దానిపై ఈ భేటీల్లో చర్చించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతోపాటు మరిన్ని వివరాలు పంపించాలని భారత్‌ను కోరారు. జనవరి 2న జైషే ఉగ్రవాదులే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడ్డారని ఆధారాలు అందజేసిన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. వీరిని అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేయటంపైనా చర్చించారు. దీనికి అనుగుణంగానే.. పాక్‌లో తలదాచుకుని.. భారత్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్న జైషే చీఫ్, అతని సోదరులతోపాటు.. పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేయటం అనివార్యమైంది.

అయితే.. మసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. అజర్ అరెస్టుపై తమకు అధికారిక సమాచారం అందలేదని భారత్ తెలిసింది. పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడినట్లు వార్తలొస్తున్నా.. తమకు సమాచారం రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాన మంత్రితో విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్, అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ భేటీ అయ్యారు.
 
 అజర్‌పై భారత్ నజర్
 1994లోనే శ్రీనగర్‌లో హర్కతుల్ జిహాదీ సాయంతో అల్లర్లు సృష్టించేందుకు జైషే చీఫ్ మసూద్ అజర్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో భారత బలగాలు అజర్‌ను అరెస్టు చేశాయి. అప్పటికే ప్రమాదకర ఉగ్రవాది, వ్యూహకర్తగా పేరున్న మసూద్ అరెస్టుతో కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మసూద్‌ను విడిపించేందుకు 1995లో కొందరు ఉగ్రవాదులు కశ్మీర్‌కు వచ్చిన విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. ఇందులోనుంచి ఒక టూరిస్టు తప్పించుకోగా.. మిగిలిన వారిని ఉగ్రవాదులు చంపేశారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో.. 1999 డిసెంబర్లో 155 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం (ఐసీ184)ను మసూద్ సోదరుడు ఇబ్రహీం నేపథ్యంలోని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌లో (అప్పడు తాలిబాన్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం) విమానాన్ని ల్యాండ్ చేసి.. మసూద్‌తో పాటు మరో ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను విడిపించుకున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడికి కూడా మసూద్ వ్యూహరచన చేశారు. అప్పడు భారత్ ఒత్తిడితో జైషే చీఫ్‌ను అరెస్టు చేసినా..2002లో విడుదల చేశారు. అప్పటినుంచి అజర్‌పై భారత్ దృష్టిపెట్టింది.
 
 విధానం నిర్ణయించటానికి షరీఫ్ ఎవరు?
 పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ పాత్రమై అనుమానాలు తలెత్తుతున్న సమయంలో.. పాకిస్తాన్ మాజీ రాయబారి అషఫ్ ్రజహంగీర్ కాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో విదేశాంగ విధానం నిర్ణయించటంలో పాకిస్తాన్ ప్రధాని ఒక్కరే నిర్ణయం తీసుకోలేరని.. ఆర్మీ మద్దతు లేకుండా అడుగు ముందుకేయలేరని స్పష్టం చేశారు. ‘మోదీ స్టాప్ ఓవర్ విషయంలో పాక్ ఆర్మీ స్పందన ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి పాక్ పర్యటించి వెళ్లాకే కార్గిల్ యుద్ధం జరిగింది. ఇప్పుడ మోదీ పర్యటన తర్వాతే పఠాన్‌కోట్ ఘటన జరిగింది’అని డాన్ పత్రికకు రాసిన వ్యాసంలో కాజీ పేర్కొన్నారు. ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశంలో ఆర్మీ చీఫ్ పాల్గొన్నంత మాత్రాన ప్రభుత్వం-ఆర్మీ మధ్య అన్నీ సవ్యంగా ఉన్నట్లు కాదని ఆయన అన్నారు. భారత్‌తో దౌత్యపర సంబంధాల విషయంలో ఆర్మీ నిర్ణయమే కీలకమవుతుందని వెల్లడించారు. స్పష్టమైన ఆధారాలిచ్చి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న కాజీ.. బాధ్యులపై చర్యలుంటాయని షరీఫ్ హామీ ఇచ్చినా.. ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారనుకోలేదన్నారు.
 
 పాక్ చర్యపై భారత్‌లో మిశ్రమ స్పందన
 జైషే చీఫ్ అరెస్టుపై బీజేపీ, కాంగ్రెస్ జాగ్రత్తగా స్పందించగా శివసేన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక శాంతి చర్చలకు పాకిస్తాన్ తీసుకున్న చర్యలను  ఆహ్వానిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. అభివృద్ధిని కోరుకునే భారత్-పాక్ దేశాల ప్రజలు ఈ చర్యలను హర్షిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ తెలిపారు. కాగా, పాక్ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ కఠినంగా వ్యవహరించటంలో వెనక్కు తగ్గొద్దని సూచించింది. చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు నవాజ్ షరీఫ్ చిత్తశుద్ధితో పనిచేస్తే.. పాకిస్తాన్‌లో గొప్ప రాజనీతిజ్ఞుడుగా ఖ్యాతి సంపాదిస్తారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. జేడీయూతోపాటు ఇతర పార్టీలు కూడా పాక్ నిర్ణయాన్ని స్వాగతించగా.. శివసేన మాత్రం అజర్ అరెస్టుపై పెదవి విరిచింది. చర్చల ప్రక్రియకు ఇదేం పెద్ద అనుకూల అంశం కాబోదని.. ఉగ్రవాదులను అరెస్టు చేయటం, తర్వాత విడుదల చేయటం పాకిస్తాన్‌కు అలవాటేనని వ్యాఖ్యానించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement