భారత్‌తో రెండుసార్లు యుద్ధం జరిగేందుకు ఓపికగా ఎదురుచూసిన, మిలిటరీ జనరళ్లతో కలిసి కుట్రలు పన్నిన జుల్ఫికర్ అలీ భుట్టో ఆ తరువాతి కాలంలో మన దాయాది పాకిస్థాన్ అధ్యక్షుడు అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పుడు 51 ఏళ్ల తరువాత ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి, జుల్ఫికర్ అలీ భుట్టో మనుమడు బిలావల్ భుట్టో జర్దారీ కూడా అచ్చం అలాంటి కుట్రలే పన్నుతున్నట్లుగా కనిపిస్తోంది. భారత ప్రధానిని ‘గుజరాత్ కసాయి’గా బిలావల్ విమర్శించినప్పటికీ అది సొంతింటి శక్తులపై ఎక్కుపెట్టిన అస్త్రంగానే చూడాలి.
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, భుట్టో–జర్దారీల పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండూ కలిసి పాకిస్తాన్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు... ఈ రెండు పార్టీలూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తగిన సంబంధాలు ఏర్పరచుకున్నాయి. కార్గిల్ యుద్ధంతో చెలరేగిన ఘర్షణపూర్వక వాతావరణాన్ని కొద్దిగానైనా తేలికపరిచేందుకు ఈ సంబంధాలు ఉపయోగపడతాయని ఆ రెండు పార్టీలూ భావిస్తూండవచ్చు. నరేంద్ర మోదీ బహూకరించిన తల పాగాతో నవాజ్ షరీఫ్ తన కుటుంబ వివాహంలో కనబడటం ప్రాచుర్యం పొందిన అంశమే.
పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీమ్ మునీర్ ఈ మధ్యే పదవీచ్యుతుడైన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పట్ల సానుకూలత కలిగిన వాడని అటు అక్కడి కిందిస్థాయి అధికారులతోపాటు భారతీయ నిఘా వర్గాలూ భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మునీర్ స్వయంగా ఖండించినప్పటికీ ఇమ్రాన్‌కు సంబంధించిన సెక్స్ టేపులు సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడం ఒక సందేశమనే అర్థం చేసుకోవాలి.
అంతేకాకుండా, షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కూలిపోయే స్థితిలో ఉందనీ తెలుసు. షాబాజ్‌ను తప్పించడం సైనిక జనరళ్లకు పెద్ద సమస్య కాకపోవచ్చు. కాకపోతే ఆయన స్థానంలో నవాజ్, ఆయన కుమార్తె మరియం పాక్ రాజకీయాల్లో ప్రధాన భూమిక వహించే ప్రమాదం ఉంటుంది.
భారత్‌తో సంబంధాలు, భద్రత విషయాల్లో సైన్యంతో తగవు పెట్టుకున్నందుకే నవాజ్ పదవి పోయిందన్నది బహిరంగ రహస్యం. అలాగే మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్‌ను జైలుకు పంపించేందుకు నవాజ్ చేసిన ప్రయత్నాలను కూడా సైన్యం అంత సులువుగా క్షమించలేకపోతోంది. వీటన్నింటి సారాంశం ఒక్కటే... పాకిస్తాన్‌లో అధికారం తమ చెప్పుచేతుల్లో ఉండే వ్యక్తికి అందాలి. ఈ అవకాశాన్ని వాడుకునే లక్ష్యంతోనే బిలావల్ భుట్టో తన తాత జుల్ఫికర్ అలీ భుట్టో ఆడినట్లుగానే జాతీయవాదాన్ని తలకెత్తుకుంటున్నారు. తద్వారా సైన్యానికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
వెయ్యేళ్ల యుద్ధం?
1965 భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో భారత సేనలు లాహోర్‌కు కిలోమీటర్ల దూరంలో ఉండగా, జుల్ఫికర్ అలీ భుట్టో ఐరాస భద్రతా సమితిలో ఓ భారీ ప్రసంగం చేశారు. ‘‘భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధం చేస్తాం’’ అని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రసంగం పాక్ ప్రజలను ఉత్తేజపరిచింది. పాక్ అప్పటికే ఓడి పోయిందనీ, భవిష్యత్తు గెలుపు కలనే మంత్రి రేడియో రూపంలో అందిస్తున్నారనీ పాపం ప్రజలకు తెలియరాలేదు.
అయితే ప్రధానిగా జుల్ఫికర్ అలీ భుట్టో కొత్త అవతారం ఎత్తాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య వాదిగా మారినట్లు కనిపించడం ద్వారా ఆయన 1965, 1971 యుద్ధాల ఓటమిని ప్రజలు మరచిపోయేలా చేయగలిగారు. పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు ఉన్న అవకాశం కాస్తా 1958 నాటి మిలిటరీ కుట్రతో తుడిచిపెట్టుకుపోయింది. దీని వెనుక కూడా జుల్ఫికర్ హస్తముందని అంచనా.
హుసేన్ సుహ్రావర్దీ (1956 – 57 ప్రధానమంత్రి) లాంటి తూర్పు పాకిస్తాన్ నేతలు ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకున్నారని జుల్ఫికర్ అప్పట్లో వాదించారు. రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనే విప్లవం పుట్టుకొచ్చిందనీ, అన్నిం టినీ చక్కదిద్దాల్సి వచ్చిందనీ మిలిటరీ కుట్రను సమర్థించుకున్నారు.
1965లో కశ్మీర్ విషయంలో భారత్‌తో యుద్ధానికి జనరల్ అయూబ్‌ను రెచ్చగొట్టింది కూడా జుల్ఫికరే. కోవర్టు దళాల ద్వారా భారత్‌పై దాడి చేస్తే అది సంప్రదాయ పద్ధతుల్లో తిప్పికొట్ట లేదని జనరల్ అయూబ్‌కు నూరిపోశారు. ‘‘అస్సాంలోని నాగాలు, లుషియాలను, పంజాబ్‌లోని సిక్కులనూ రెచ్చగొట్టి యుద్ధానికి దిగాలి’’ అని కూడా జుల్ఫికర్ చెప్పుకున్నారు.
ఇది కాస్తా అయూబ్‌పై ప్రభావం చూపింది. అయితే యుద్ధంలో ఈ అంచనాలన్నీ తారు మారవడంతో జుల్ఫికర్ దీనివెనుక అమెరికా హస్తముందన్న కొత్త రాగం అందుకున్నారు. ఆ తరువాత 1966 ప్రాంతంలో జుల్ఫికర్ కుట్రలు బట్టబయలయ్యాయి. ఉద్యోగమూ పోయింది. జైల్లో బంధింపబడ్డారు. అయితే జైల్లో అష్టకష్టాలు పడ్డానని చెప్పుకోవడం జుల్ఫికర్‌ను ప్రజల దృష్టిలో హీరోను చేసింది.
తూర్పు పాకిస్తాన్ సంక్షోభం
మిలిటరీ ప్రభుత్వపు రీతులతో విసుగు చెందిన పాక్ ప్రజలు జుల్ఫికర్ రూపంలో ఓ హీరోను చూసుకున్నారు. అందుకే 1970లో జుల్ఫికర్ మావో టోపీ, గ్రీన్ జాకెట్‌తో ఎన్నికల్లో పోటీ చేశారు. ఇస్లాం, సోషలిజం రెండింటినీ కలగలిపి పాకిస్తాన్‌ను రక్షిస్తామని ప్రచారం చేశారు. ముల్లాలను సంతృప్తి పరిచేందుకుగానూ ఇస్లాం కోసం ‘జిహాద్’కు దిగుతామనీ, పాకిస్తాన్‌లో మాత్రమే కాకుండా... ప్రపంచ అంతటా ఇది సాగుతుందనీ నమ్మబలికారు. ‘‘భారత్‌లో ముస్లింల రక్తం చిందుతూంటే చేతులు కట్టుకుని ఉండం’’ అని ప్రకటించారు.
ఫీల్డ్ మార్షల్ అయూబ్ స్థానంలో అప్పటికి ఏడాది క్రితమే జనరల్ యాహ్యాఖాన్ అత్యున్నత పదవిలోకి చేరారు. జనరల్ యాహ్యాఖాన్ కూడా ‘‘దేశం మళ్లీ ప్రజాస్వామ్యం పట్టాలెక్కడం చూడాలని కుతూహలంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే, తూర్పు పాకిస్తాన్‌లో జనాభా ఎక్కువ. అక్కడ ఎన్నికల్లో విజయం సాధించడం అధికారాన్ని మరింత దగ్గర చేస్తుంది. 1970లో షేఖ్ ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ ఏకంగా 160 సీట్లు సాధించగా, జుల్ఫికర్ పార్టీ 81 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కానీ అధికారం కోల్పోయేందుకు జుల్ఫికర్ ఏమాత్రం అంగీకరించలేదు. సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందా మని ప్రతిపాదించారు. తద్వారా తాను పశ్చిమ పాకిస్తాన్ ప్రధానిగా కొనసాగవచ్చునని ఆశించారు. జనరల్ యాహ్యాఖాన్ ఈ వాదనను వ్యతిరేకించారు. జుల్ఫికర్ ప్రతిపాదనను అంగీకరిస్తే తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లకు అధికార పంపిణీ చేయాల్సి ఉంటుందని భావించారు. ముజీబ్‌కు అధికారాన్ని నిరాకరించడం ద్వారా జుల్ఫికర్ జనరల్ యాహ్యాఖాన్ ఆందోళనను నిజం చేశారు.
తూర్పు పాకిస్తాన్‌లో అల్లర్లు చెలరేగడం, భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు పెరగడంతో ముజీబ్ వ్యతిరేకి నూరుల్ అమీన్‌కు పగ్గాలు అప్పగించి, జుల్ఫికర్‌ను డిప్యూటీ ప్రధానిని చేశారు. పదమూడు రోజుల కాలానికి జల్ఫికర్ మిలిటరీ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ అధికారం చేపట్టారు. ఈ ముచ్చట ఎక్కువ కాలం నిలవకపోగా పాకిస్తాన్ రెండుగా చీలిపోయేందుకు కారణమైంది. ఇప్పుడు కూడా జుల్ఫికర్ తనను తాను రక్షకుడిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘హిమాలయాల కంటే పొడవైన వాణ్ణి నేను’, ‘నాక్కొంచెం సమయం ఇవ్వండి’ అంటూ పాకిస్తాన్ ప్రజలతో గొప్పలుపోయారు.
యుద్ధంలో ఓటమికి జనరల్ యాహ్యా ఖాన్ కారణమనీ, అతడి తాగుడు, తిరుగుబోతుతనం వల్లే భారత్‌తో ఓడామనీ ప్రచారంలో పెట్టారు. ఢాకా న్యాయవాది హుస్నా షేఖ్‌తో తన సొంత వ్యవహారాన్ని మాత్రం కప్పిపుచ్చారు. నెహ్రూ సోదరి విజయ లక్ష్మీ పండిట్ కుమార్తె రీటా దార్ పట్ల జుల్ఫికర్ చేసిన, ప్రజాబాహుళ్యంలోకి ఎక్కువగా రాని అసభ్య వ్యాఖ్యలను స్టాన్లీ వోల్‌పెర్ట్ గ్రంథస్తం చేశారు.
జుల్ఫికర్ అలీ భుట్టో పిచ్చి చేష్టలు చాలానే ఉన్నాయి. జనరల్ జియా ఉల్ హక్‌ను విదేశీ అతిథుల ముందు ‘నా కోతి’ అని వ్యాఖ్యా నించి హేళన చేయడం వాటిల్లో ఒకటి. వీటి ఫలితమే ఆర్థి కంగా దేశం చితికిపోయిన సందర్భంలో ఆ ‘కోతి’ కాస్తా జుల్ఫికర్‌ను ఉరికొయ్య లకు వేలాడదీసేలా చేసింది. తన తాత మాదిరిగానే ఇప్పుడు బిలావల్ కూడా జాతీయవాదం, మిలిటరీ జనరళ్ల కృపా కటాక్షాల ఆధారంగా రాజకీయంగా పైమెట్టుకు ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల ఒరిగే ఒక ఫలితం ఏమిటంటే, పాకిస్తాన్ రాజకీయ యవనికపై మిలటరీ పట్టు మరింత బిగుసుకోవడం!
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ద ప్రింట్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment